అయ్యో జమైకా! 

17 Apr, 2018 00:51 IST|Sakshi

బోల్ట్‌ రిటైర్మెంట్‌ తర్వాత స్ప్రింట్‌లో మారిన పరిస్థితులు

గోల్డ్‌కోస్ట్‌: ఉసేన్‌ బోల్ట్‌... పరుగుల చిరుత... దశాబ్దంపైగా ట్రాక్‌పై అతడిదే హవా... పోటీ ఏదైనా దేశానికి తనో పతకాల పంట...! కానీ బోల్ట్‌ రిటైర్మెంట్‌ తర్వాత అంతా మారిపోయింది. అతడు లేకుండా కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొన్న జమైకా స్ప్రింట్‌ విభాగంలో (100, 200 మీటర్లు) ఒక్కటంటే ఒక్క స్వర్ణమూ గెలవలేకపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న యోహాన్‌ బ్లేక్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. 100 మీటర్ల విభాగంలో ప్రపంచ మాజీ చాంపియన్‌ అయిన బ్లేక్‌ ఈసారి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. మహిళల 200 మీటర్ల పరుగులో రెండుసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌ ఎలైన్‌ థాంప్సన్‌ గాయం కారణంగా పతకం తేలేకపోయింది. మరోవైపు ఈ క్రీడల్లో 4గీ100 మీటర్ల పరుగులో తమ రిలే బృందం స్వర్ణ పతకం నెగ్గడంలో విఫలమవడంతో మరీ తొందరగా రిటైరయ్యావంటూ కొందరు సోషల్‌ మీడియాలో బోల్ట్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు.

అయితే... తాజా ప్రదర్శనను జమైకా ఒలింపిక్‌ చీఫ్‌ క్రిస్టోఫర్‌ సముదా ఆశావహంగా తీసుకున్నారు. బోల్ట్‌ ప్రభావం తమపై చాలా ఉందంటూనే, దేశంలో ప్రతిభకు లోటు లేదని పేర్కొన్నారు. స్ప్రింట్‌లో స్వర్ణాలు సాధించకున్నా ఈసారీ అథ్లెటిక్సే జమైకాకు పతకాలు తేవడంలో పెద్ద దిక్కు అయ్యింది. జమైకా ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 11 కాంస్యాలతో కలిపి మొత్తం 27 పతకాలు సాధించగా అందులో 25 అథ్లెటిక్స్‌ నుంచే రావడం విశేషం.    

మరిన్ని వార్తలు