ఫైనల్‌ చాన్స్‌కుపోరు!

10 May, 2019 11:38 IST|Sakshi
నెట్‌ప్రాక్టీస్‌లో జడేజా కొట్టిన షాట్‌ను ఆసక్తిగా తిలకిస్తున్న అతని చెన్నై సహచరులు రైనా, రాయుడు

విశాఖ వేదికగా నేడు చెన్నై, ఢిల్లీ హోరాహోరీ

అనుభవం ఆసరాగా సీఎస్‌కే.. అదృష్టం అండగా డీసీ

ఐపీఎల్‌ రెండో క్వాలిఫయిర్‌కు రంగం సిద్ధం

గెలిచే జట్టు హైదరాబాద్‌లో ముంబై ఇండియన్స్‌తో ఢీ

విశాఖ వీరాభిమానులకు మరో పసందైన క్రికెట్‌ విందు

విశాఖ స్పోర్ట్స్‌: ఉవ్వెత్తున ఎగసే ఉత్సాహ కెరటం ఒకటి.. దూకుడుతో దూసుకొచ్చే నవ తరంగం వేరొకటి. ఎదురే లేని రీతిలో హోరెత్తే ప్రతిభా ప్రభంజనం ఒకటి.. ఇప్పుడిప్పుడే పుంజుకుంటూ ఉత్తేజంతో ఉరకలేస్తున్న నవ నయగారా జలపాతం వేరొకటి. ఆ రెండూ ఐపీఎల్‌ క్రికెట్‌ టోర్నీలో శుక్రవారం విశాఖలోని వైఎస్సార్‌ స్టేడియంలో ఢీకొనబోయే చెన్నై సూపర్‌ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లని ఈపాటికే అర్థమై ఉంటుంది. అపార శక్తితో, అనంత విశ్వాసంతో ఊపు మీదనున్న సీఎస్‌కే, ఇప్పుడిప్పుడే జోరెక్కి, ఇదే తుది అవకాశమన్నట్టు తలపడే డీసీ.. ముఖాముఖీ పోరాడబోయే ఈ మ్యాచ్‌.. ఫైనల్‌కు ముందు ఫైనల్‌ అంత ఉత్కంఠ కలిగించేదని అవగతమయ్యే ఉంటుంది.

అసాధారణ పోరు..: నిజమే.. అపార అనుభవం ఆలంబనగా ఉన్న చెన్నై, యువ రక్తం ఉరకలేస్తున్న ఢిల్లీ జట్లు శుక్రవారం తలపడబోయే ఈ క్వాలిఫయిర్‌ మ్యాచ్‌ క్రికెట్‌ అభిమానులకు పండగలా, దండిగా సందడిని అందజేయడం గ్యారంటీ అని ఇప్పటి పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలవనున్న జట్టు హైదరాబాద్‌లో జరగనున్న ఫైనల్లో ముంబై ఇండియన్స్‌ను సవాలు చేయబోతోంది. అందుకే వైఎస్సార్‌ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌కు ఎక్కడ లేని ప్రాధాన్యత ఏర్పడింది. ఇరుజట్లు బౌలింగ్‌లో మేటిగా ఉండటం... స్పి న్నర్లు పిచ్‌ను అనువుగా మార్చుకుని బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెచ్చేవారే కావడంతో ఫ్లాట్‌ పిచ్‌పై పరుగుల వరద ఎలా పారుతుందో వేచి చూడాల్సిందే. చెన్నై పేసర్‌ దీపక్‌ చహర్‌ పవర్‌ప్లేలో చెలరేగిపోతున్నాడు. ఐíపీఎల్‌లో ఇరుజట్లు 20సార్లు తలపడగా సూపర్‌ కింగ్స్‌ 14సార్లు విజయం సాధించగా ఢిల్లీ ఆరుసార్లు మాత్రమే విజయం సాధించింది.  ప్రస్తుత సీజన్‌లో రెండు రౌండ్లలోనూ సూపర్‌కింగ్సే విజయం సాధించింది. చెన్నై జోరుకు ఢిల్లీ అడ్డుకుంటుందో లేక చెన్నై ఈ సీజన్‌లో ఢిల్లీపై మూడోసారి విజయాన్ని సాధించి మరోసారి టైటిల్‌ పోరుకు సిద్ధమౌతుందో శుక్రవారం రాత్రి తేలిపోతుంది.

ప్లే ఆఫ్‌ కింగ్‌ చెన్నై: చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుసగా 2010,11 సీజన్లలో టైటిల్‌ సాధించగా...తిరిగి 2018లోనూ చాంపియన్‌గా నిలిచింది. అయితే ఏ సీజన్‌లోనూ లీగ్‌ దశలో టాప్‌ పొజిషన్‌కు చేరుకోకుండానే ప్లేఆఫ్‌ ఆడి చాంపియన్‌షిప్‌ సాధించడం విశేషం.  అయితే 2013, 15ల్లో లీగ్‌ దశలో టాప్‌ పొజిషన్‌కు చేరినా చాంపియన్‌గా నిలవలేకపోయింది.  ప్రస్తుత సీజన్‌లో సయితం లీగ్‌లో విజేతగా నిలవలేక పోయిన చెన్నై మరోసారి టైటిల్‌ పోరుకు అర్హత సాధించేందుకు శుక్రవారం అమీతుమీ తేల్చుకోనుంది.

ఫైనల్‌కు చేరని ఢిల్లీ: గడచిన ఐíపీఎల్‌ సీజన్స్‌ వేటిలోనూ చాంపియన్‌గా నిలవలేక పోయిన ఢిల్లీ కాపిటల్స్‌ ఈసారి లీగ్‌ దశలో చక్కగా రాణించింది. ఎలిమినేషన్‌లో సన్‌రైజర్స్‌పై గెలిచిన ఊపుతో క్వాలిఫైయింగ్‌ మ్యాచ్‌కు సిద్ధమౌతోంది. బుధవారం హైదరాబాద్‌తో మ్యాచ్‌ వైఎస్‌ఆర్‌ స్టేడియంలోనే జరగడంతో పిచ్‌పై పూర్తి అవగాహనతో ఉంది.  ఏడేళ్ళ విరామం అనంతరం ప్లేఆఫ్‌కు చేరి న ఢిల్లీ జట్టు ఈసారైనా టైటిల్‌ పోరుకు అర్హత సాధి స్తుందేమో తేలిపోనుంది. ఢిల్లీ ఈసారైనా చివరి హార్డిల్‌ దాటుతుందా అనేది నేటి రాత్ని ఏడున్నరకు ప్రారంభం కానున్న రెండో క్వాలిఫైయింగ్‌ మ్యాచ్‌లో తేలిపోనుంది.

ముఖాముఖిలో చెన్నైదే పైచేయి
ప్లేఆఫ్‌ తొలి మ్యాచ్‌లో ఓటమితో చెన్నై టైటిల్‌ పోరు అర్హత మ్యాచ్‌కు సిద్ధమౌతుండగా తొలి మ్యాచ్‌లో  ఎలిమినేషన్‌లో విజయం సాధించి అత్మవిశ్వాసంతో ఢిల్లీ జట్టు సై అంటోంది.  లీగ్‌ దశలో ఆడిన రెండు ముఖాముఖి పోటీల్లోనూ ఢిల్లీపై చెన్నై విజయకేతనం ఎగురవేసింది. ఢిల్లీ సొంతగడ్డపై జరిగిన లీగ్‌ తొలి దశ మ్యాచ్‌లో సీఎస్‌కే ఆరు వికెట్ల ఆ«ధిక్యంతో గెలిచింది.  చెన్నైలో జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో సీఎస్‌కే 80 పరుగుల భారీ ఆధిక్యంతో విజయభేరి మోగించింది.

సాయంత్రం సాధన
ఐపిఎల్‌ ఫైనల్‌ పోరుకు అర్హత సాధించేందుకు చెన్నై సూపర్‌ కింగ్స్, ఢిల్లీ కాపిటల్స్‌ జట్లు గురువారం వైఎస్‌ఆర్‌ స్టేడియంలోని నెట్స్‌లో శ్రమించాయి.  చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ధోనీ, ఢిల్లీ కాపిటల్స్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ మినహా ఇరుజట్ల ఆటగాళ్ళు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేసారు. ఎండలు మండుతుండటంతో ఇరుజట్లుసాయంత్రం స్టేడియంకు చేరుకుని ఫ్లడ్‌లైట్ల వెలుతురులోనే ప్రాక్టీస్‌ చేశాయి.ఐపీఎల్‌ రెండో ఫైనలిస్ట్‌ ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. చెన్నైపై నెగ్గి ఇప్పటికే ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న ముంబై ఇండియన్స్‌తో ఢీకొట్టే ఛాన్స్‌ కోసం శుక్రవారం విశాఖ వేదికగా జరిగే రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఢిల్లీ, చెన్నై తలపడనున్నాయి. ఇందుకోసం రెండు జట్లు గురువారంఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో నెట్‌ ప్రాక్టీస్‌తో తీవ్ర కసరత్తులు చేశాయి.  సెమీఫైనల్‌ లాంటిఈ మ్యాచ్‌ కోసం విశాఖ క్రీడాభిమానులు
ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు