సచిన్‌.. మీరు మా ఇంటికి వస్తారా

16 Dec, 2019 11:54 IST|Sakshi

చెన్నై: ‘చాలాకాలం కిందట చెన్నై తాజ్‌ కోరమాండల్‌ హోటల్‌లో ఓ అభిమానిని కలిశాను. నా ఎల్బో గార్డ్‌ విషయంలో అతడు చేసిన సూచన నన్ను ఆశ్చర్యపరిచింది. అతని సూచనల ప్రకారం నేను ఎల్బోగార్డ్‌ను మార్చుకున్నా కూడా. అతనిప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. తెలిస్తే కలవాలని అనుకుంటున్నా’ అన్నది మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ట్వీట్‌ చేశాడు. ఇలా సచిన్‌ ట్వీట్‌ చేశాడో లేదో అప్పుడ ఆ అభిమాని లైన్‌లోకి వచ్చేశాడు. అతని పేరు గురుప్రసాద్‌. ఈ 46 ఏళ్ల ఈ అసిస్టెంట్‌ స్టాక్‌బ్రోకర్‌ గతంలో ఓ స్టార్‌హోటల్లో సెక్యూరిటీ గార్డ్‌. కానీ శనివారంనాడు ఒక్కసారిగా అతడు మీడియా దృష్టిలో పడ్డాడు. అతడితో మాట్లాడేందుకు మీడియా విపరీతమైన ఆసక్తి చూపెట్టింది. తన ఇంటికి వస్తే సచిన్‌ను సాదరంగా ఆహ్వానిస్తానని గురు ప్రసాద్‌ చెప్పుకొచ్చాడు. తన కుటుంబ సభ్యుల్ని కలవడానికి సచిన్‌ కాస్త సమయం ఇవ్వాలని అభ్యర్థించాడు.

అప్పట్లో ఓ మ్యాచ్‌కోసం సచిన్‌, ద్రవిడ్‌ తాజ్‌లో బసచేసిన ఫ్లోర్‌లో గురుప్రసాద్‌ సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆ సమయంలో సచిన్‌ రూమ్‌ నుంచి బయటకువచ్చి లిఫ్ట్‌ వద్దకు వెళ్లబోతుండగా గురుప్రసాద్‌ ఆటోగ్రాఫ్‌ అడిగాడు. కానీ అప్పుడతడి వద్ద పేపర్‌ లేదు. దాంతో సెక్యూరిటీ బీట్‌ నోట్‌బుక్‌లోనే సచిన్‌ ఆటోగ్రాఫ్‌ తీసుకున్నాడు. టెండూల్కర్‌ ఆటోగ్రాఫ్‌ ఇస్తుండగా..‘సర్‌ మీరేమనుకోనంటే క్రికెట్‌కు సంబంధించి ఓ సూచన చేయొచ్చా’ అని అడిగాడు. టెండూల్కర్‌ ఓకే అన్నాడుట. దాంతో మీ ఎల్బోగార్డ్‌ వల్ల బ్యాటింగ్‌ సమయంలో అసౌకర్యానికి గురవుతున్నారని సచిన్‌కు చెప్పాడు. ఓ అభిమాని తన బ్యాటింగ్‌ను అంత తీక్షణంగా గమనిస్తుండడం చూసి సచిన్‌ ఆశ్చర్యపోయాడట. ఈ క్రమంలోనే తన ఎల్బో గార్డ్‌ను మార్చుకున్నాడు సచిన్‌. తనకు సరిపడా సైజ్‌లో చేయించుకుని ఎల్బో గార్డ్‌ చింత లేకుండా కెరీర్‌ను కొనసాగించాడు. ఇక 18 ఏళ్ల తర్వాత సచిన్‌ గుర్తు చేసుకొని అతడిని కలవాలన్న ఆకాంక్షను ట్విటర్‌ ద్వారా వ్యక్తంజేశాడు. దీంతో సచిన్‌ తన ఇంటికి వస్తే తమిళ సంప్రదాయాలతో గౌరవిస్తానని గురుప్రసాద్‌ అంటున్నాడు.

మరిన్ని వార్తలు