ఐపీఎల్: చెన్నైకి మరో షాక్!

29 Apr, 2018 13:43 IST|Sakshi

సాక్షి, పుణే: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్‌)-11లో వరుస విజయాల మీదున్న చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ నెగ్గి రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. అయినా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతున్న చెన్నై జట్టుకు ముంబై మ్యాచ్‌తో మరో షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న పేసర్ దీపక్‌ చహర్‌ జట్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా కనీసం రెండు వారాల పాటు అతడు చెన్నైకి సేవలు అందించలేడని కోచ్ స్టిఫెన్ ప్లెమింగ్ వెల్లడించాడు.

శనివారం రాత్రి ముంబైతో జరిగిన మ్యాచ్‌లో తొలి ఓవర్‌ వేసిన చహర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఆపై ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేశాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన చహర్ కాలి కండరాలు పట్టేయడంతో మైదానాన్ని వీడిన విషయం తెలిసిందే. దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. 'ఇదివరకే కాలి కండరాల నొప్పితో ఉన్న పేసర్ చహర్‌కు సమస్య మళ్లీ తిరగబెట్టింది. కనీసం రెండు వారాలపాటు అతడికి విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుందని' చెప్పాడు. ఐపీఎల్ 11లో 7 మ్యాచ్‌లాడిన చహర్ 6 వికెట్లు తీశాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మ్యాచ్‌లో చహర్ ఆకట్టుకున్నాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన చహర్ కేవలం 15 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసి సన్‌రైజర్స్ ఓటమిని శాసించాడు. 

ఎంగిడి వచ్చేశాడు..
తండ్రి మరణంతో టోర్నీ ప్రారంభం సమయంలో దక్షిణాఫ్రికా వెళ్లిన పేసర్ లుంగి ఎంగిడి భారత్‌ వచ్చేశాడు. చెన్నై జట్టుతో కలిసి అతడు ప్రాక్టీస్ చేస్తున్నాడు. చెన్నై తమ తదుపరి మ్యాచ్‌లకు స్టార్ పేసర్ ఎంగిడిని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు