సెమీస్‌లో చెన్నై

29 Sep, 2013 01:00 IST|Sakshi
సెమీస్‌లో చెన్నై

చాంపియన్స్ లీగ్‌లో టైటిల్ ఫేవరెట్ చెన్నై సూపర్ కింగ్స్ స్థాయికి తగ్గ ఆటతీరుతో సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. బ్రిస్బేన్ హీట్ జట్టుపై అలవోకగా నెగ్గి టోర్నీలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు ఆసీస్ దేశవాళీ జట్టు బ్రిస్బేన్ వరుసగా మూడో ఓటమితో టోర్నీలో సెమీస్ ఆశలు వదిలేసుకుంది.
 
 రాంచీ : ఓపెనర్ల వైఫల్యం, స్పిన్నర్ల నిలకడలేమి... చెన్నై జట్టుకు తొలి రెండు మ్యాచ్‌లు గెలిచినా కనిపించిన సమస్యలు ఇవి. కానీ మూడో మ్యాచ్ ద్వారా ఈ రెండు అంశాల్లోనూ సూపర్ కింగ్స్ కుదురుకుంది. జైత్రయాత్రను కొనసాగిస్తూ టోర్నీలో వరుసగా మూడో విజయం సాధించి సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. జేఎస్‌సీఏ స్టేడియంలో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరచి ఎనిమిది వికెట్ల తేడాతో బ్రిస్బేన్ హీట్‌పై నెగ్గింది.
 
 టాస్ గెలిచిన ధోని ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్రిస్బేన్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేసింది. టాప్ ఆర్డర్‌లో హోప్ (14 బంతుల్లో 20; 4 ఫోర్లు), లిన్ (25 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించారు. మధ్య ఓవర్లలో చెన్నై స్పిన్నర్లు పొదుపుగా బౌలింగ్ చేసి నియంత్రణ తెచ్చారు. అశ్విన్, జడేజా, రైనా కలిసి 11 ఓవర్లలో కేవలం 37 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశారు. అయితే చివర్లో కట్టింగ్ (25 బంతుల్లో 42 నాటౌట్; 5 సిక్సర్లు), హార్ట్‌లీ (32 బంతుల్లో 35; 3 ఫోర్లు) వేగంగా ఆడటంతో బ్రిస్బేన్‌కు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. చెన్నై బౌలర్లలో జడేజా, మోహిత్ శర్మ రెండేసి వికెట్లు తీసుకోగా... రైనా, అశ్విన్, మోర్కెల్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
 
 చెన్నై సూపర్ కింగ్స్ 15.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసి అలవోకగా గెలిచింది. ఓపెనర్లు మైక్ హస్సీ (48 బంతుల్లో 57 నాటౌట్; 7 ఫోర్లు), మురళీ విజయ్ (27 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 75 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. రైనా (15 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్సర్) ఉన్నంతసేపు వేగంగా ఆడాడు. ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలబడి అర్ధసెంచరీ చేసిన హస్సీ, ధోని (5 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) కలిసి మ్యాచ్‌ను తొందరగా ముగించారు. సొంతనగరం రాంచీలో ఈ సీజన్ చాంపియన్స్ లీగ్ చివరి మ్యాచ్‌ను  ధోని సిక్సర్‌తో ముగించాడు. మైక్ హస్సీకి  మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
 
 గ్రూప్-బిలో 12 పాయింట్లతో చెన్నై సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ గ్రూప్‌లో మరో సెమీస్ స్థానం కోసం టైటాన్స్, ట్రినిడాడ్, సన్‌రైజర్స్ రేస్‌లో ఉన్నాయి.
 
 స్కోరు వివరాలు: బ్రిస్బేన్ హీట్ ఇన్నింగ్స్: హోప్స్ (సి) హోల్టర్ (బి) మోర్కెల్ 20; మైఖేల్ (సి) బద్రీనాథ్ (బి) మోహిత్ 0; లిన్ (సి) జడేజా (బి) అశ్విన్ 29; క్రిస్టియాన్ (సి) హస్సీ (బి) జడేజా 3; బర్న్స్ (సి) రైనా (బి) జడేజా 0; హార్ట్‌లీ (సి) హోల్డర్ (బి) మోహిత్ 35; సాబర్గ్ (బి) రైనా 2; కట్టింగ్ నాటౌట్ 42; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 4, వైడ్లు 2) 6; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 137
 వికెట్ల పతనం: 1-5; 2-29; 3-54; 4-55; 5-61; 6-66; 7-137.
 బౌలింగ్: మోహిత్ శర్మ 3-0-35-2; ఆల్బీ మోర్కెల్ 2-0-15-1; హోల్డర్ 2-0-26-0; అశ్విన్ 4-1-10-1; జడేజా 4-0-18-2; రైనా 3-0-9-1; డ్వేన్ బ్రేవో 2-0-20-0.
 చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: మైక్ హస్సీ నాటౌట్ 57; మురళీ విజయ్ (సి) బర్న్స్ (బి) కట్టింగ్ 42; రైనా ఎల్బీడబ్ల్యు (బి) క్రిస్టియాన్ 23; ధోని నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 2, వైడ్లు 3) 5; మొత్తం (15.5 ఓవర్లలో రెండు వికెట్లకు) 140  
 వికెట్ల పతనం: 1-75; 2-116.
 బౌలింగ్: హోప్స్ 1-0-7-0; గాలె 2-0-22-0; గేనన్ 3-0-19-0; క్రిస్టియాన్ 3-0-16-1; హారిట్జ్ 3-0-36-0; కట్టింగ్ 3.5-0-38-1.
 
 చాంపియన్స్ లీగ్‌లో నేడు
 లయన్స్    x ఒటాగో
 సా. గం. 4.00 నుంచి
 రాజస్థాన్   x పెర్త్
 రా. గం. 8.00 నుంచి
 వేదిక: జైపూర్
 స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
 
 

మరిన్ని వార్తలు