ఇక నీ వ్యాఖ్యానం అవసరం లేదు: సీఎస్‌కే

14 Mar, 2020 20:14 IST|Sakshi

న్యూఢిల్లీ:  భారత మాజీ క్రికెటర్‌, ప్రఖ్యాత కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ బీసీసీఐ ప్యానల్‌ నుంచి ఉద్వాసన గురయ్యాడనే వార్తలకు మరింత బలం చేకూరింది. మంజ్రేకర్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) చేసిన  తాజా ట్వీట్‌ అందుకు ఉదాహరణగా నిలిచింది. ‘నీ బిట్స్‌ అండ్‌ పీసెస్‌ ఆడియో ఫీడ్‌ వినాల్సిన అవసరం లేదు’ అంటూ ఐపీఎల్‌ ఫ్రాంచైజీల్లో ఒకటైన సీఎస్‌కే తన ట్వీటర్‌ అకౌంట్‌లో పేర్కొనడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇది కచ్చితంగా మంజ్రేకర్‌ను టార్గెట్‌ చేస్తూ చేసిన ట్వీట్‌ అనేది సగటు క్రికెట్‌ అభిమానికి ఇట్టే అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో టీమిండియా ఆల్‌ రౌండర్‌, సీఎస్‌కే ఆటగాడైన రవీంద్ర జడేజాపై మంజ్రేకర్‌ ఇదే తరహా కామెంట్‌ చేసిన తరుణంలో అందుకు ఇప్పుడు అదే వ్యాఖ్యను సీఎస్‌కే జోడించింది. 

గతేడాది జరిగిన వరల్డ్‌కప్‌ సందర్భంగా టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై మంజ్రేకర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ' రవీంద్ర జడేజా లాంటి బిట్స్‌ అండ్‌ పీసెస్‌ ఆటగాళ్లకు తాను ఫ్యాన్‌ కాదని, జడేజా టెస్టు క్రికెటర్‌ మాత్రమేనని, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అతడు అన్‌ఫిట్‌ అంటూ' అంటూ పేర్కొన్నాడు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దీనికి జడేజా కూడా ధీటుగానే బదులిచ్చాడు. నీకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఘనత తనదని, ఇంకా ఆడుతూనే ఉన్నానని జడేజా ఘాటుగా బదులిచ్చాడు. కాగా, ఇలా మంజ్రేకర్‌ తన వ్యాఖ్యానంతో జడేజానే కాకుండా చాలా మందిపై విమర్శలు చేశాడు.(మంజ్రేకర్‌పై వేటు పడిందా?)

ఇటీవల సహచర కామెంటేటర్‌ హర్షా భోగ్లేపై కూడా విమర్శలు చేశాడు. పింక్‌ బాల్‌ అంశానికి సంబంధించి ఆ బంతితో కచ్చితత్వం ఎలా ఉందో ఆటగాళ్లను అడిగి తెలుసుకోవాలని భోగ్గే సూచించగా,  క్రికెట్‌ గురించి బాగా తెలిసిన నువ్వు అడిగితేనే బాగుంటుందని మంజ్రేకర్‌ ఎద్దేవా చేశాడు. అంటే హర్షా భోగ్లే క్రికెట్‌ ఆడకుండా కామెంటేటర్‌ కావడాన్ని మంజ్రేకర్‌ వేలెత్తి చూపాడు. ఇలా మంజ్రేకర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు పాలు కావడం తరచు జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే మంజ్రేకర్‌ను బీసీసీఐ ప్యానల్‌ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే వర్షార్పణమైన భారత్‌-దక్షిణాఫ్రికాల తొలి వన్డేకు మంజ్రేకర్‌ రాలేదనేది సమాచారం.

మరిన్ని వార్తలు