చెన్నై చమక్‌... 

14 Mar, 2019 00:50 IST|Sakshi

2010లో తొలిసారి విజేతగా  నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌

మరో 8 రోజుల్లో ఐపీఎల్‌  

సార్వత్రిక ఎన్నికల కారణంగా 2009లో దేశం నుంచి దక్షిణాఫ్రికాకు తరలి వెళ్లిపోయిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2010లో పుట్టింటికి వచ్చింది. ఈ సీజన్‌లో కొత్తగా ఐదు వేదికలు చేరాయి. తెలంగాణ ఉద్యమం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో డిఫెండింగ్‌ చాంపియన్‌ దక్కన్‌ చార్జర్స్‌ తమ మ్యాచ్‌లను సొంత వేదిక హైదరాబాద్‌ నుంచి తరలించింది. ఆ మ్యాచ్‌లను నాగ్‌పూర్, కటక్, ముంబైలలో ఏర్పాటు చేసుకుంది. తొలిసారిగా ఈ సీజన్‌లోని ఐపీఎల్‌ మ్యాచ్‌లను యూట్యూబ్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం చేశారు. సెమీఫైనల్స్, ప్లే ఆఫ్, ఫైనల్‌ మ్యాచ్‌లను దేశంలోని సినిమా హాల్స్‌లో త్రీడి మాధ్యమంలో ప్రసారం చేశారు. ఈ టోర్నీ విశేషాలను పరిశీలిస్తే.... 

రెండో ప్రయత్నంలో సఫలం... 
వరుసగా మూడో సీజన్‌లోనూ సెమీఫైనల్‌కు చేరిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ రెండో ప్రయత్నంలో టైటిల్‌ను సొంతం చేసుకుంది. తొలి సీజన్‌ ఫైనల్లో రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో ఓడిన చెన్నై... రెండో సీజన్‌లో సెమీఫైనల్లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో పరాజయం పాలైంది. మూడో సీజన్‌లో మాత్రం చెన్నై ‘సూపర్‌ కింగ్స్‌’లా ఆడి చాంపియన్‌గా నిలిచింది. తొలిసారి ఫైనల్‌ చేరిన ముంబై ఇండియన్స్‌తో జరిగిన టైటిల్‌ పోరులో చెన్నై 22 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసి ఓడిపోయింది. లీగ్‌ దశలో ముంబై (20 పాయింట్లు), దక్కన్‌ చార్జర్స్‌ (16 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో నిలువగా... చెన్నై, బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 14 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్‌ కారణంగా చెన్నై, బెంగళూరు సెమీఫైనల్‌ బెర్త్‌లను ఖాయం చేసుకున్నాయి. సెమీఫైనల్స్‌లో బెంగళూరుపై ముంబై ఇండియన్స్‌ 35 పరుగుల తేడాతో... దక్కన్‌ చార్జర్స్‌పై చెన్నై 38 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించాయి. చాంపియన్స్‌ లీగ్‌ బెర్త్‌ కోసం సెమీఫైనల్లో ఓడిన దక్కన్‌ చార్జర్స్, బెంగళూరు జట్ల మధ్య ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ నిర్వహించగా...
బెంగళూరు జట్టు విజయం సాధించింది.  

ఈ సీజన్‌లో అత్యధికంగా నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. యూసుఫ్‌ పఠాన్‌ (రాజస్తాన్‌ రాయల్స్‌), డేవిడ్‌ వార్నర్‌ (ఢిల్లీ డేర్‌డెవిల్స్‌), జయవర్ధనే (కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌), మురళీ విజయ్‌ (చెన్నై సూపర్‌ కింగ్స్‌) ఒక్కో సెంచరీ చేశారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూసుఫ్‌ పఠాన్‌ కేవలం 37 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 పరుగులు చేయడం విశేషం. లీగ్‌ మొత్తంలో ఒకటే ‘హ్యాట్రిక్‌’ నమోదైంది. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు బౌలర్‌ ప్రవీణ్‌ కుమార్‌ హ్యాట్రిక్‌ సాధించాడు.  

వీరు గుర్తున్నారా!  
విజేత జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌లో జార్జి బెయిలీ, బొలింజర్, హేడెన్, మైకేల్‌ హస్సీ, జస్టిన్‌ కెంప్, ముత్తయ్య మురళీధరన్, మఖాయ ఎన్తిని, తిసారా పెరీరా, అల్బీ మోర్కెల్, జాకబ్‌ ఓరమ్‌ విదేశీ ఆటగాళ్లు కాగా... ధోని, మురళీ విజయ్, సుదీప్‌ త్యాగి, రైనా, పార్థివ్‌ పటేల్, బాలాజీ, మన్‌ప్రీత్‌ గోనీ, బద్రీనాథ్, హేమంగ్‌ బదాని భారత్‌ సీనియర్‌ జట్టుకు ఆడినవారు. ఇదే జట్టులోని అనిరుధ, అరుణ్‌ కార్తీక్, షాదాబ్‌ జకాటి, చంద్రశేఖర్‌ గణపతిలకు టీమిండియా తరఫున ఆడే అవకాశం ఎప్పుడూ రాలేదు.  

ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌
సచిన్‌ టెండూల్కర్‌ (ముంబై ఇండియన్స్‌; 15 మ్యాచ్‌ల్లో 618 పరుగులు). 
అత్యధిక పరుగులు (ఆరెంజ్‌ క్యాప్‌) 
సచిన్‌ టెండూల్కర్‌  అత్యధిక వికెట్లు (పర్పుల్‌ క్యాప్‌) 
ప్రజ్ఞాన్‌ ఓజా (దక్కన్‌ చార్జర్స్‌–21 వికెట్లు).  

మరిన్ని వార్తలు