రైనా సెంచరీ: టైటిల్ వేటలో చెన్నై 'సూపర్'

4 Oct, 2014 22:30 IST|Sakshi
రైనా సెంచరీ: టైటిల్ వేటలో చెన్నై 'సూపర్'

బెంగళూరు:  ఆరు ఫోర్లు..ఎనిమిది సిక్సర్లు..ఒక జట్టులో ఆటగాడు ఈ తరహా బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్థి జట్టులో వణుకు పుట్టకమానదు. అది కూడా ఫైనల్ పోరులో అయితే అవతలి ఎండ్ లో ఆటగాళ్లు మిన్నుకుండు పోవాల్సిందే.  సురేష్ రైనా అదే చేసి చూపెట్టాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నైకు రైనా సునాయాస విజయాన్ని అందించాడు. శనివారం ఇక్కడ కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన తుది పోరులో చెన్నై సూపర్ కింగ్స్  ఎనిమిది వికెట్లు తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ ను చేజిక్కించుకుంది.  కోల్ కతా విసిరిన 181 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ఆడుతూ పాడుతూ ఛేదించింది. సెమీ ఫైనల్ కు చేరుకునే క్రమంలో ఒక్క మ్యాచ్ లో కూడా ఓటమి చవిచూడని కోల్ కతాకు ధోనీ సేన షాకిచ్చింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన చెన్నై 18.3 ఓవర్లో 185 పరుగులు చేసి సూపర్ విక్టరీని నమోదు చేసింది.

 

ఆదిలో స్మిత్ వికెట్టు కోల్పోయిన చెన్నైను సురేష రైనా ఆదుకున్నాడు.  రైనా (109; 62 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సులు) చేయడంతో చెన్నై గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. అతనికి తోడుగా మెక్ కలమ్ (39) పరుగులు చేసి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. తనదైన రోజున ప్రత్యర్థులపై విరుచుకుపడే చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అదే జోరును టైటిల్ వేటలో కొనసాగించింది. అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ విశేషంగా రాణించిన చెన్నై చాంపియన్స్ లీగ్ టైటిల్ ను రెండో సారి కైవసం చేసుకుంది. గతంలో 2010 లో చెన్నై టైటిల్ ను సాధించిన సంగతి తెలిసిందే.

 

అంతకుముందు టాస్ గెలిచిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేయాల్సిందిగా కోల్ కతాను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతాకు ఓపెనర్లు రాబిన్ ఊతప్ప(39; 32బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), గౌతం గంభీర్(80;52 బంతుల్లో 7 ఫోర్లు,3సిక్సులు)లు శుభారంభాన్నిచ్చారు. అనంతరం జాక్వస్ కల్లిస్ (1) పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. చివర్లో యూసఫ్ పఠాన్(20), మనీష్ పాండే(32) పరుగులు చేయడంతో కోల్ కతా నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 180పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు