చెన్నై చిందేసింది

26 Apr, 2015 02:54 IST|Sakshi
చెన్నై చిందేసింది

పంజాబ్‌పై ఘనవిజయం  
చెలరేగిన మెకల్లమ్, ధోని

 
చెన్నై: 193 పరుగుల లక్ష్యం. తమ చివరి మ్యాచ్‌లో దాదాపు ఇంతే టార్గెట్‌ను పంజాబ్ అత్యద్భుతంగా ఆడి టై చేసుకుని ‘సూపర్’గా గెలిచింది. అయితే ఈసారి మాత్రం చెన్నై బౌలర్ల ముందు ఆ ప్రతాపం పనిచేయలేదు. పట్టుమని వంద పరుగులు కూడా చేయలేకపోయింది. జడేజా, అశ్విన్ స్పిన్ బంతుల ఉచ్చులో పడిన బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. ఫలితంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 97 పరుగుల భారీ తేడాతో గెలిచింది. పరుగుల పరంగా ఐపీఎల్‌లో చెన్నైకిదే భారీ విజయం.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో మూడు వికెట్లకు 192 పరుగులు చేసింది. బ్రెండన్ మెకల్లమ్ (44 బంతుల్లో 66; 8 ఫోర్లు; 3 సిక్సర్లు), కెప్టెన్ ధోని (27 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు; 2 సిక్సర్లు) వేగంగా ఆడారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 95 పరుగులు మాత్రమే చేసి ఓడింది. విజయ్ (32 బంతుల్లో 34; 4 ఫోర్లు; 1 సిక్స్) ఒక్కడే రాణించాడు. జడేజాకు మూడు, అశ్విన్, నెహ్రాలకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మెకల్లమ్‌కు లభించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు నేపాల్ భూకంప మృతులకు సంతాపంగా ఆటగాళ్లు నివాళి అర్పించారు.

మెకల్లమ్, ధోని జోరు

ఇన్నింగ్స్ తొలి బంతినే బౌండరీగా మలిచిన ఓపెనర్ డ్వేన్ స్మిత్ మూడో ఓవర్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో మొత్తం 22 పరుగులు పిండుకున్నాడు. అనురీత్ బౌలింగ్‌లో మెకల్లమ్ ఇచ్చిన క్యాచ్‌ను జాన్సన్ వదిలేసినా అదే ఓవర్‌లో స్మిత్ బౌల్డ్ అయ్యాడు. 4.4 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 50 పరుగులు వచ్చాయి. వేగంగా ఆడిన మెకల్లమ్ వరుసగా ఓ ఫోర్, సిక్స్‌తో 32 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రైనా ఇచ్చిన క్యాచ్‌ను జాన్సన్ మరోసారి వదిలేశాడు.

ఇక అక్షర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన మెకల్లమ్ లాంగ్ ఆఫ్‌లో మిల్లర్‌కు చిక్కాడు. రైనాతో కలిసి అతను రెండో వికెట్‌కు 66 పరుగులు జోడించాడు. ధోని రాకతో ఇన్నింగ్స్‌లో వేగం పెరిగింది. అటు రైనా (25 బంతుల్లో 29; 4 ఫోర్లు) రనౌట్ అయినా జడేజా అండతో కెప్టెన్ కూల్ చెలరేగి భారీ షాట్లతో అలరించాడు. వీరిద్దరి ధాటితో చివరి 5 ఓవర్లలో 54 పరుగులు చేరాయి. అయితే ఆఖరి ఓవర్‌ను సందీప్ శర్మ కట్టుదిట్టంగా వేయడంతో చెన్నై 200 పరుగులు దాటలేకపోయింది.

ఆది నుంచీ తడబాటే...

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఇన్నింగ్స్ ఆ దిశగా సాగలేదు. తొలి ఓవర్‌లోనే సెహ్వాగ్ (1) అవుటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లో విజయ్ ఫోర్, సిక్స్‌తో జోరు పెంచి 13 పరుగులు రాబట్టాడు. అయితే ఆరు, ఏడు ఓవర్లలో షాన్ మార్ష్ (10), బెయిలీ  (1) వరుసగా అవుట్ కావడంతో పంజాబ్‌కు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే మిల్లర్ (3)తో పాటు విజయ్ కూడా వెనుదిరగడంతో 55 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన జట్టు కోలుకోలేకపోయింది.

స్కోరు వివరాలు

చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ : స్మిత్ (బి) అనురీత్ 26; మెకల్లమ్ (సి) బెయిలీ (బి) అక్షర్ 66; రైనా (రనౌట్) 29; ధోని నాటౌట్ 41; జడేజా నాటౌట్ 18; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో మూడు వికెట్లకు) 192.
వికెట్ల పతనం : 1-50, 2-116, 3-144.
బౌలింగ్ : కరణ్ వీర్ సింగ్ 4-0-43-0; సందీప్ శర్మ 4-0-32-0; అనురీత్ సింగ్ 4-0-40-1; జాన్సన్ 4-0-40-0; అక్షర్ 4-0-35-1.

పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఇన్నింగ్స్ : విజయ్ (సి) బ్రేవో (బి) అశ్విన్ 34; సెహ్వాగ్ (సి) డు ప్లెసిస్ (బి) పాండే 1; మార్ష్ ఎల్బీడబ్ల్యు (బి) నెహ్రా 10; బెయిలీ (సి) ధోని (బి) జడేజా 1; మిల్లర్ (సి) రైనా (బి) జడేజా 3; సాహా (సి) అశ్విన్ (బి) నెహ్రా 15; అక్షర్ (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 9; జాన్సన్ (సి) నెహ్రా (బి) జడేజా 1; అనురీత్ (సి) జడేజా (బి) మోహిత్ 10; కరణ్‌వీర్ నాటౌట్ 2; సందీప్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 95.
వికెట్ల పతనం : 1-4, 2-35, 3-40, 4-55, 5-55, 6-66, 7-69, 8-90, 9-94.
బౌలింగ్ : పాండే 2-0-17-1; నెహ్రా 4-0-16-2; మోహిత్ 3-0-10-1; జడేజా 4-0-22-3; అశ్విన్ 4-0-14-2; బ్రేవో 3-0-13-0.

మరిన్ని వార్తలు