పతకాలతో తిరిగి రావాలని...

24 Sep, 2018 06:45 IST|Sakshi

నేటి నుంచి చెస్‌ ఒలింపియాడ్‌

భారత పురుషుల, మహిళల జట్లకు ఐదో సీడింగ్‌

పదేళ్ల తర్వాత బరిలో ఆనంద్‌

హరికృష్ణ, హంపి, హారికలపై దృష్టి

బటూమి (జార్జియా): గతంలో ఎన్నడూలేని విధంగా సన్నద్ధత... పదేళ్ల తర్వాత దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌ జాతీయ జట్టుకు అందుబాటులో ఉండటం... రెండేళ్ల తర్వాత స్టార్‌ క్రీడాకారిణి కోనేరు హంపి పునరాగమనం... వెరసి సోమవారం మొదలయ్యే ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. విశ్వనాథన్‌ ఆనంద్, పెంటేల హరికృష్ణ, విదిత్‌ సంతోష్‌ గుజరాతి, ఆధిబన్, శశికిరణ్‌ కృష్ణన్‌లతో కూడిన భారత పురుషుల జట్టుకు ఐదో సీడ్‌... కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తానియా సచ్‌దేవ్, ఇషా కరవాడే, పద్మిని రౌత్‌లతో కూడిన భారత మహిళల జట్టుకూ ఐదో సీడ్‌ లభించింది.  

పురుషుల విభాగంలో 185 దేశాలు... మహిళల విభాగంలో 155 దేశాలు పోటీపడుతున్న ఈ మెగా ఈవెంట్‌లో 11 రౌండ్‌లు జరుగుతాయి. అత్యధిక పాయింట్లు సాధించిన తొలి మూడు జట్లకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను అందజేస్తారు. పురుషుల విభాగంలో తొలి ఒలింపియాడ్‌ 1927లో... మహిళల విభాగంలో తొలి ఒలింపియాడ్‌ 1957లో జరిగింది.  

ఆనంద్, హరికృష్ణ లేకుండానే... పరిమార్జన్‌ నేగి, సేతురామన్, శశికిరణ్‌ కృష్ణన్, ఆధిబన్, లలిత్‌ బాబు సభ్యులుగా ఉన్న భారత పురుషుల జట్టు 2014లో కాంస్యం సాధించింది. ఈ పోటీల చరిత్రలో భారత అత్యుత్తమ ప్రదర్శన ఇదే. 2012లో హారిక, ఇషా కరవాడే, తానియా, మేరీఆన్‌ గోమ్స్, సౌమ్య స్వామినాథన్‌ సభ్యులుగా ఉన్న భారత మహిళల జట్టు అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచింది. ఈసారి ఆనంద్, హరికృష్ణలతోపాటు హంపి కూడా భారత జట్టుకు అందుబాటులో ఉండటం... టోర్నీకి శిక్షణ శిబిరాలు నిర్వహించడం... టోర్నీ సందర్భంగా సన్నాహాల కోసం భారత జట్లకు తొలిసారి సెకండ్స్‌ (సహాయకులు)ను ఏర్పాటు చేయడంతో రెండు జట్లూ పతకాలతో తిరిగి వస్తాయని భారీ అంచనాలు ఉన్నాయి. పురుషుల విభాగంలో అమెరికా, రష్యా, చైనా, అజర్‌బైజాన్‌... మహిళల విభాగంలో చైనా, రష్యా, ఉక్రెయిన్, జార్జియా జట్లతో భారత్‌కు గట్టిపోటీ లభించే అవకాశముంది.

మరిన్ని వార్తలు