పురస్కారాల్లో చెస్‌ ఆటగాళ్లకు మొండిచేయి

15 Jul, 2020 02:36 IST|Sakshi

జాతీయ క్రీడా పురస్కారాల్లో వివక్షపై ఆవేదన

స్పందించని ఏఐసీఎఫ్‌

చెన్నై: క్రికెట్‌ క్రేజీ భారత్‌లో చదరంగం రారాజులూ ఉన్నారు. కానీ చెస్‌ ప్లేయర్లకు ఆదరణ అనేది ఉండదు. పాపులారిటీ పక్కనబెడితే ప్రభుత్వానికైతే అందరు ఆటగాళ్లు సమానమే కదా! మరి తమపై ఈ శీతకన్ను ఏంటని గ్రాండ్‌మాస్టర్లు (జీఎం) వాపోతున్నారు. అవార్డులు, పురస్కారాల సమయంలో (నామినేషన్లు) తామెందుకు కనపడమో అర్థమవడం లేదని మూకుమ్మడిగా గళమెత్తారు. నిజమే. చెస్‌ ఆటగాళ్ల గళానికి విలువ ఉంది. ఆవేదనలో అర్థముంది.

కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న చెస్‌ ప్లేయర్లను భారత ప్రభుత్వం తరచూ అర్జున, ద్రోణాచార్య అవార్డులకు విస్మరించడం ఏమాత్రం తగని పని. పైగా వీళ్లంతా వారి వారి సొంత ఖర్చులతోనే గ్రాండ్‌మాస్టర్‌ హోదాలు పొందారు. గ్రాండ్‌మాస్టర్లు (జీఎం), అంతర్జాతీయ మాస్టర్లు (ఐఎం)ల ఎదుగుదలకు అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌) చేసేది శూన్యం. ఎలాంటి ఆర్థిక ప్రోత్సాహకం లేకపోగా... కనీసం సొంతంగా ఎదిగిన వారికి పురస్కారాలు ఇప్పించడంలోనూ నిర్లక్ష్యం వహించడం మరింత విడ్డూరం.

2014 చెస్‌ ఒలింపియాడ్‌లో కాంస్యం నెగ్గిన భారత జట్టులో సభ్యుడైన తమిళనాడు గ్రాండ్‌మాస్టర్‌ సేతురామన్‌ రెండేళ్లుగా ‘అర్జున’కు దరఖాస్తు చేసుకుంటున్నా ఫలితం లేదు. దాంతో అతను అవార్డు గురించి పట్టించుకోకుండా తన ఆటపై దృష్టి సారించాడు. ఇటీవలే చీఫ్‌ సెలక్టర్‌ పదవికి రాజీనామా చేసిన గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌బీ రమేశ్‌ తన శిక్షణతో పలువురు గ్రాండ్‌మాస్టర్లను తయారు చేశారు. ప్రపంచ చెస్‌లో జీఎం హోదా పొందిన రెండో అతి పిన్న వయస్కుడు ప్రజ్ఞానందతోపాటు జీఎంలు అరవింద్‌ చిదంబరం, కార్తికేయన్‌ మురళీ తదితరులను ఈయనే తీర్చిదిద్దారు. కానీ ఇప్పటికీ రమేశ్‌కు ‘ద్రోణాచార్య’ లభించలేదు. చెస్‌లో ఇప్పటివరకు ఇద్దరికే ‘ద్రోణాచార్య’ పురస్కారం  దక్కింది. 1986లో రఘునందన్‌ వసంత్‌ గోఖలే, 2006లో ఆంధ్రప్రదేశ్‌ జీఎం హంపి తండ్రి కోనేరు అశోక్‌ ఈ అవార్డు సాధించారు.

ప్రపంచస్థాయిలో పేరు తెస్తే చెస్‌ ఆటగాళ్లను పురస్కారాలతో  గుర్తించకపోవడం దారుణం. భారతీయులు క్రికెట్‌ను అర్థం చేసుకుంటారు. అత్యున్నతస్థాయి చెస్‌ ఆడే దేశాలు 190 వరకు ఉన్నాయి. క్రికెట్‌లో మాత్రం 12 దేశాలకు టెస్టు హోదా ఉండగా.. ఇందులో తొమ్మిదింటికే అగ్రశ్రేణి జట్లుగా గుర్తింపు ఉంది. చెస్‌లో 2700 ఎలో రేటింగ్‌ ఉన్నవారు ప్రపంచ క్రికెట్‌లోని టాప్‌–25 ఆటగాళ్లతో సమానం. –విశాల్‌ సరీన్, కోచ్‌

జాతీయ క్రీడా పురస్కారాలు 1961లో మొదలుకాగా ... ఇప్పటి వరకు చెస్‌లో 17 మందికి  ‘అర్జున’ దక్కింది. చివరిసారి 2013లో జీఎం అభిజిత్‌ గుప్తాకు ‘అర్జున’ వరించింది.  

తమిళనాడుకు చెందిన ఆధిబన్‌ ఖాతాలో గొప్ప విజయాలే ఉన్నాయి. 2014  చెస్‌ ఒలింపియాడ్‌లో కాంస్యం, 2010 ఆసియా క్రీడల్లో కాంస్యం, 2010 ప్రపంచ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2019 ప్రపంచ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, 2014 ఆసియా చాంపియన్‌షిప్‌లో రజతం, 2012లో అండర్‌–20 కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు. అయినా ఇప్పటివరకు ఆధిబన్‌కు ‘అర్జున’ రాలేదు. బాధ పడాల్సిన విషయమేమిటంటే ‘అర్జున’ అవార్డు దరఖాస్తు పూరించేందుకు అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌) కార్యాలయానికి వెళ్లగా అక్కడి సీనియర్‌ అధికారి నుంచి అవమానం ఎదురైంది. ‘ఏ అర్హతతో నువ్వు ‘అర్జున’ కోసం దరఖాస్తు చేసుకుంటున్నావు’ అని ఆధిబన్‌ను ఆయన ఎగతాళి చేయడం దారుణం.

>
మరిన్ని వార్తలు