‘నా శైలి అందరికీ తెలుసు’ 

20 Mar, 2020 01:44 IST|Sakshi

కోచ్, కెప్టెన్‌లకు నాపై నమ్మకముంది

క్రీజ్‌లో సమయం తీసుకుంటే తప్పేం లేదు

నెమ్మదిగా బ్యాటింగ్‌ చేయడంపై పుజారా

రాజ్‌కోట్‌: భారత టెస్టు జట్టులో కీలక సభ్యుడైన చతేశ్వర్‌ పుజారా పలు సందర్భాల్లో బాగా నెమ్మదిగా బ్యాటింగ్‌ చేయడంపై విమర్శలు ఎదుర్కొన్నాడు. గతంలో ఒక సారి జట్టు కోచ్, కెప్టెన్‌ కూడా అతని స్ట్రయిక్‌రేట్‌ను ప్రశ్నించారు. దూకుడుకు చిరునామాగా మారిన ఈతరం క్రికెట్‌లో పుజారా బ్యాటింగ్‌ శైలి చాలా మందిని ఆకట్టుకోదు. ఇటీవల బెంగాల్‌తో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో కూడా అతను ఇదే తరహాలో ఆడాడు. జ్వరంనుంచి కోలుకొని ఇన్నింగ్స్‌ కొనసాగించిన అతను 237 బంతుల్లో 66 పరుగులు చేశాడు. దీంతో సగటు క్రికెట్‌ అభిమానులు మళ్లీ పుజారా ఆటతీరును విమర్శించారు. దీనిపై ఇప్పుడు స్వయంగా పుజారానే స్పందించాడు. ‘నా ఆటతీరు గురించి మీడియాలోనే అనేక రకమైన వార్తలు కనిపిస్తాయి. అయితే జట్టు అంతర్గత చర్చల్లో మాత్రం దీని గురించి అసలు ప్రస్తావనే ఉండదు.

ఈ విషయంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నాకు పూర్తిగా మద్దతిస్తోంది. వేగంగా ఆడాలంటూ కెప్టెన్‌నుంచి గానీ కోచ్‌నుంచి గానీ నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు’ అని పుజారా వివరణ ఇచ్చాడు. కరోనా కారణంగా ప్రస్తుతం ఎక్కడికీ వెళ్లకుండా పుజారా కూడా ఇంట్లోనే ఉంటున్నాడు. ‘మీ అందరికీ ఒక విషయం చెప్పదల్చుకున్నా. నా స్ట్రయిక్‌రేట్‌ గురించి చర్చ రాగానే అంతా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నాతో ఎలా వ్యవహరిస్తోందో అని ఆలోచిస్తారు. అయితే వారందరికీ నా శైలి బాగా తెలుసు. నా ఆట ప్రాధాన్యత కూడా తెలుసు. కాబట్టి ఎప్పుడూ నాపై ఒత్తిడి పెంచలేదు’ అని పుజారా అన్నాడు. సోషల్‌ మీడియాలో చాలా మంది తనను  పరుగులు చేసేందుకు అన్నేసి బంతులు ఎందుకు తీసుకుంటావని అడుగుతుంటావని, అయితే తాను వాటిని పట్టించుకోనని చింటూ చెప్పాడు.

‘అసలు అలాంటి వాటిపై నేను దృష్టి పెట్టను. జట్టు మ్యాచ్‌లు గెలిచేలా నా వంతు పాత్ర పోషించడమే నా పని. చాలా మందికి ఒక వ్యక్తిలో తప్పును గురించి మాట్లాడే అలవాటు ఉంటుంది. ఇది నా ఒక్కడికే పరిమితం కాదు. నేను ఆడిన టెస్టులు, వాటిలో చేసిన పరుగులు, క్రీజ్‌లో గడిపిన సమయం చూస్తే ప్రత్యర్థి జట్టులో కూడా ఎక్కువ మంది ఇదే తరహాలో ఆడారని అర్థమవుతుంది’ అని ఈ సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్‌ వ్యాఖ్యానించాడు. అయితే తన గురించి తాను వాస్తవంగా ఆలోచిస్తానని, మరీ దూకుడుతనంతో ఆడలేనని ప్రత్యేకంగా విషయం తనకు తెలుసని కూడా పుజారా వివరించాడు. ‘నేను డేవిడ్‌ వార్నర్‌లా, వీరేంద్ర సెహ్వాగ్‌లా ఆడలేనని నాకు తెలుసు. కానీ ఒక సాధారణ బ్యాట్స్‌మన్‌ క్రీజ్‌లో ఎక్కువ సమయం తీసుకుంటే తప్పేమీ లేదు’ అని అతను చెప్పాడు.

న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన సిరీస్‌లో ఒకే ఒక అర్ధ సెంచరీ చేసిన పుజారా ఈ ఏడాదిలో ఒక్క శతకం కూడా కొట్టలేకపోయాడు. ఇది తనను కొంత నిరాశకు గురి చేసిందని భారత టెస్టు స్పెషలిస్ట్‌ చెప్పాడు. ‘అభిమానులు నేను భారీ ఇన్నింగ్స్‌ ఆడాలని కోరుకుంటారు. నేనూ సెంచరీ చేయాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగుతాను. అయితే ఓవరాల్‌గా టెస్టుల్లో దాదాపు 50 సగటు ఉందంటే ప్రతీ రెండో ఇన్నింగ్స్‌లో నేను అర్ధ సెంచరీ చేసినట్లే. సీజన్‌ గొప్పగా సాగలేదనేది వాస్తవం. అయితే మరీ ఘోరంగా ఏమీ ఆడలేదు. నా ఫామ్‌ దిగజారిందని అంగీకరించను. ప్రతీ ఇన్నింగ్స్‌కు తనదైన విలువ ఉంది’ అని పుజారా వెల్లడించాడు. ఈతరం క్రికెటర్లు టెస్టులపై ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదని అతను అభిప్రాయ పడ్డాడు.

‘పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తుంది. డబ్బులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి కుర్రాళ్లు టెస్టులకు దూరంగా ఉంటున్నారనేది వాస్తవం. ఇందులో తప్పేమీ లేదు కానీ టెస్టులకు కూడా ప్రత్యేకత ఉంది. ఒక ఆటగాడి అసలు సత్తాను ఐదు రోజుల మ్యాచ్‌లే బయటపెడతాయి’ అని పుజారా అన్నాడు.  ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్‌ తమకు అత్యంత కీలకమన్న భారత టెస్టు మూడో నంబర్‌ ఆటగాడు... మన పేసర్లు పూర్తి ఫిట్‌నెస్, తగినంత విరామంతో సిద్ధంగా ఉంటే మళ్లీ సిరీస్‌ గెలవవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై 2018–19 సిరీస్‌ను భారత్‌ 2–1తో సొంతం చేసుకుంది. 

మరిన్ని వార్తలు