లిన్‌ డాన్‌ గుడ్‌బై

5 Jul, 2020 00:02 IST|Sakshi

బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన చైనా సూపర్‌ స్టార్‌

ఆటలో అన్నీ గెలిచిన దిగ్గజం

రెండు ఒలింపిక్స్‌ స్వర్ణాలు, ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్‌ విజయాలు

బీజింగ్‌: రెండు దశాబ్దాలు బ్యాడ్మింటన్‌ను ఏలిన చైనా విఖ్యాత షట్లర్‌ లిన్‌ డాన్‌ ఆటకు గుడ్‌బై చెప్పాడు. శనివారం తన కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ప్రత్యర్థులకే కాదు... బ్యాడ్మింటన్‌కే ‘సూపర్‌ డాన్‌’గా చిరపరిచితుడైన లిన్‌ సోషల్‌ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు.  ‘2000 నుంచి 2020 వరకు ఇరవై ఏళ్లు ఆటలో కొనసాగిన నేను జాతీయ జట్టుకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నాను. ఇలా చెప్పడం నాకు చాలా క్లిష్టమైనా తప్పలేదు. నాకు ఇప్పుడు 37 ఏళ్లు. నా శారీరక సామర్థ్యం. గాయాలతో ఒకప్పటిలా నేను మా జట్టు సహచరులతో కలిసి పోరాడలేను.

ఆటపై కృతజ్ఞత ఉంది. పైబడిన వయసుతో ఇబ్బంది ఉంది. అందుకే ఇక కుటుంబానికే అంకితమవ్వాలనుకుంటున్నా. జీవితంలో నాకిది కొత్త పోటీ’ అని వెటరన్‌ లిన్‌ డాన్‌ చైనా సోషల్‌ మీడియా యాప్‌ ‘వైబో’లో పోస్ట్‌ చేశాడు. ఆటనే ప్రేమించిన తను అంకితభావంతో నాలుగు ఒలింపిక్స్‌ ఆడానని చెప్పాడు. ఇన్నేళ్లుగా బ్యాడ్మింటనే లోకమైన తాను ఇలా రిటైర్మెంట్‌ చెబుతానని ఎప్పుడు అనుకోలేదని అన్నాడు.  ర్యాంకింగ్‌ కంటే ఎక్కువగా ఆడటంపైనే దృష్టిపెట్టిన తనకు శారీరకంగా ఎన్నో సవాళ్లు ఎదురైనట్లు తెలిపాడు. ‘ఆటలో నన్ను ఉత్సాహంగా పోటీపడేలా స్ఫూర్తి పెంచిన నా మేటి ప్రత్యర్థులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని లిన్‌ డాన్‌ తనకెదురైన పోటీదారులను గౌరవించాడు. 

మేరునగధీరుడు...
666 మ్యాచ్‌లలో విజయాలు... 66 టైటిల్స్‌...ఇదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో డాన్‌ సాధించిన ఘనత. గ్లోబ్‌లోని దేశాలన్నీ చుడుతూ అతను టైటిళ్లన్నీ పట్టేశాడంటే అతిశయోక్తి కాదు. చైనీస్‌ సూపర్‌స్టార్‌ కచ్చితంగా చాంపియనే. ఏళ్ల తరబడి... దశాబ్దాలు తలపడి ఎవరికీ అనితర సాధ్యమైన టైటిళ్లన్నీ అతనొక్కడే సాధించాడు. రెండు సార్లు ఒలింపిక్‌ చాంపియన్‌. ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌.  ఐదు సార్లు ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌. మరో ఐదుసార్లు ఆసియా గేమ్స్‌ విజేత. ఇంకో ఐదు సుదిర్మన్‌ కప్‌ విజయాలు.  థామస్‌ కప్‌లో అరడజను బంగారు పతకాలు. 4 ఆసియా చాంపియన్‌షిప్‌ స్వర్ణాలు. 2 ప్రపంచకప్‌ విజయాలు. ఈ వేటలో రన్నరప్‌ రజతాలు, కాంస్యాలు చెప్పుకుంటూ పోతే డాన్‌ పతకాల జాబితా చాంతాడంత ఉంది. 2004లోనే వరల్డ్‌ నంబర్‌ వన్‌ అయ్యాడు అన్ని గెలుస్తూపోతూ 28 ఏళ్లకే ‘సూపర్‌ గ్రాండ్‌ స్లామ్‌’ సాధించాడు.

అంటే బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఉన్న 9 మేజర్‌ టైటిళ్లను సాధించిన ఏకైక షట్లర్‌గా చరిత్రకెక్కాడు. ఒలింపిక్‌ చాంపియన్‌షిప్‌ (2008, 2012) నిలబెట్టుకున్న తొలి, ఒకేఒక్క బ్యాడ్మింటన్‌ ఆటగాడు కూడా లిన్‌ డానే! 2004లో జరిగిన ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఇతని దెబ్బకు తలవంచిన పీటర్‌ గేడ్‌... చైనీస్‌ ఆటగాడిని ఉద్దేశిస్తూ ‘సూపర్‌ డాన్‌’గా కితాబిచ్చాడు. తర్వాత్తర్వాత అదే పేరు స్థిరపడిపోయేలా తన రాకెట్‌తో బ్యాడ్మింటన్‌ లోకాన్నే రఫ్ఫాడించాడు. 2002లో తన తొలి టైటిల్‌ సాధించినప్పటినుంచి ప్రతీ సంవత్సరం అతను కనీసం ఒక్క టోర్నీలోనైనా విజయం సాధించడం విశేషం. బ్యాడ్మింటన్‌లో దిగ్గజ చతుష్టయంగా గుర్తింపు తెచ్చుకున్న నలుగురిలో చివరగా డాన్‌ రిటైరయ్యాడు. మిగతా ముగ్గురు లీ చోంగ్‌ వీ, తౌఫీక్‌ హిదాయత్, పీటర్‌ గేడ్‌లతో పోలిస్తే సాధించిన ఘనతల ప్రకారం లిన్‌ డాన్‌ అందరికంటే గ్రేట్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని వార్తలు