సింధు ముందుకు... సైనా ఇంటికి

19 Sep, 2018 01:43 IST|Sakshi

చైనా ఓపెన్‌ టోర్నమెంట్‌  

చాంగ్జౌ: ఆసియా క్రీడల తర్వాత పాల్గొన్న తొలి టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌కు నిరాశ ఎదురుకాగా... పీవీ సింధు ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం మొదలైన చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నమెంట్‌లో సైనా తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ సుంగ్‌ జీ హున్‌ (దక్షిణ కొరియా)తో జరిగిన మహిళల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో ప్రపంచ పదో ర్యాంకర్‌ సైనా 22–20, 8–21, 14–21తో ఓడిపోయింది. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నా.... ఆ తర్వాత తడబడింది. మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ సింధు 21–15, 21–13తో ప్రపంచ 39వ ర్యాంకర్‌ సెనా కవకామి (జపాన్‌)ను ఓడించింది. ఆద్యంతం దూకుడుగా ఆడిన సింధు కేవలం 26 నిమిషాల్లోనే తన ప్రత్యర్థి ఆట కట్టించింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో బుసానన్‌ (థాయ్‌లాండ్‌)తో సింధు ఆడుతుంది.  

ప్రిక్వార్టర్స్‌లో సిక్కి జోడీ... 
డబుల్స్‌ విభాగంలో బరిలోకి దిగిన రెండు భారత జంటలకు శుభారంభం లభించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా ద్వయం 21–19, 21–17తో మార్విన్‌ ఎమిల్‌ సీడెల్‌–లిండా ఎఫ్లెర్‌ (జర్మనీ) జోడీపై గెలుపొందింది. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి జంట 13–21, 21–13, 21–12తో ప్రపంచ 13వ ర్యాంక్‌ ద్వయం లియావో మిన్‌ చున్‌–సు చింగ్‌ హెంగ్‌ (చైనీస్‌ తైపీ)పై సంచలన విజయం సాధించింది.   బుధవారం జరిగే పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో రాస్ముస్‌ జెమ్కే (డెన్మార్క్‌)తో శ్రీకాంత్‌; ఎన్జీ కా లాంగ్‌ అంగుస్‌ (హాంకాంగ్‌)తో ప్రణయ్‌ తలపడతారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో ఇలిస్‌–లారెన్‌ (ఇంగ్లండ్‌)లతో సాత్విక్‌ సాయిరాజ్‌–అశ్విని; గో వీ షెమ్‌–తాన్‌ వీ కియోంగ్‌ (మలేసియా)లతో సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి; కిమ్‌ సో యోంగ్‌–కాంగ్‌ హీ యోంగ్‌ (దక్షిణ కొరియా)లతో సిక్కి–అశ్విని ఆడతారు.   

మరిన్ని వార్తలు