చైనా ఎందుకిలా?

22 Aug, 2016 15:58 IST|Sakshi
చైనా ఎందుకిలా?

రియో డీ జనీరో: దాదాపు పదహారు సంవత్సరాల నుంచి బ్యాడ్మింటన్ క్రీడలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్నచైనాకు తాజాగా జరిగిన రియో ఒలింపిక్స్ లో చుక్కెదురైంది.  ఈ ఒలింపిక్స్లో చైనా బ్యాడ్మింటన్ కు పలు దేశాల నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. అటు స్పెయిన్ తో పాటు జపాన్ , మలేషియా, డెన్మార్క్, భారత క్రీడాకారులు రియో బ్యాడ్మింటన్ రాణిస్తే.. చైనా మాత్రం పేలవ ప్రదర్శనతో తగిన సంఖ్యలో పతకాలను సాధించలేకపోయింది.

 

కేవలం బ్యాడ్మింటన్ లో రెండు స్వర్ణాలను మాత్రమే చైనా ఖాతాలో చేరడం వారి గత వైభవానికి చెక్ పడినట్లు కనిపిస్తోంది. గత లండన్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో ఐదు స్వర్ణపతకాలతో క్లీన్ స్వీప్ చేసి సగర్వంగా స్వదేశానికి చేరిన చైనా.. ప్రస్తుత ఒలింపిక్స్ లో అంచనాలకు తగ్గట్టు రాణించకలేకపోయింది.  మరోవైపు చైనా స్టార్ ఆటగాడు, గత ఒలింపిక్స్ చాంపియన్ లిన్ డాన్ కాంస్య పతకాన్ని కూడా సాధించలేకపోయాడు.

మరోవైపు ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో కేవలం ఒక చైనా క్రీడాకారిణి  మాత్రమే సెమీస్ అర్హత సాధించడం సుమారు 20 ఏళ్ల తరువాత ఇదే ప్రథమం.  2000, 04 సంవత్సరాల్లో స్వర్ణం, కాంస్య పతకాల్ని సాధించిన చైనా క్రీడాకారిణులు.. 2008, 12ల్లో స్వర్ణ, రజత పతకాలను కైవసం చేసుకున్నారు. దీంతో వారి పూర్వవైభవానికి చెక్ పడిందనే చెప్పాలి. సుమారు రెండు దశాబ్దాలుగా పోడియం పొజిషన్ సాధించడంలో సఫలమైన చైనా బ్యాడ్మింటన్ మహిళలకు ఈసారి తీవ్ర నిరాశ ఎదురైంది.  ఈ ఒలింపిక్స్లోచైనా క్రీడాకారిణి లీ ఘురీ సెమీస్ కు చేరినా కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయింది. ఆ తరువాత కాంస్య పతకం కోసం జరిగిన పోరులో గాయం కారణంగా లీ ఘురీ ఆడకపోవడంతో జపాన్ క్రీడాకారిణి ఓకుహారాకు కాంస్య దక్కింది.  దీంతో మహిళల బ్యాడ్మింటన్ లో చైనా కనీసం పతకం కూడా సాధించకుండా రిక్తహస్తలతో వెనుదిరిగింది.

 

ఈ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో చైనా మూడు పతకాల్ని సాధించింది. పురుషుల సింగిల్స్ లో ఒలింపిక్స్ లో చెన్ లాంగ్ తన వ్యక్తిగత తొలిసారి స్వర్ణం సాధించగా, పురుషుల డబుల్స్లో జంగ్ నాన్-షు హైపంగ్ జోడీ పసిడిని సాధించింది.  ఆ తరువాత మిక్స్ డ్ డబుల్స్లో చైనాకు కాంస్య పతకం దక్కింది. ఇదిలా ఉండగా, పతకాల పట్టికలో  మూడో స్థానంలో నిలవడం కూడా చైనా క్రీడా శిబిరంలో ఆందోళన పెంచుతుంది. ఈ మెగా ఈవెంట్కు రష్యా క్రీడాకారులు తక్కువ శాతంలో రావడంతో చైనా పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని ఆశించింది. అయితే తొలి స్థానంలో అమెరికా నిలిస్తే, రెండో స్థానాన్ని బ్రిటన్ చేజిక్కించుకుంది.  ఇలా చైనా 26 స్వర్ణాలతో మూడో స్థానానికి పడిపోవడానికి  వారు బ్మాడ్మింటన్ లో ఆశించిన పతకాలు రాకపోవడమే.

మరిన్ని వార్తలు