అంతర్జాతీయ టి20: 14 పరుగులకే ఆలౌట్‌

14 Jan, 2019 02:50 IST|Sakshi

బ్యాంకాక్‌: చైనా వస్తువుల నాణ్యత, మన్నిక గురించి మనకు సాధారణంగా ఎన్నో సందేహాలు! ఇప్పుడు చైనా క్రికెట్‌ జట్టు కూడా అలాగే ఉన్నట్లుంది. ఇటీవలే ఆ జట్టు క్రికెట్‌లోకి అడుగు పెట్టగా... మహిళల టీమ్‌ అంతర్జాతీయ టి20ల్లో అత్యల్ప స్కోరు రికార్డును మూటగట్టుకుంది. ఆదివారం ఇక్కడ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)తో జరిగిన మ్యాచ్‌లో చైనా 10 ఓవర్లలో 14 పరుగులకే ఆలౌటైంది. జట్టు ఇన్నింగ్స్‌ 48 నిమిషాలకే ముగిసింది. ఏడుగురు ప్లేయర్లు ‘సున్నా’తో సరిపెట్టగా... లిలి 4, యాన్‌ లింగ్, యింగ్‌జూ చెరో 3, జాంగ్‌ చాన్‌ 2 పరుగులు చేశారు. మరో 2 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి.

థాయ్‌లాండ్‌ ఉమెన్స్‌ టి20 స్మాష్‌ టోర్నీ లో భాగంగా ఈ మ్యాచ్‌ జరిగింది. అంతకుముందు యూఏఈ 20 ఓవర్లలో 3 వికెట్లకు 203 పరుగులు చేసింది. ఫలితంగా టి20ల్లో అత్యధిక పరుగుల తేడాతో (189) గెలిచిన జట్టుగా రికార్డులకెక్కింది.  క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు గత ఏడాది జూలై 1 నుంచి సభ్యదేశాలు ఆడే టి20 మ్యాచ్‌లన్నింటికీ ఐసీసీ అంతర్జాతీయ హోదా ఇచ్చింది. ప్రస్తుత టోర్నీలో భూటాన్, మయన్మార్‌లాంటి జట్లు కూడా బరిలో ఉన్నాయి. మరోవైపు ఈ జనవరి 1 నుంచి పురుషుల క్రికెట్‌లో కూడా ఇదే తరహాలో ‘అంతర్జాతీయ మ్యాచ్‌ల’నిబంధన అమలు కానుంది. ఫలితంగా ఈ తరహా ‘సిత్రాలు’మున్ముందు మరిన్ని కనిపించవచ్చు. పురుషుల క్రికెట్‌లో భారత్‌ వర్సెస్‌ చైనా మ్యాచ్‌ స్కోర్లను ఊహించుకోండి!   

మరిన్ని వార్తలు