షూటింగ్‌లో మరో ‘టోక్యో’ బెర్త్‌

9 Nov, 2019 04:42 IST|Sakshi

మహిళల 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో చింకీ యాదవ్‌ అర్హత

దోహా (ఖతర్‌): ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో ఒలింపిక్‌ బెర్త్‌ ఖరారైంది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల చింకీ యాదవ్‌ ఫైనల్‌కు చేరి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇప్పటివరకు 11 మంది భారత షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. శుక్రవారం జరిగిన 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌ క్వాలిఫయింగ్‌లో చింకీ యాదవ్‌ 588 పాయింట్లతో రెండో స్థానాన్ని సంపాదించింది. ఫైనల్‌కు చేరిన ఎనిమిది మంది షూటర్లలో నలుగురు ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఈ ఈవెంట్‌లో నాలుగు బెర్త్‌లు మిగిలి ఉండటంతో... ఫైనల్లో చింకీ యాదవ్‌ 116 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచినప్పటికీ తుది ఫలితంతో సంబంధం లేకుండా ఆమెతోపాటు మరో ముగ్గురు షూటర్లకు (థాయ్‌లాండ్‌–2, మంగోలియా–1) ‘టోక్యో’ బెర్త్‌ ఖాయమైంది.

మరోవైపు ఇదే టోర్నీలో మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ టీమ్‌ విభాగంలో తేజస్విని సావంత్, అంజుమ్‌ మౌద్గిల్, కాజల్‌ సైని (1864.8 పాయింట్లు) బృందం స్వర్ణం నెగ్గగా... పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ టీమ్‌ విభాగంలో సంజీవ్‌ రాజ్‌పుత్, శుభాంకర్, తరుణ్‌ యాదవ్‌ (1865.1 పాయింట్లు) బృందం రజతం గెల్చుకుంది. పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో ఉదయ్‌వీర్‌ సిద్ధూ (577 పాయింట్లు) రజతం సాధించగా... ఉదయ్‌వీర్, విజయ్‌వీర్, గుర్‌ప్రీత్‌ సింగ్‌ బృందం 1710 పాయింట్లతో స్వర్ణం సొంతం చేసుకుంది.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా