అంత డబ్బు ఇస్తే.. 'నగ్న'సత్యాలు చెబుతా!

10 Nov, 2017 21:53 IST|Sakshi
ఫైల్‌ ఫొటో

మెల్‌బోర్న్ : వెస్టిండీస్ విధ్వంసక క్రికెటర్ క్రిస్ గేల్ ఆటతో ఎంత ఫేమసో.. వివాదాల్లోనూ అంతే. ఇటీవల జరిగన ఓ వివాదం గురించి వివరించాలంటే తనకు గంట సమయం పడుతుందని, ఒకవేళ సీక్రెట్స్ తెలుసుకోవాలనుకున్న మీడియా తనకు దాదాపు రూ. 2 కోట్లు (3 లక్షల అమెరికన్ డాలర్లు) మేర నగదు చెల్లిస్తే చెబుతానని కండీషన్ పెట్టాడు. ఇందుకు సంబంధించి తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు చేశాడు.

అసలు వివాదమేంటి?
2015 వన్డే ప్రపంచ కప్ సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన మహిళా మసాజ్‌ థెరపిస్ట్‌ లిన్నే రస్సెల్‌ డ్రెస్సింగ్‌ రూములోకి రాగా, గేల్ తాను కట్టుకున్న టవాల్ విప్పేసి నగ్నంగా మారినట్లు ఆమె ఆరోపించింది. లిన్నే రస్సెల్‌కు గేల్ తన మర్మాంగాన్ని చూపించి అసభ్యంగా ప్రవర్తించాడని గత జనవరిలో సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌, ద ఏజ్‌, ద కాన్‌బెర్రా టైమ్స్‌ లలో కథనాలు వచ్చాయి. తనపై తప్పుడు కథనాలు ప్రచురించారని మీడియాపై పరువునష్టం దావా వేశాడు. గత నెల చివరివారంలో విచారణ చేపట్టిన ఎన్‌ఎస్‌డబ్ల్యూ సుప్రీంకోర్టు గేల్‌కు మద్ధతు తెలిపింది. దేశానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తిపై సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా కథనాలు రాయడం సబబు కాదని మీడియాకు ధర్మాసనం సూచించింది.

ఆసక్తికర కథ చెప్పాలా..
'మీకు చెప్పడానికి నాతో ఎంతో ఆసక్తికర కథ ఉంది. అరవై నిమిషాల ఇంటర్వ్యూలో ఆ వివాదాన్ని మీకు వివరిస్తాను. లేకపోతే నా తర్వాతి బుక్ విడుదల చేసే వరకు ఎదురుచూడాల్సిందే. ఆస్ట్రేలియాలో ఏం జరిగింది, నాపై నిషేధం విధించేందుకు కొందరు పెద్ద వ్యక్తులు రంగంలోకి దిగారు. నన్ను ఏ విధంగా బలిపశువును చేయాలని చూశారో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో చెబుతాను. సినిమా కథలా చెబుతాను. కనుక ఆ ఇంటర్వ్యూ ఖరీదు అక్షరాలా 3 లక్షల అమెరికన్ డాలర్లు అవుతుందంటూ' మసాజ్ థెరపిస్ట్ తో ఆ రోజు ఏం జరిగింది, ఆ తర్వాత తాను ఎదుర్కొన్న పరిస్తితులపై గేల్ ఈ విధంగా ట్వీట్లలో రాసుకొచ్చాడు. దీనిపై గేల్ అభిమానులు ఆయనకు మద్ధతుగా రీట్వీట్లు చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు