'రషీద్ వస్తే‌ అంతు చూస్తా అన్నాడు'

24 Jun, 2020 16:50 IST|Sakshi

ఢిల్లీ : కరోనా నేపథ్యంలో ఆటకు విరామం దొరకడంతో టీమిండియా టెస్టు క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ 'ఓపెన్‌ నెట్స్‌ విత్‌ మయాంక్‌' పేరుతో చాట్‌షో నిర్వహిస్తున్నాడు. వరుస చాట్ షోలతో క్రికెటర్లను ఇంటర్య్వూ చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. తాజగా మయాంక్‌ ఐపీఎల్‌లో కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ సహచర ఆటగాళ్లైన కేఎల్‌ రాహుల్‌, క్రిస్‌ గేల్‌తో చాట్ షో నిర్వహించాడు. చాట్‌ సందర్భంగా రాహుల్‌, గేల్‌లు ఐపీఎల్‌ బెస్ట్‌ మూమెంట్స్‌ను షేర్‌ చేసుకున్నారు. ('అల్లా దయ.. నాకు కరోనా సోకలేదు')

రాహుల్‌ స్పందిస్తూ.. '2018 ఐపీఎల్‌లో నేను కింగ్స్‌ లెవెన్‌కు ఆడుతున్న సమయంలో క్రిస్‌ గేల్‌ కూడా జట్టులో ఉన్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్‌ విధ్వంసం ఇంకా నా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. నాకు బాగా గుర్తు.. ఆరోజు గేల్‌ మంచి ఆకలి మీద ఉన్నాడు. ఆ సీజన్‌లోనే అత్యధిక పరుగులు చేయాలనే ఉత్సాహంతో ఆడుతున్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్‌ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న గేల్‌ ఈ సమయంలో రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌కు వస్తే అతని అంతు చూస్తా అని పేర్కొన్నాడు. ఎందుకంటే నాకు స్పిన్నర్‌ బౌలింగ్‌ రావడం ఇష్టం లేదని.. నా ముందు ఆధిపత్యం చలాయిస్తే చూస్తూ ఊరుకోనని తెలిపాడు. 14 ఓవర్‌ వేసిన రషీద్‌ బౌలింగ్‌లో వరుసగా 4 సిక్స్‌లు కొట్టి గేల్‌ తన మాటను నిలబెట్టుకున్నాడు. నేను చూసిన మూమెంట్స్‌లో దీనినే ది బెస్ట్‌ అంటా' అని కేఎల్‌ రాహుల్‌ చెప్పుకొచ్చాడు.

కాగా కరోనాతో ఆటకు బ్రేక్‌ రావడంతో ఫిట్‌నెస్‌ను ఎలా కాపాతున్నావని క్రిస్‌ గేల్‌ని మయాంక్‌ ప్రశ్నించాడు. ' నేను జార్జ్ ఫ్లాయిడ్‌ , జాన్‌సెనా కంటే ఫిట్‌నెస్‌గానే ఉన్నా' అంటూ గేల్‌ నవ్వుతూ పేర్కొన్నాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో క్రిస్‌ గేల్‌ 11 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 104 పరుగులు సాధించాడు. ఆ సీజన్‌లో రాహుల్‌ అత్యధిక పరుగులు సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అయితే జట్టుగా విఫలమైన కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌  పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌  ఐపీఎల్‌ 13వ ఎడిషన్‌లో కింగ్స్‌ ఎలెవెన్‌కు కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌ 2020 కరోనా దృష్యా వాయిదా పడింది. అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్‌ నిర్వహణ వాయిదా పడితే దాని స్థానంలో ఐపీఎల్‌ 13వ సీజన్‌ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.('ఆసియా కప్‌ కచ్చితంగా జరుగుతుంది')

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు