ఫుట్ బాల్ లీగ్లో క్రిస్ గేల్!

7 Jun, 2016 19:00 IST|Sakshi
ఫుట్ బాల్ లీగ్లో క్రిస్ గేల్!

ముంబై: వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ మరోసారి అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. అటు వెస్టిండీస్ జట్టులో స్థానం కోల్పోయిన గేల్.. మాంచెస్టర్ యునైటెడ్తో ఒప్పందం చేసుకున్నానంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మాంచెస్టర్ మేనేజర్తో సమావేశమై తన ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నానంటూ గేల్ పేర్కొనడంతో క్రికెట్ అభిమానుల్ని ఒకింత ఆలోచనలో పడేసింది. దీనిపై క్రీడా అభిమానులు చర్చకు దిగారు. కొంతమంది ఇదేదో సరదాగా చేసిన వ్యాఖ్యని కొట్టిపారేయగా, మరి కొంతమంది మాత్రం మాంచెస్టర్తో గేల్ ఒప్పందాన్ని నమ్మేశారు. దీనికి తోడు రెడ్ షర్ట్ను, తన చేతిలో ఒక స్కార్ఫ్ను పట్టుకుని మరీ ఫోజిచ్చాడు.

 అయితే దీనిపై తీరిగ్గా స్పందించిన గేల్..  అబ్బే ఇదొక జోక్ అంటూ బాంబు పేల్చాడు. తనకు ఫుట్ బాల్ పై ఉన్న ప్రేమను ఇలా చాటుకున్నానంటూ సమర్ధించుకున్నాడు. తాను క్రికెటర్ని అవ్వకపోతే, ఫుట్ బాల్ ఆటగాడ్ని అయ్యేవాడినని స్పష్టం చేశాడు. ప్రస్తుతం నాట్వెస్ట్ టీ 20 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్ లో ఉన్న గేల్ సరదాగా అభిమానుల్ని ఆటపట్టించే పనిలో పడ్డాడన్న మాట. ఇటీవల మహిళా జర్నలిస్టుల పట్ల శృంగారపరమైన వ్యాఖ్యలు చేసి గేల్ వివాదంలో పడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి జరిగిన బిగ్ బాష్ లీగ్ సందర్భంగా ఓ టీవీ జర్నలిస్టు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన గేల్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఇంగ్లండ్ టీవీ వ్యాఖ్యాతకు ఇచ్చిన ఇంటర్య్వూలో మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రస్తుతం విండీస్ బోర్డుతో విభేదాల కారణంగా జట్టులో స్థానం కోల్పోయిన గేల్..  వచ్చే ఏడాది బిగ్ బాష్ లీగ్ కాంట్రాక్టును కూడా కోల్పోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు