చితక్కొట్టారు!

25 Feb, 2015 01:24 IST|Sakshi
చితక్కొట్టారు!

ప్రపంచకప్‌లో గేల్  ‘డబుల్’ దుమారం
 శామ్యూల్స్ అజేయ సెంచరీ
 జింబాబ్వేపై విండీస్ ఘన విజయం

 
 కాన్‌బెర్రా: క్రికెట్‌లో తను ఎంత ప్రమాదకారో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ క్రిస్ గేల్ (147 బంతుల్లో 215; 10 ఫోర్లు, 16 సిక్సర్లు) మరోసారి నిరూపించుకున్నాడు. జట్టు ఎలాంటిదైనా.. బౌలర్ ఎలాంటి వాడైనా... తనకు ఏమాత్రం సంబంధంలేదనే స్థాయిలో ప్రపంచకప్‌లో వీరవిహారం చేశాడు. ఈ టోర్నీ చరిత్రలో ఇంతవరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో డబుల్ సెంచరీతో శివమెత్తాడు. సహచరుడు మార్లన్ శామ్యూల్స్ (156 బంతుల్లో 133; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా శతకం బాదడంతో... మంగళవారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 73 పరుగుల తేడా (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి)తో జింబాబ్వేపై విజయం సాధించింది.
 
  మనుకా ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచిన విండీస్ 50 ఓవర్లలో 2 వికెట్లకు 372 పరుగులు చేసింది. గేల్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన స్మిత్ (0) ఇన్నింగ్స్ రెండో బంతికే డకౌటయ్యాడు. ఈ దశలో శామ్యూల్స్, గేల్ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ క్రమంలో నెమ్మదిగా ఆడి పవర్‌ప్లే 10 ఓవర్లలో కేవలం 43 పరుగులు మాత్రమే చేశారు. ఆ తర్వాత కూడా శామ్యూల్స్ బాగా నెమ్మదిగా ఆడినా... గేల్ అడపాదడపా బౌండరీలు, సిక్సర్లతో బ్యాట్ ఝళిపించాడు. 51 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న గేల్... తర్వాతి 50 పరుగులకు 54 బంతులు తీసుకున్నాడు.
 
 13 ఓవర్లలో 195 పరుగులు
 37 ఓవర్లు ముగిసే సరికి విండీస్ స్కోరు 177/1. గేల్ 105 (4 ఫోర్లు, 6 సిక్సర్లు), శామ్యూల్స్ 59 పరుగులతో క్రీజులో ఉన్నారు. అప్పటి వరకు ఎక్కువగా స్ట్రయికింగ్ రాని గేల్.... ఆ తర్వాత సిక్సర్ల వేట మొదలుపెట్టాడు.
 
  దీంతో 38 బంతుల్లోనే రెండో వంద పరుగులు సాధించాడు. శామ్యూల్స్ కూడా 143 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి 17వ సిక్సర్ కోసం ప్రయత్నించిన గేల్.. చిగుంబరా చేతికి చిక్కాడు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు రికార్డు స్థాయిలో 298 బంతుల్లో 372 పరుగులు జోడించారు. ఓవరాల్‌గా చివరి 13 ఓవర్లలో 195 పరుగులు చేసిన ఈ జోడి... ఆఖరి 10 ఓవర్లలోనే 152 పరుగులు రాబట్టింది.
 
 ఓడినా ఆకట్టుకున్నారు
 భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే 44.3 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. రెండు ఓవర్ల తర్వాత ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో జింబాబ్వే లక్ష్యాన్ని 48 ఓవర్లలో 363 పరుగులుగా సవరించారు. విలియమ్స్ (61 బంతుల్లో 76; 9 ఫోర్లు), ఎర్విన్ (41 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. టేలర్ (48 బంతుల్లో 37; 2 ఫోర్లు, 1 సిక్స్), రజా (20 బం తుల్లో 26; 5 ఫోర్లు), చిగుంబరా (21) మోస్తరుగా ఆడారు.
 
 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జింబాబ్వేను మిడిలార్డర్‌లో విలియమ్స్ ఆదుకున్నాడు. టేలర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 80; ఎర్విన్‌తో కలిసి ఐదో వికెట్‌కు 51 పరుగులు జోడించాడు. ఉన్నంతసేపు వేగంగా ఆడిన ఎర్విన్... ఆరో వికెట్‌కు మట్సికెనెరీ (19)తో కలిసి 49 పరుగులు జోడించి అవుట య్యాడు. ఈ దశలో విండీస్ బౌలర్లు ఒత్తిడి పెంచడం తో జింబాబ్వే 50 పరుగుల తేడాతో చివరి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. టేలర్, హోల్డర్ చెరో మూడు, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ గేల్ 2 వికెట్లు తీశాడు.
 
 స్కోరు వివరాలు
 వెస్టిండీస్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) పన్యాంగరా 0; గేల్ (సి) చిగుంబరా (బి) మసకద్జా 215; శామ్యూల్స్ నాటౌట్ 133; ఎక్స్‌ట్రాలు: 24; మొత్తం: (50 ఓవర్లలో 2 వికెట్లకు) 372.
 వికెట్ల పతనం: 1-0; 2-372. బౌలింగ్: పన్యాంగరా 9-0-82-1; చతారా 9.4-0-74-0; విలియమ్స్ 5-0-48-0; చిగుంబరా 7-0-44-0; సికిందర్ రజా 10-1-45-0; కముంగోజి 3-0-37-0; మసకద్జా 6.2-0-39-1. జింబాబ్వే ఇన్నింగ్స్: సికిందర్ రజా (సి) సిమ్మన్స్ (బి) హోల్డర్ 26; చకాబ్వా ఎల్బీడబ్ల్యు (బి) హోల్డర్ 2; మసకద్జా ఎల్బీడబ్ల్యు (బి) టేలర్ 5; టేలర్ (సి) రామ్‌దిన్ (బి) శామ్యూల్స్ 37; విలియమ్స్ (సి) స్మిత్ (బి) హోల్డర్ 76; ఎర్విన్ (బి) గేల్ 52; మట్సికెనెరీ ఎల్బీడబ్ల్యు (బి) గేల్ 19; చిగుంబరా (సి) గేల్ (బి) టేలర్ 21; పన్యాంగరా (సి) రామ్‌దిన్ (బి) టేలర్ 4; చటారా (బి) మిల్లర్ 16; కుముంగోజి నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు: 25; మొత్తం: (44.3 ఓవర్లలో ఆలౌట్) 289. వికెట్ల పతనం: 1-11; 2-26; 3-46; 4-126; 5-177; 6-226; 7-239; 8-254; 9-266; 10-289.బౌలింగ్: టేలర్ 10-0-38-3; హోల్డర్ 7-0-48-3; మిల్లర్ 6.3-0-48-1; శామ్యూల్స్ 9-0-59-1; రస్సెల్ 5-0-44-0; స్యామీ 1-0-8-0; గేల్ 6-0-35-2.


 

 

 

 

 

 

 

372 వన్డే చరిత్రలో గేల్, శామ్యూల్స్‌ల 372 పరుగుల భాగస్వామ్యం అత్యుత్తమం. 1999లో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో న్యూజిలాండ్ మీద సచిన్, ద్రవిడ్ 331 పరుగులు జోడించారు. ఆ రికార్డు ఇప్పుడు బద్దలైంది.  వన్డేల్లో వెస్టిండీస్‌కు ఇదే అత్యుత్తమ స్కోరు(372).
 
 22 వన్డేల్లో గేల్ సెంచరీలు. వెస్టిండీస్ తరఫున ఇదే అత్యుత్తమం. ఓవరాల్‌గా గంగూలీ, కోహ్లిలతో సమానంగా నాలుగో స్థానానికి చేరాడు.
 

మరిన్ని వార్తలు