పంత్‌.. నీ ఆట ఎంతో ఘనం: క్లార్క్‌

4 Jul, 2019 17:52 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ : టీమిండియా యువ సంచలనం రిషభ్‌ పంత్‌పై ఆస్ట్రేలియా మాజీ సారథి మైకేల్‌ క్లార్క్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. తాజా ప్రపంచకప్‌లో అతడి ప్రదర్శన తనను ఎంతగానో ఆకట్టుకుందని ప్రశంసించాడు. పంత్‌ భారీ ఇన్నింగ్స్‌లు నిర్మించక పోయినప్పటికీ.. అతడి షాట్ల ఎంపిక నన్ను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. ఇక పంత్‌ నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌కు దిగిలాని.. అది టీమిండియాకు ఎంతో లాభం చేకురుతుందని పేర్కొన్నాడు. దినేశ్‌ కార్తీక్‌ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగేందుకు అన్ని విధాల అర్హుడని అభివర్ణించాడు. 

‘ధావన్‌ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన పంత్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పర్వాలేదనిపించాడు. అతడి షాట్ల ఎంపిక నన్ను ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసింది. టీమిండియాకు లాభం చేకూరాలంటే పంత్‌ నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌కు రావాలి. అలా వస్తేనే మిడిల్‌ ఓవర్లలో భారీ పరుగులు రాబట్టగలడు. పంత్‌కు ఎక్కువ అవకాశాలు ఇస్తే మరింత రాటుదేలుతాడు. ఎంతో అనుభవం కలిగిన దినేశ్‌ కార్తీక్‌ ఆరో స్థానంలో బ్యాటింగ్‌ దిగడం టీమిండియాకు ఎంతో ఉపయోగకరం. అతడి అనుభవంతో లోయరార్డర్‌లో బలమైన భాగస్వామ్యాలను నమోదు చేసే అవకాశం ఉంది. ఇక రోహిత్‌, విరాట్‌ కోహ్లిలు అధ్బుత ఫామ్‌లో ఉన్నారు. కోహ్లి ఈ ప్రపంచకప్‌లో ఓ భారీ ఇన్నింగ్స్‌ బాకీ పడ్డాడు’అంటూ క్లార్క్‌ వ్యాఖ్యానించాడు. 

మరిన్ని వార్తలు