కోల్‌కతా చేతిలో హైదరాబాద్ చిత్తు

5 May, 2015 02:46 IST|Sakshi
కోల్‌కతా చేతిలో హైదరాబాద్ చిత్తు

‘సన్’ డీలా...
వరుసగా రెండు విజయాలతో జోరు పెంచినట్లు కనిపించిన సన్‌రైజర్స్ వేడి అంతలోనే చల్లారింది. తక్కువ స్కోర్లను కూడా కాపాడుకుంటూ వచ్చిన హైదరాబాద్ ఈసారి లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయిన ఆ జట్టు కోలుకోలేకపోయింది. మరోవైపు సమష్టి ప్రదర్శనతో నైట్‌రైడర్స్ సత్తా చాటింది. సొంతగడ్డ ఈడెన్‌లో చెలరేగి వైజాగ్ ఓటమికి జవాబిచ్చింది.
35 పరుగులతో పరాజయం
బ్యాట్స్‌మెన్ మళ్లీ విఫలం
 
  

నైట్‌రైడర్స్ సమష్టి ప్రదర్శన
కోల్‌కతా: ఐపీఎల్ ప్రతీ మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యంతో ఇబ్బంది పడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను మళ్లీ అదే లోపం దెబ్బ తీసింది. ఫలితంగా జట్టు ఖాతాలో మరో పరాజయం చేరింది. సోమవారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 35 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఎవరూ భారీ స్కోరు సాధించకపోయినా... మనీశ్ పాండే (26 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్సర్లు), గంభీర్ (23 బంతుల్లో 31; 5 ఫోర్లు), యూసుఫ్ పఠాన్ (19 బంతుల్లో 30 నాటౌట్; 4 ఫోర్లు), ఉతప్ప (27 బంతుల్లో 30; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు.

అనంతరం సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. హెన్రిక్స్ (33 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)తో పాటు చివర్లో కరణ్ శర్మ (20 బంతుల్లో 32; 3 సిక్సర్లు) ధాటిగా ఆడినా అది సన్ విజయానికి సరిపోలేదు. మిగతా ఆటగాళ్లు కనీస ప్రదర్శన కూడా ఇవ్వకపోవడం సన్ బ్యాటింగ్ పరిస్థితిని సూచిస్తోంది. వెటరన్ బ్రాడ్ హాగ్ (2/17), చావ్లా (1/16) ప్రత్యర్థిని పూర్తిగా కట్టి పడేయగా... ఉమేశ్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం దక్కింది.

తొలి వికెట్‌కు 57 పరుగులు...
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో రాణించిన హైదరాబాద్ ఆటగాడు ఆశిష్ రెడ్డి గాయంతో మ్యాచ్‌కు దూరం కాగా లెఫ్టార్మ్ స్పిన్నర్ బిపుల్ శర్మకు చోటు దక్కింది. సన్ ఈసారి బౌల్ట్‌ను కాదని స్టెయిన్‌కు అవకాశమిచ్చింది. కోల్‌కతాకు ఓపెనర్లు ఉతప్ప, గంభీర్ శుభారంభం అందించారు. పేస్ బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొన్న వీరు చకచకా పరుగులు రాబట్టడంతో పవర్ ప్లేలో జట్టు వికెట్ కోల్పోకుండా 55 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత స్పిన్నర్లు కరణ్ శర్మ, బిపుల్ శర్మ ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఫలితంగా తర్వాతి ఆరు ఓవర్లలో 31 పరుగులు మాత్రమే చేయగలిగిన నైట్‌రైడర్స్ మూడు వికెట్లు కోల్పోయింది.

గంభీర్, ఉతప్పలను కరణ్ అవుట్ చేయగా, బిపుల్ బౌలింగ్‌లో రసెల్ (1) వెనుదిరిగాడు. మరోవైపు మనీష్ పాండే కొన్ని చక్కటి షాట్లతో స్కోరు వేగం పెంచే ప్రయత్నం చేశాడు. అయితే వరుస ఓవర్లలో పాండే, డస్కటే (8) అవుటయ్యారు. ఆ తర్వాత భువనేశ్వర్ వేసిన ఒకే ఓవర్లో బోథా (12), సూర్య కుమార్ (6) డగౌట్ చేరగా... చివర్లో పఠాన్ ధాటిగా ఆడటంతో కోల్‌కతా మెరుగైన స్కోరు సాధించగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో స్పిన్నర్లతో పాటు హెన్రిక్స్ (1/20) ప్రభావం చూపగా, స్టెయిన్ (0/37) మరోసారి విఫలమయ్యాడు.

టపటపా...
తొలి ఓవర్‌లోనే ఉమేశ్ యాదవ్ రైజర్స్‌కు షాక్ ఇచ్చాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న వార్నర్ (4) ఉమేశ్ మూడో బంతికే క్లీన్ బౌల్డ్ కాగా, ఆరో బంతికి నమన్ ఓజా (0) కూడా అలాగే అవుటయ్యాడు. ఆదుకుంటాడనుకున్న శిఖర్ ధావన్ (15 బంతుల్లో 15; 3 ఫోర్లు) కూడా నిరాశపర్చాడు. హాగ్ తొలి ఓవర్‌లోనే  పుల్ షాట్ ఆడబోయి అతను స్క్వేర్ లెగ్‌లో పాండేకు క్యాచ్ ఇవ్వడంతో ఐదు ఓవర్లలోపే సన్ మూడో వికెట్ కూలింది. పవర్‌ప్లే తర్వాత రైజర్స్‌కు కాస్త ఊపు తెచ్చే ఓవర్ వచ్చింది. పఠాన్ వేసిన ఏడో ఓవర్లో హెన్రిక్స్ 2 సిక్సర్లు, 1 ఫోర్ బాదడంతో మొత్తం 19 పరుగులు వచ్చాయి. అయితే కొద్ది సేపటికే లేని పరుగు కోసం ప్రయత్నించి మోర్గాన్ (5) రనౌట్ కావడం సన్ ఆశలు సన్నగిల్లాయి. విహారి (6), బిపుల్ (1) ఒకే ఓవర్లో వెనుదిరగ్గా... మరోవైపు క్రీజ్‌లో నిలిచిన హెన్రిక్స్ కొద్దిసేపు పోరాడే ప్రయత్నం చేశాడు. మ్యాచ్ దాదాపుగా చేజారిన తర్వాత బోథా వేసిన 18వ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాది కరణ్ కాస్త వినోదాన్ని పంచినా అప్పటికే ఆలస్యమైపోయింది.

స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) వార్నర్ (బి) కరణ్ 30; గంభీర్ (సి) మోర్గాన్ (బి) కరణ్ 31; పాండే (రనౌట్) 33; రసెల్ (సి) మోర్గాన్ (బి) బిపుల్ 1; డస్కటే (ఎల్బీ) (బి) హెన్రిక్స్ 8; పఠాన్ (నాటౌట్) 30; బోథా (బి) భువనేశ్వర్ 12; సూర్య కుమార్ (సి) హెన్రిక్స్ (బి) భువనేశ్వర్ 6; చావ్లా (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 167.
వికెట్ల పతనం: 1-57; 2-81; 3-86; 4-105; 5-111; 6-139; 7-145.; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-42-2; స్టెయిన్ 4-0-37-0; ప్రవీణ్ 1-0-10-0; హెన్రిక్స్ 3-0-20-1; కరణ్ 4-0-29-2; బిపుల్ 4-0-23-1.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (బి) ఉమేశ్ 4; ధావన్ (సి) పాండే (బి) హాగ్ 15; నమన్ ఓజా (బి) ఉమేశ్ 0; హెన్రిక్స్ (సి) పాండే (బి) హాగ్ 41; మోర్గాన్ (రనౌట్) 5; విహారి (స్టంప్డ్) ఉతప్ప (బి) చావ్లా 6; బిపుల్ (రనౌట్) 1; కరణ్ (సి) సూర్య కుమార్ (బి) బోథా 32; ప్రవీణ్ (సి) ఉమేశ్ (బి) రసెల్ 12; భువనేశ్వర్ (నాటౌట్) 11; స్టెయిన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 132.
 వికెట్ల పతనం: 1-5; 2-6; 3-29; 4-55; 5-68; 6-69; 7-81; 8-117; 9-131.; బౌలింగ్: ఉమేశ్ 4-0-34-2; రసెల్ 2-0-10-1; బోథా 4-0-32-1; హాగ్ 4-0-17-2; పఠాన్ 1-0-19-0; చావ్లా 4-0-16-1; డస్కటే 1-0-4-0.

>
మరిన్ని వార్తలు