సూపర్ ‘టై’

30 Sep, 2013 01:33 IST|Sakshi

జైపూర్: ఇన్నాళ్లూ టి20ల్లో మ్యాచ్‌లు ‘టై’ అయితే సూపర్ ఓవర్ ద్వారా ఫలితం రావడం చూశాం. కానీ సూపర్ ఓవర్ కూడా టైగా ముగిస్తే... ఆ ఉత్కంఠతను తట్టుకోవడం కష్టం. టి20 చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తొలిసారి సూపర్ ఓవర్ కూడా ‘టై’ అయిన మ్యాచ్ చాంపియన్స్ లీగ్‌లో జరిగింది. హైవీల్డ్ లయన్స్, ఒటాగో వోల్ట్స్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో బౌండరీల సంఖ్య ద్వారా గెలిచిన ఒటాగో... సీఎల్‌టీ20 సెమీస్‌కు చేరువయింది.
 
 తమ బ్యాట్స్‌మన్ డి కాక్ అద్భుతమైన సెంచరీ చేసినా లయన్స్ మ్యాచ్‌ను కోల్పోయింది. ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓటమితో లయన్స్ జట్టు రిక్తహస్తాలతో వెనుదిరగనుంది. సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లయన్స్... 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగలు చేసింది. ఓపెనర్ క్వింటాన్ డి కాక్ (63 బంతుల్లో 109 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేశాడు. సహచరులంతా విఫలమైనా ఒంటిచేత్తో పోరాడి భారీ స్కోరు అందించాడు.
 
 తర్వాత ఒటాగో జట్టు కూడా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి సరిగ్గా 167 పరుగులే చేసింది. ఒక దశలో ఓడిపోతుందనుకున్న ఒటాగోను... నీషామ్ (25 బంతుల్లో 52 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరం కాగా... తన్వీర్ వేసిన ఈ ఓవర్లో నీషామ్ ఓ సిక్సర్ కొట్టినా... 10 పరుగులే వచ్చాయి. దీంతో మ్యాచ్ టై గా ముగిసింది.
 
 సూపర్ ఓవర్‌లో డ్రామా: ఫలితం కోసం నిర్వహించిన సూపర్ ఓవర్‌లో తొలుత ఒటాగో జట్టు 13 పరుగులు చేసింది. తన్వీర్ బౌలింగ్‌లో నీషామ్ ఒక బౌండరీ, మెకల్లమ్ ఒక సిక్సర్ కొట్టారు.
 తర్వాత లయన్స్ తరఫున డి కాక్ తొలి మూడు బంతులకే నీషామ్ బౌలింగ్‌లో ఫోర్, సిక్సర్, సింగిల్‌తో 11 పరుగులు రాబట్టాడు. ఇక మూడు బంతులకు మూడు పరుగులు కావలసిన దశలో... సైమ్స్ అవుటయ్యాడు. తర్వాతి బంతికి డి కాక్ మరో సింగిల్ తీశాడు. ఇక విజయానికి ఆఖరి రెండు పరుగులు కావాల్సి ఉండగా... ప్రిటోరియస్ ఒక పరుగు తీసి రనౌట్ అయ్యాడు. దీంతో లయన్స్‌కు కూడా సరిగ్గా 13 పరుగులే వచ్చాయి. దీంతో స్కోర్లు మరోసారి సమమయ్యాయి.
 
 ఫలితం తేలిందిలా: సూపర్ ఓవర్ కూడా టై అయితే ఫలితం కోసం ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఇందులోనూ రెండు జట్లు సరిగ్గా ఏడేసి సిక్సర్లు కొట్టాయి. ఈ సమయంలో బౌండరీలు ఎక్కువ కొట్టిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. లయన్స్ 11 ఫోర్లు కొడితే.. ఒటాగో జట్టు 12 ఫోర్లు కొట్టింది. దీంతో ఒక బౌండరీ అధికంగా కొట్టినందున ఒటాగో జట్టు మ్యాచ్ గెలిచినట్లు ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు