‘మాస్టర్’ ఆఖరిసారిగా...

27 Dec, 2013 10:05 IST|Sakshi
‘మాస్టర్’ ఆఖరిసారిగా...

మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌ను అభిమానులు ఆఖరిసారిగా  క్రికెట్ మైదానంలో రంగు దుస్తుల్లో చూడబోతున్నారు. ఇప్పటికే వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ‘మాస్టర్’ చాంపియన్స్ లీగ్ టోర్నీ అనంతరం టి20 ఫార్మాట్‌నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
 
  ఈ నేపథ్యంలో సీఎల్‌టి20లో సచిన్ ఆడే ప్రతీ మ్యాచ్‌పై ప్రేక్షకుల వైపు నుంచి అదనపు ఆసక్తి ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఐపీఎల్‌లాగే ఈ టోర్నీని కూడా నెగ్గి ఈ దిగ్గజ క్రికెటర్‌కు మరో కానుక ఇవ్వాలని ముంబై ఇండియన్స్ పట్టుదలగా ఉంది. మరో వైపు రాహుల్ ద్రవిడ్ కూడా చివరిసారిగా క్రికెట్ మైదానంలో దిగనున్నాడు.
 
 జైపూర్: చాంపియన్స్ లీగ్-2013 తొలి పోరులో రాజస్థాన్ రాయల్స్ తమ సొంతగడ్డపై ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో తలపడనుంది. సచిన్ కోసం... అంటూ ముంబై జట్టు టోర్నీని ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, ఐపీఎల్‌లో తమ జట్టుపై వచ్చిన ఫిక్సింగ్ వివాదాన్ని మరచి విజయాన్ని అందుకోవాలని రాజస్థాన్ రాయల్స్ భావిస్తోంది. దాంతో ఇరు జట్లకు తొలి మ్యాచ్ కీలకంగా మారింది. ముంబై గతంలో ఒకసారి చాంపియన్స్ లీగ్‌లో విజేతగా నిలిచింది. రాయల్స్ మాత్రం టైటిల్ అందుకోలేదు. ఐపీఎల్-6లో ఈ రెండు జట్లు మాత్రమే సొంత మైదానంలో ఒక్క మ్యాచ్ కూడా ఓడలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడి సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో బరిలోకి దిగుతుండటం ద్రవిడ్ సేనకు అనుకూలాంశం.
 
 మలింగ లేని లోటు...
 ఐపీఎల్ విజేత హోదాలో బరిలోకి దిగుతున్న ముంబై ఇండియన్స్ మరోసారి తమ బ్యాటింగ్‌నే నమ్ముకుంది. సచిన్ టెండూల్కర్‌తో పాటు ఐపీఎల్‌లో జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ, డ్వేన్ స్మిత్, రాయుడు, దినేశ్ కార్తీక్‌లతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఇక సీఎల్‌టి20తోనే వెలుగులోకి వచ్చిన పొలార్డ్ చెలరేగితే ప్రత్యర్థికి కష్టాలు తప్పవు. డ్వేన్ స్మిత్ అద్భుత బ్యాటింగ్‌తోనే ముంబై జట్టు ఐపీఎల్‌లో దూసుకుపోయింది. అయితే ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన లసిత్ మలింగ టోర్నీకి దూరం కావడం ఆ జట్టు బౌలింగ్‌ను బలహీనపర్చింది. అయితే కౌల్టర్‌కు పెద్దగా అనుభవం లేకపోవడం, ఆబూ నెచిమ్, రిషి ధావన్ రూపంలో ఇద్దరు భారత పేసర్లు మాత్రమే జట్టులో ఉండటంతో మిచెల్ జాన్సన్‌పై పేస్ భారం పడుతుంది. మలింగ గైర్హాజరీతో హర్భజన్ సింగ్ ప్రధాన బౌలర్ బాధ్యత నెరవేర్చాల్సి ఉంది.
 
 వాట్సన్‌పై భారం...
 ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ వివాదం రాజస్థాన్ రాయల్స్ జట్టు స్థైర్యాన్ని బాగా దెబ్బ తీసింది. జట్టులోని ప్రతీ క్రికెటర్‌నూ అనుమానించాల్సిన పరిస్థితిని కల్పించింది. వీటిని అధిగమించి జట్టుగా సత్తా చాటాలని రాజస్థాన్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పట్టుదలగా ఉన్నాడు. పైగా తన క్రికెట్ కెరీర్‌ను మెరుగైన ప్రదర్శనతో ముగించాలని కూడా అతను భావిస్తున్నాడు. రాయల్స్ బ్యాటింగ్‌కు షేన్‌వాట్సన్ మూల స్థంభంగా చెప్పవచ్చు.
 
 ఐపీఎల్‌లో జట్టు టాప్ స్కోరర్ అయిన అతను ఇటీవల ఇంగ్లండ్‌పై వన్డేలో సెంచరీ చేసి ఫామ్‌లో ఉన్నాడు. బ్రాడ్ హాడ్జ్, ద్రవిడ్, రహానే, బిన్నీలతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. అశోక్ మేనరియా కూడా భారీ షాట్లు ఆడగల సమర్థుడు. అయితే శ్రీశాంత్, అంకిత్ చవాన్, సిద్ధార్థ్ త్రివేదిలపై వేటు పడటంతో జట్టు బౌలింగ్ కాస్త బలహీనంగా మారింది. షాన్ టెయిట్, ఫాల్క్‌నర్, వాట్సన్‌లదే ప్రధాన పాత్ర. కూపర్‌తో పాటు భారత దేశవాళీ బౌలర్లలో విక్రమ్‌జిత్ మాలిక్, రాహుల్ శుక్లాలు అండగా నిలవాల్సి ఉంది. రాయల్స్ టీమ్‌లో ప్రవీణ్  ఒక్కడే స్పెషలిస్ట్ స్పిన్నర్.
 
 జట్ల వివరాలు
 ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), సచిన్, నెచిమ్, కౌల్టర్, రిషి ధావన్, హర్భజన్, జాన్సన్, కార్తీక్, మ్యాక్స్‌వెల్, ప్రజ్ఞాన్ ఓజా, అక్షర్ పటేల్, పొలార్డ్, రాయుడు, స్మిత్, తారే.
 రాజస్థాన్ రాయల్స్: ద్రవిడ్ (కెప్టెన్), బిన్నీ, కూపర్, ఫాల్క్‌నర్, హాడ్జ్, మాలిక్, మేనరియా, రహానే, సంజు సామ్సన్, శుక్లా, టెయిట్, తాంబే, యాజ్ఞిక్, హర్మీత్‌సింగ్.  
 
 ‘ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తేమ ఎక్కువగా ఉండి వికెట్ కాస్త నెమ్మదించవచ్చు. సాధారణంకంటే ఎక్కువగానే సుదీర్ఘ సమయం పాటు వర్షం పడుతోంది. మేం అన్ని ఏర్పాట్లు చేస్తున్నా వరుణుడిని అడ్డుకోలేం కదా. పిచ్‌పై అంతా చక్కబడే సరికి కొంత సమయం పట్టవచ్చు’.
 - తపోష్ ఛటర్జీ, పిచ్ క్యురేటర్
 

మరిన్ని వార్తలు