ప్రపంచకప్‌ ప్రదర్శనపై సమీక్ష

13 Jul, 2019 04:20 IST|Sakshi

 కోచ్, కెప్టెన్‌లతో మాట్లాడనున్న సీఓఏ

ముంబై: ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శనను సమీక్షించాలని క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలోనే జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రిలతో సీఓఏ సమావేశమవుతుంది. మెగా టోర్నీ గ్రూప్‌ దశలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా అనూహ్యంగా సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడి నిష్క్రమించింది. ఇంగ్లండ్‌ నుంచి కోహ్లి, శాస్త్రి తిరిగి రాగానే సీఓఏ సభ్యులు వినోద్‌ రాయ్, డయానా ఎడుల్జీ, రవి తోడ్గే వారితో చర్చిస్తారు.

దీంతో పాటు సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌తో కూడా ప్రత్యేకంగా భేటీ ఉంటుంది. ముఖ్యంగా అంబటి రాయుడు విషయంలో సెలక్టర్లు, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవహరించిన తీరును సీఓఏ ప్రశ్నించే అవకాశం ఉంది. రాయుడు మిడిలార్డర్‌లో సరైనవాడని కాదని భావిస్తే ప్రపంచ కప్‌ ముందు జరిగిన ఆఖరి సిరీస్‌ (ఆస్ట్రేలియాతో) వరకు కూడా అతడిని ఎందుకు ఆడించారనే విషయాన్ని కమిటీ ప్రశ్నించవచ్చు. అదే విధంగా దినేశ్‌ కార్తీక్‌ వైఫల్యం, సెమీస్‌లో ధోని ఏడో స్థానంలో ఆడిన విషయాలు కూడా  భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు 2020 టి20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టును సిద్ధం చేసే విషయంలో సెలక్షన్‌ కమిటీ సూచనలను సీఓఏ కోరనుంది.   

రేపు భారత జట్టు రాక...
ప్రపంచకప్‌ ప్రస్థానాన్ని ముగించిన భారత క్రికెట్‌ జట్టు ఆదివారం స్వదేశం చేరుకోనుంది. విడిగా కాకుండా జట్టు ఆటగాళ్లందరూ కలిసి ఒకేసారి ముంబైకి ప్రయాణిస్తారు. ‘టోర్నీ ముగిశాక కొందరు ఆటగాళ్లు ఇంగ్లండ్‌లోనే ఉండి విరామం కోరుకుంటారని వినిపించింది. అయితే అది వాస్తవం కాదు. జట్టు సభ్యులంతా ఆదివారం లండన్‌లో ఒక్కచోటికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ముంబై విమానమెక్కుతారు. సెమీస్‌ ఓటమి తర్వాత క్రికెటర్లంతా చాలా బాధలో ఉన్నారు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. టోర్నీ నుంచి నిష్క్రమించిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ధోని రిటైర్మెంట్‌పైనే ఉంది. దీనిపై అతను మాత్రం ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. ముంబై నుంచి స్వస్థలం రాంచీ చేరుకున్న తర్వాతే ధోని ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉంది.   

‘4’లో స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ లేకే ఓడాం
హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి విశ్లేషణ
ఎప్పటి నుంచో వెంటాడిన ‘నాలుగో’ సమస్యను సమస్యగానే ఉంచడం వల్ల ప్రపంచకప్‌ ఆశలు ఆవిరయ్యాయని భారత ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ఎట్టకేలకు అంగీకరించారు. మిడిలార్డర్‌లో స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ లేకే సెమీఫైనల్లో కంగుతిన్నామని రవిశాస్త్రి అన్నారు. టీమిండియా పరాజయాన్ని విశ్లేషించిన ఆయన ఈ లోటుపై తప్పకుండా సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిందేనని సూచించారు.  ‘మిడిలార్డర్‌కు కీలకమైన నాలుగో స్థానాన్ని మొదట్లో రాహుల్‌తో లాగించాం. టోర్నీ మధ్యలో ఓపెనర్‌ ధావన్‌ గాయంతో నిష్క్రమించడంతో అతన్ని ఓపెనర్‌గా దింపాల్సి వచ్చింది. విజయ్‌ శంకర్‌ను ఆ నాలుగో స్థానంలో ఆడించినా... అతనూ గాయపడటంతో ఇక చేయాల్సిందేమీ లేకపోయింది’ అని రవిశాస్త్రి వివరించారు.

మయాంక్‌ అగర్వాల్‌ను పిలిపించినా అప్పటికే సమయం మించిపోయిందన్నారు. ధోనిని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు పంపలేదన్న గావస్కర్‌ విమర్శలపై మాట్లాడుతూ ఎంతో అనుభవజ్ఞుడు, గొప్ప ఫినిషర్‌ అయిన ధోనిని ముందే పంపితే... అతను ఔటయితే ఇక గెలిచే పరిస్థితే ఉండదన్న విశ్లేషణతోనే మాజీ కెప్టెన్‌ను ఏడోస్థానంలో దింపామని... ఇది పూర్తిగా జట్టు నిర్ణయమని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు. ‘ఆఖరిదాకా వికెట్‌ కాపాడుకున్న ధోని కూడా గెలిపించగలననే ధీమాతోనే ఉన్నాడు. అతను రనౌట్‌ కానంత వరకు అతని కళ్లలో ఈ ఆత్మవిశ్వాసమే కనబడింది. దురదృష్టవశాత్తూ రనౌట్‌ కావడంతో ఓటమి తప్పలేదు’ అని కోచ్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు