ఎస్‌జీఎం ఆపండి! 

2 Jun, 2018 01:57 IST|Sakshi

సీఓఏ నోటీసు జారీ

కుదరదంటున్న బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లు  

ముంబై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ), పరిపాలకుల కమిటీ (సీఓఏ) మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఇప్పటి వరకు సీఓఏ ప్రతీ సూచనకు తలూపుతూ వచ్చిన బోర్డు ఆఫీస్‌ బేరర్లు ఇకపై దానిని కొనసాగించరాదని గట్టిగా నిర్ణయించుకున్నాయి. ఫలితంగా ఈ నెల 22న జరగాల్సిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఐసీసీతో ఆదాయ పంపిణీ, ఎన్‌సీఏ నిర్వహణ, బోర్డులో కొందరు ఉద్యోగాల నియామకాలవంటి పలు  కీలక అంశాలపై చర్చించేందుకు ఎస్‌జీఎం ఏర్పాటు చేయాల్సిందిగా 15 రాష్ట్ర సంఘాలు విజ్ఞప్తి చేయడంతో కార్యదర్శి అమితాబ్‌ చౌదరి సమావేశానికి నోటీసు ఇచ్చారు.

అయితే సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం ఇలాంటి సమావేశం కోసం తమ నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదు కాబట్టి సమావేశం నిర్వహించడం అక్రమమంటూ సీఈఓ నోటీసు పంపించింది. పైగా ఈ సమావేశానికి వచ్చేవారికి సంబంధించి టీఏ/డీఏ బిల్లులు, విమాన ఛార్జీలువంటివి కూడా చెల్లించరాదంటూ ఘాటుగా లేఖ రాసింది. తమ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎస్‌జీఎం గురించి ఎవరూ చర్చించరాదని కూడా సీఓఏ స్పష్టం చేసింది. ఈ వ్యవహారం బోర్డు అధికారులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అసలు సమావేశాన్ని ఆపే అధికారం సీఓఏకు లేదని, విధానపరమైన నిర్ణయాలలో రాయ్, ఎడుల్జీ కావాలని అతిగా జోక్యం చేసుకుంటున్నారని బోర్డు అధికారులు వ్యాఖ్యానించారు. ఈ తాజా వివాదం ఎక్కడి వరకు వెళుతుందనేది ఆసక్తికరం.   

మరిన్ని వార్తలు