టూర్‌కి భార్యలను కూడా తీసుకెళ్లోచ్చు.. కానీ

17 Oct, 2018 12:42 IST|Sakshi

ముంబై : విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు టూర్‌ మొత్తం ఆటగాళ్ల సతీమణులను అనుమతించాలంటూ కోరిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభ్యర్థనను నియమిత పాలకుల కమిటీ(సీఓఏ) అంగీకరించింది. అయితే విదేశి టూర్‌ స్టార్ట్‌ అయిన పదిరోజుల తర్వాత మాత్రమే వారు క్రికెటర్ల వద్దకు వెళ్లాలని సీఓఏ కండిషన్‌ పెట్టింది. బీసీసీఐ ప్రస్తుత పాలసీ ప్రకారం ఆటగాళ్ల వెంట భార్యలు, వ్యక్తిగత సిబ్బందిని కేవలం రెండు వారాలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ పాలసీని మార్చి, వారిని టూర్ మొత్తానికీ అనుమతించాలని ఈ మధ్యే కెప్టెన్ కోహ్లి బీసీసీఐని కోరాడు.

ఈ క్రమంలో దీనిపై చర్చించడానికి గతవారం సీఓఏ హైదరాబాద్‌ వచ్చి.. కోహ్లితోపాటు కోచ్‌ రవిశాస్త్రి, రోహిత్‌శర్మలతో  చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భార్యలు, గర్ల్‌ ఫ్రెండ్స్‌ వెంట రావడం వల్ల క్రికెటర్ల ఏకాగ్రత దెబ్బ తిని టీమ్ ప్రదర్శనపై ప్రభావం చూపుతుందని గతంలో ఆస్ట్రేలియా క్రికెట్ చీఫ్ జేమ్స్ సదర్లాండ్ కూడా అభిప్రాయపడ్డారు. అయితే కోహ్లి మాత్రం అందుకు భిన్నమైన వాదన వినిపించాడు. భార్యలు వెంట ఉంటేనే విదేశీ టూర్లలో ప్రదర్శన మరింత మెరుగవుతుందన్నది కోహ్లి వాదన.

మరిన్ని వార్తలు