‘క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం’

17 May, 2018 15:26 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఏషియన్‌ గేమ్స్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించిన జ్యోతి సురేఖ, ఆమె తండ్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ఆర్చరీ కోచ్‌ చెరుకూరి సత్యనారాయణ గురువారం ర్యాలీ నిర్వహించారు. స్ధానిక మొగల్‌రాజ్‌ పురం సిద్ధార్థ కాలేజీ నుంచి శాప్‌​ కార్యాలయం వరకు తలపెట్టిన ర్యాలీలో 13 జిల్లాలకు చెందిన ఆర్చరీ అసోసియేషన్‌ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ.. జ్యోతి సురేఖ, అమె తండ్రితో పది రోజుల్లో క్షమాపణ చెప్పిస్తామని శాప్‌ చైర్మన్‌ హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు క్షమాపణ చెప్పలేదన్నారు.

వారిద్దరూ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం చేస్తానని ఆయన తెలిపారు. తనను, తన కుటుంబాన్ని జ్యోతి సురేఖ అవమానించారని మండిపడ్డారు. గురుశిష్య సంబంధాలను సురేఖ గౌరవించాలని సూచించారు. జోత్యి సురేఖ ఏపీ తరపున ఆడడం లేదన్నారు. మరోవైపు ఆర్చరీ క్రీడాకారులకు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న నగదు, ఇళ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.
 

మరిన్ని వార్తలు