క్వార్టర్స్‌లో కొలంబియా

9 Jun, 2016 00:25 IST|Sakshi
క్వార్టర్స్‌లో కొలంబియా

పరాగ్వేపై 2-1తో గెలుపు
కోస్టారికాపై అమెరికా గెలుపు
కోపా అమెరికా కప్

 
పసడెనా (అమెరికా): ప్రత్యర్థులు ఎన్ని దాడులు చేసినా.. అద్భుతమైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్న కొలంబియా జట్టు.. కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో 2-1తో పరాగ్వేపై విజ యం సాధించింది. కొలంబియా తరఫున కార్లోస్ బాకా (12వ ని.), జేమ్స్ రోడ్రిగ్వేజ్ (30వ ని.) గోల్స్ చేయగా... విక్టర్ అయేలా (71వ ని.) పరాగ్వేకు ఏకైక గోల్ అందించాడు. ఆరంభంలో డిఫెన్స్‌లో కాస్త ఇబ్బందులుపడ్డ ప్రపంచ మూడో ర్యాంకర్ కొలంబియా... ఆ తర్వాత అంచనాలకు అనుగుణంగా రాణిం చింది. ముఖ్యంగా రోడ్రిగ్వేజ్ మ్యాచ్ ఆసాంతం చెలరేగిపోయాడు. సహచరులతో చిన్న చిన్న సెటప్‌లు చేస్తూ బంతిని ఎక్కువశాతం ఆధీనంలో ఉంచుకున్నాడు.

12వ నిమిషంలో రోడ్రిగ్వేజ్ కార్నర్ నుంచి ఇచ్చిన బంతిని బాకా హెడర్‌తో గోల్‌గా మలిచాడు. మరో 18 నిమిషాల తర్వాత బాక్స్ నుంచి రోడ్రిగ్వేజ్ కొట్టిన సూపర్ షాట్ నేరుగా లక్ష్యాన్ని చేరడంతో తొలి అర్ధభాగంలోనే కొలంబియా 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో అర్ధభాగంలో పరాగ్వే ఫార్వర్డ్స్ దూకుడుగా ఆడారు. పదేపదే దాడులు చేశారు. కానీ కొలంబియా గోల్ కీపర్ డేవిడ్ ఊస్పినా అడ్డుగోడగా నిలవడంతో వాళ్ల ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి.

అయితే  71వ నిమిషంలో కొలంబియా డిఫెన్స్‌ను తప్పిస్తూ విక్టర్ గోల్ చేయడంతో ఆధిక్యం 2-1కి తగ్గింది. 81వ నిమిషంలో ఆస్కార్ రొమారియో రెండోసారి ఎల్లో కార్డ్‌కు గురికావడంతో పరాగ్వే అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఆరు పాయింట్లతో ఉన్న కొలంబియా.. శనివారం కోస్టారికాతో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా గ్రూప్‌లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంటుంది.


అమెరికా గెలుపు
మరో మ్యాచ్‌లో అమెరికా 4-0తో కోస్టారికాపై నెగ్గింది. స్టార్ స్ట్రయికర్ క్లింట్ డెంప్సే (9వ ని.), జెర్మీని జోన్స్ (37వ ని.), బాబీ వుడ్ (42వ ని.), గ్రాహం జూసీ (87వ ని.)లు అమెరికాకు గోల్స్ అందించారు. గత మ్యాచ్‌లో కొలంబియా చేతిలో ఓడిన అమెరికా ఈ మ్యాచ్‌లో పక్కా ప్రణాళికలతో ఆడింది. డెంప్సే పెనాల్నీ స్పాట్‌తో ఖాతా తెరిచిన యూఎస్ తొలి అర్ధభాగానికే 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. డెంప్సేకు అంతర్జాతీయ కెరీర్‌లో ఇది 50వ గోల్. మ్యాచ్ చివరి నిమిషాల్లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన జూసీ నాలుగో గోల్ నమోదు చేయడంతో అమెరికా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.

మరిన్ని వార్తలు