ఇంగ్లాండ్‌ అలా గెలిచిందట.!

15 Jul, 2019 08:18 IST|Sakshi

లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య, ఊహించని ట్విస్టులతో ఉత్కంఠభరితంగా సాగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ను ఉర్రూత లూగించింది. న్యూజిలాండ్‌కు గెలుపు ఖాయమనుకుంటున్న దశలో 49వ ఓవర్‌ మొత్తం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ముఖ్యంగా ఓవర్‌ త్రో  ఇంగ్లాండ్‌ జట్టుకు  అనూహ్యంగా పరుగులు తోడవడం కీలక పరిణామం.   చివరికి  టై అవ్వడం, సూపర్‌ ఓవర్‌, రెండోసారి కూడా  టై అయినా కూడా ఇంగ్లాండ్ విజేతగా నిలవడం  తెలిసిన సంగతే.

ప్రపంచ కప్ వీక్షిస్తున్న కోట్లాది ప్రేక్షకులు ఇంకా అమోమయం తేరుకోకముందే ఐసీసీ అందరికీ షాక్ ఇచ్చింది.  ఏం జరుగుతోందో అర్ధమయ్యలోపే ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించింది. క్రికెట్‌ చరిత్రలో ఇదో కొత్త చరిత్రగా విశ్లేషకులు భావిస్తుండగా, సోషల్‌ మీడియాలో పలు సందేహాలు,  న్యూజిలాండ్‌పై తీవ్ర సానుభూతి వ్యక‍్తమైంది. నైతికంగా న్యూజిలాండ్‌దే గెలుపు అని కొందరు వ్యాఖ్యానిస్తే.. ఏ రన్‌ అవుట్‌తో అయితే ధోనిని పెవిలియన్‌కు పంపారో.. న్యూజిలాండ్‌ కూడా అదే రనౌట్‌తో రన్నరప్‌గా నిలిచిందని మరికొందరు కమెంట్‌ చేశారు.

ముఖ్యంగా టాలీవుడ్‌  నటుడు వెన్నెల కిషోర్‌  షేర్‌  చేసిన వీడియో వైరలవుతోంది.  రెండుసార్లు టై అయిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ విజేత ఎలా అయిందో తెలుపుతూ వెన్నెల కిశోర్‌, బాలాజీ కలిపి ఒక వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. నితిన్ హీరోగా 'ఛ‌లో' ఫేమ్ వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో 'భీష్మ' తెర‌కెక్క‌ుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో   పరిమళగా నటిస్తున్న వెన్నెల కిషోర్  షూటింగ్‌ బ్రేక్‌లో ఈ వీడియోను తీసినట్టు ట్వీట్‌ చేశారు.

కాగా  ఆదివారం జరిగిన ఐసీసీ వరల్డ్‌ కప్‌  ఫైనల్‌  మ్యాచ్‌లో  తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 241 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ కూడా 50 ఓవర్లలో 241 రన్స్ చేసి  అల్‌ ఔట్‌ అయింది.  అయినా కూడా    ఆఖరి బంతికి ఒక పరుగు రావడంతో  మ్యాచ్ టై అయింది. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ నిర్ణయం తీసుకోగా ఈ సూపర్ ఓవర్లో ఫస్ట్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసింది. ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది.  దీనికి ప్రతిగా న్యూజిలాండ్.. కూడా ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అయితే, ఇంగ్లాండ్ ప్రపంచకప్ విజేత అంటూ ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్లో అత్యధిక బౌండరీలు కొట్టిన జట్టుని విజేతగా ప్రకటిస్తారు. అయితే సూపర్ ఓవర్లో ఇంగ్లండ్ జట్టు రెండు బౌండరీలు కొట్టింది. కానీ, న్యూజిలాండ్ కేవలం ఒక సిక్స్ (సూపర్‌ ఓవర్‌)మాత్రమే కొట్టింది. దీంతో బౌండరీల లెక్కన ఇంగ్లండ్ గెలిచినట్టు ప్రకటించారు.

 చదవండి  :ప్రపంచ కల నెరవేరింది

మరిన్ని వార్తలు