అలా చేయడంకంటే ఇంటికి వెళ్లడమే బెటర్‌..!

12 Jun, 2019 20:02 IST|Sakshi

ఐసీసీపై కామెంటేటర్‌ మైఖేల్‌ హోల్డింగ్స్‌ ఫైర్‌

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌పై కామెంటేటర్‌, విండీస్‌ మాజీ ఫాస్ట్‌బౌలర్‌ మైఖేల్‌ హోల్డింగ్స్‌ ఫైర్‌ అయ్యాడు. కొన్నిసార్లు అంపైర్లు చేసే పొరపాట్లను చూసీచూడనట్లు వదిలేయాలని, వాటిని ఫోకస్‌ చేస్తూ కామెంటరీ చేయొద్దని ఐసీసీ సూచించడాన్ని తప్పుబట్టాడు. విషయమేంటంటే.. ప్రపంచకప్‌లో భాగంగా గత గురువారం వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ జరిగింది. దానికి హోల్డింగ్స్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో క్రిస్‌ గేల్‌ అంపైర్‌ క్రిస్‌ గఫానీ (న్యూజిలాండ్‌) తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. స్టార్క్‌ వేసిన మూడో ఓవర్లో అంపైర్‌ నోబాల్‌ గుర్తించపోవడంతో అతను ఔట్‌ కావాల్సి వచ్చింది. దీంతో కామెంటరీ బాక్స్‌లో ఉన్న హోల్డర్స్‌ విమర్శలు గుప్పించాడు. అంపైర్‌ తప్పిదాన్ని వేలెత్తి చూపాడు.
(ఇదేం అంపైరింగ్‌ గురూ?)

అయితే, అంపైర్ల తప్పిదాలపై ఐసీసీ చర్యలు తీసుకోకపోగా.. వాటిని పెద్దది చేసి మాట్లాడొద్దని హోల్డర్స్‌కు ఓ సూచన చేసింది. ‘అసలు ఐసీసీలో నియమాలు, నిబంధనలు ఉన్నాయా. డ్యూటీ సరిగా నిర్వర్తించని వారిని వెనక్కేసుకొస్తారా. ఇదే ఫిఫా వరల్డ్‌కప్‌ అయ్యుంటే.. తప్పుడు అంపైరింగ్‌ చేసినవారు ఈపాటికి ఇంటికి వెళ్లి ఉండేవారు. ఇంకెప్పుడు ప్రపంకప్‌ టోర్నీల్లో వారికి అవకాశం ఇచ్చేవారు కాదు. క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాల్సిందిపోయి.. ఇలా చేస్తారా. మీరిచ్చే సూచనలు పాటించాల్సి వస్తే.. కామెంటరీ మానేసి ఇంటికి వెళ్లడమే మేలు అనుకుంటాను’అని ఐసీసీకి హోల్డింగ్స్‌ ఘాటైన రిప్లై ఇచ్చాడు. ఇక ఈ వివాదం సద్దుమణిగిందని అటు హోల్డింగ్స్‌‌, ఇటు ఐసీసీ చెప్పడం గమనార్హం.

మరిన్ని వార్తలు