అంతా హిందీ నేర్చుకోవాలి.. అవసరం లేదు!

14 Feb, 2020 11:09 IST|Sakshi

బెంగళూరు:  భారత్‌లో నివసించే ప్రతీ ఒక్కరూ హిందీ నేర్చుకోవాలంటూ బీసీసీఐ కామెంటేటర్‌ సుశీల్‌ దోషి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మన మాతృభాష హిందీ అని, దానిని ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలన్నాడు. కర్ణాటక-బరోడా జట్ల  రంజీ మ్యాచ్‌లో జోషీ ఈ కామెంట్‌ చేశాడు. ‘సునీల్‌ గావాస్కర్‌ హిందీ కామెంట్రీ అద్భుతంగా ఉండడంతో పాటు చాలా మంచి విషయాలు చెబుతుంటాడు. డాట్‌ బాల్‌ను తను బిందీ బాల్‌గా పిలవడం బావుంటుంది’ అని ఇద్దరు కామెంటేటర్‌లో ఒకరు తెలపగా.. దీనికి ప్రతిగా దోషి మాట్లాడుతూ  ‘అసలు భారత్‌లో నివసించే ప్రతీ ఒక్కరు హిందీ నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇది మన మాతృభాష. ఇంతకంటే పెద్ద భాష మరోటి లేదు’ అని సమర్థించాడు. (ఇక్కడ చదవండి: భారత్‌ క్రికెట్‌ చరిత్రలో ‘రికార్డు’ స్కోరు)

అయితే దోషి వ్యాఖ్యల వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అయ్యాయి. కొందరు మద్దతు తెలపగా మరికొంత మంది తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతీ రాష్ట్రానికి సొంత భాష ఉన్నప్పుడు అందరి మీదా హిందీని ఎందుకు రుద్దుతారని ప్రశ్నించారు. అసలు బీసీసీఐ ఏమి చెప్పదలుచుకుందంటూ విమర్శలకు దిగారు. ఇటువంటి తప్పుడు మెసేజ్‌లు ఇవ్వొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఒక‍్కరూ హిందీ నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ మండిపడుతున్నారు. క్రికెట్‌ ఆటకు హిందీ లాంగ్వేజ్‌కు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాత ఇద్దరిలో ఓ వ్యాఖ్యాత తన కామెంట్స్‌పై క్షమాపణ తెలిపాడు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర భాషలపై తనకు గౌరవం ఉందంటూ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాడు. 

>
మరిన్ని వార్తలు