క్రీడా గ్రామంలో అథ్లెట్‌పై దాడి

4 Apr, 2018 13:36 IST|Sakshi

గోల్డ్‌కోస్ట్‌ : కామన్‌వెల్త్‌ క్రీడా గ్రామంలో తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి దాడి చేశారని మారిషస్‌ అథ్లెట్‌ ఒకరు ఆరోపించారు. మారిషస్‌ చెఫ్‌ డి మిషన్‌ కయాసీ టీరోవెంగడమ్‌ తనను అసభ్యకర రీతిలో తాకుతూ దాడి చేశారని అథ్లెట్‌ ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. కామన్‌వెల్త్‌ క్రీడల ప్రారంభ కార్యక్రమానికి ముందే ఘటన జరిగినట్లు అథ్లెట్‌ ఫిర్యాదులో పేర్కొన్నారని, ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని క్వీన్స్‌లాండ్‌ డీసీపీ స్టీవ్‌ గోలెచ్‌స్కీ పేర్కొన్నారు.

ఈ ఘటనపై స్పందించిన గేమ్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ గ్రీమ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘కామన్‌వెల్త్‌ క్రీడల్లో పాల్గొనేందుకు సుమారు 6600 మంది క్రీడాకారులు గోల్డ్‌కోస్ట్‌కు చేరుకున్నారు. వీరంతా  క్రీడాగ్రామంలో బస చేస్తున్నారు. వారి రక్షణ పట్ల బాధ్యతగా ఉంటామని, ఇలాంటి దాడులను తాము సహించబోమని’ స్పష్టం చేశారు. అయితే ఈ ఘటనపై మారిషస్‌ టీమ్‌ స్పందించలేదు. కాగా దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చెఫ్‌ని బాధ్యతల నుంచి తప్పించినట్లు మారిషస్‌ మీడియా పేర్కొంది.

మరిన్ని వార్తలు