స్ఫూర్తి...కీర్తీ!

4 Apr, 2018 01:29 IST|Sakshi
క్రీడా గ్రామంలో ‘మస్కట్‌’ బోరోబీతో భారత స్టార్‌ షూటర్‌ గగన్‌ నారంగ్‌. వరుసగా నాలుగోసారి ఈ క్రీడల్లో పాల్గొంటున్న ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్‌ తరఫున 10 పతకాలు సాధించాడు 

నేటి నుంచి కామన్వెల్త్‌ గేమ్స్‌

తొలి రోజు ప్రారంభ వేడుకలు

రేపటి నుంచి పోటీలు

భారత బృందానికి  పతాకధారిగా పీవీ సింధు

ఒక పోటీలో ఒకే స్వర్ణం ఉంటుంది. అది విజేత గెలుచుకుంటాడు. అదే పోటీలో రజతం ఉంటుంది. అది కూడా ఒకటే.దాన్ని విజేతనే అనుసరించేవారికి ఇస్తారు. ఇక ఆ పోటీలో మిగిలిందొక్కటే... కాంస్యం విజేత, రన్నరప్‌ మిస్సయిన మూడో వ్యక్తి అది అందుకుంటాడు. పోటీలంటే అంతేనా... విజేతలంటే వీరేనా... కాదు... కచ్చితంగా కాదు! తుది పోటీకి కొందరే అర్హత సాధించొచ్చు. ముగ్గురే గెలవొచ్చు. కానీ... అందరువిజేతలవ్వొచ్చు... స్ఫూర్తితో! వేనోళ్ల స్తుతించవచ్చు. కీర్తితో! గెలిచేందుకు అడ్డదారులు (డ్రగ్స్‌) తొక్కిన వారికంటే ఓడినవాళ్లే గ్రేట్‌...గెలిచిన వారిని మనస్ఫూర్తిగా అభినందించినవారంతా గ్రేటెస్ట్‌...పోరాడిఓడిన ప్రతిఒక్కరు ఎవరెస్ట్‌ అంతటోళ్లు.  వీళ్లందరికీ స్ఫూర్తి ఉంది. వెలకట్టలేని కీర్తి దక్కుతుంది. కాబట్టి ప్రియమైన క్రీడాకారులందరూ గుర్తుంచుకోండి... పతకం కోసమే పందేలున్నా... ప్రతిష్ట కోసం పోటీపడుతున్నా... కడదాకా స్ఫూర్తితో సాగాలి...  కీర్తి గడించాలి. ఆల్‌ ద బెస్ట్‌!

గోల్డ్‌కోస్ట్‌: నిరీక్షణ ముగిసింది. మరికొన్ని గంటల్లో కామన్వెల్త్‌ దేశాల మధ్య క్రీడల పండగకు తెర లేవనుంది. 12 రోజుల ఈ మెగా ఈవెంట్‌కు ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. 71 దేశాల నుంచి 6,600 మంది క్రీడాకారులు 23 క్రీడాంశాల్లో 275 స్వర్ణ పతకాల కోసం పోటీపడతారు. తొలి రోజు కేవలం ప్రారంభ వేడుకలు జరుగుతాయి. గురువారం నుంచి పోటీలు మొదలవుతాయి. భారత్‌ తరఫున మొత్తం 218 మంది క్రీడాకారులు 17 క్రీడాంశాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బుధవారం జరిగే ప్రారంభోత్సవంలో బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు నేతృత్వంలో భారత బృందం మార్చ్‌పాస్ట్‌ చేయనుంది. 

ఆస్ట్రేలియాదే హవా... 
దాదాపు తొమ్మిది దశాబ్దాల చరిత్ర కలిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఆస్ట్రేలియాదే ఆధిపత్యం కనిపిస్తోంది. ఇప్పటివరకు 20 సార్లు కామన్వెల్త్‌ గేమ్స్‌ జరగ్గా... 12 సార్లు ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలవడం విశేషం. 2014 గ్లాస్గో గేమ్స్‌లో మాత్రం ఇంగ్లండ్‌ టాప్‌ ర్యాంక్‌ను సంపాదించింది. ఆతిథ్య దేశం హోదాలో ఈసారి ఆస్ట్రేలియా మళ్లీ పతకాల పంట పండించే అవకాశముంది. ఆస్ట్రేలియాకు ఇంగ్లండ్, కెనడా, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఏమేరకు పోటీనిస్తాయో వేచి చూడాలి. 

దక్షిణాఫ్రికా స్విమ్మర్‌ లె క్లోస్‌పై దృష్టి... 
ఐదోసారి కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వహిస్తున్న ఆస్ట్రేలియాలో ఈసారి అందరి దృష్టి దక్షిణాఫ్రికా స్విమ్మర్‌ చాద్‌ లె క్లోస్‌పై ఉంది. వరుసగా మూడోసారి ఈ గేమ్స్‌లో పాల్గొంటున్న అతను ఇప్పటికే 12 పతకాలు గెలిచాడు. మరో ఏడు పతకాలు సాధిస్తే కామన్వెల్త్‌ క్రీడల చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన క్రీడాకారుడిగా కొత్త చరిత్ర సృష్టిస్తాడు. అత్యధిక పతకాలు నెగ్గిన రికార్డు షూటర్లు మిక్‌ గాల్ట్‌ (ఇంగ్లండ్‌), ఫిలిప్‌ ఆడమ్స్‌ (ఆస్ట్రేలియా) పేరిట ఉంది. ఈ ఇద్దరూ 18 పతకాలు చొప్పున గెలిచారు. 

వేల్స్‌ చిన్నారి రికార్డు! 
టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) ఈవెంట్‌లో 11 ఏళ్ల వేల్స్‌ చిన్నారి అనా హర్సె కొత్త చరిత్ర లిఖించనుంది. ఈ క్రీడల చరిత్రలో పాల్గొననున్న పిన్న వయస్కురాలిగా ఆమె గుర్తింపు పొందనుంది. ‘పతకం సాధించడమే లక్ష్యంగా పోరాడతాను. కేవలం వినోదం కోసం ఈ క్రీడల్లో పాల్గొంటున్నాననే వారికి సమాధానం ఇస్తాను’ అని అనా హర్సె తెలిపింది. మరోవైపు బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌కు చెందిన నెవెల్లె సొరెన్‌టినో 55 ఏళ్ల వయసులో కామన్వెల్త్‌ గేమ్స్‌లో అరంగేట్రం చేయనున్నాడు. ఏడుగురు పిల్లల తండ్రి అయిన సొరెన్‌టినో పురుషుల స్క్వాష్‌ ఈవెంట్‌లో బరిలోకి దిగనున్నాడు.  

మరిన్ని వార్తలు