క్రీడాగ్రామంలో మన జెండా ఎగిరె...

3 Apr, 2018 00:55 IST|Sakshi

గోల్డ్‌కోస్ట్‌ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన భారత అథ్లెట్లు సోమవారం క్రీడాగ్రామంలో జెండా వందనం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అథ్లెట్లందరూ త్రివర్ణ పతకానికి గౌరవ వందనం చేశారు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన భారత స్టార్‌ మహిళా బాక్సర్‌ మేరీకోమ్, జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా సహా అందరూ ఆహ్లాదంగా గడిపారు. జాతి గర్వించే నినాదాలు చేశారు. క్రీడా గ్రామంలో భారత బృందం బస చేసిన భవనం సమీపంలో సిరంజీలు బయట పడిన ఘటనపై స్పందించేందుకు భారత చెఫ్‌ డి మిషన్‌ విక్రమ్‌ సిసోడియా నిరాకరించారు.    

భారత బాక్సర్లపైనే డేగ కన్ను! 
ప్రతిష్టాత్మక గేమ్స్‌కు ముందు కలకలం రేపిన సిరంజీల ఘటనతో నిర్వాహకులు, దర్యాప్తు కమిటీ భారత బాక్సర్లపై కన్నేసినట్లుంది. అయితే ఉప్పందించిన పాపానికి తమపై అనుమానం వ్యక్తం చేయడం పట్ల భారత వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ‘సీజీఎఫ్‌ నియమించిన మెడికల్‌ కమిషన్‌ ముందు హాజరు కావాలని కామన్వెల్త్‌ గేమ్స్‌ అసోసియేషన్‌ భారత బాక్సర్లకు సమన్లు జారీ చేసింది’ అని సీజీఎఫ్‌ సీఈఓ గ్రీవెన్‌బర్గ్‌ తెలిపారు. అయితే ఈ సిరంజీలను మరీ అంత తీవ్రంగా పరిగణించాల్సిన పని లేదని... మల్టీ విటమిన్స్‌ ఇంజెక్షన్‌లకు కూడా వినియోగించవచ్చని భారత వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి భారత బాక్సర్లకు డోప్‌ పరీక్షలు నిర్వహించారు. 

2 లక్షల 25 వేల కండోమ్స్‌ 
అథ్లెట్లు... ఆడండి, గెలవండి. చల్లని ఐస్‌క్రీమ్‌లు తినండి... వెచ్చని కోర్కెలు తీర్చుకోండనే విధంగా కామన్వెల్త్‌ గేమ్స్‌ సమాఖ్య ఏర్పాట్లు చేసింది. నిష్ణాతులైన 300 మంది చెఫ్‌ల ఆధ్వర్యంలోని పాకశాస్త్ర బృందం 24 గంటలపాటు తినుబండారాలను ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేయిస్తోంది.  క్రీడాగ్రామంలో బస చేసిన 6,600 మంది అథ్లెట్ల కోసం రుచికరమైన ఫ్లేవర్లలో ఐస్‌ క్రీమ్‌లు చేయిస్తున్న నిర్వాహకులు 2 లక్షల 25 వేల కండోమ్‌లనూ అందుబాటులో ఉంచారు. సురక్షిత శృంగారం కోసం సగటు లెక్కలేసుకొని మరీ వీటిని ఉంచడం గమనార్హం. ఆరువేల పైచిలుకున్న అథ్లెట్లకు 11 రోజుల పాటు 34 కండోమ్‌ల చొప్పున... 2.25 లక్షల కండోమ్‌లను సిద్ధంగా ఉంచింది. ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన వింటర్‌ ఒలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో 1.10 లక్షల కండోమ్స్‌ను ఉచితంగా పంచారు. అదే రియో ఒలింపిక్స్‌ సమయంలో ‘జికా’ వైరస్‌ కలకలం రేగడంతో ఏకంగా 4.50 లక్షల కండోమ్స్‌ను ఉచితంగా ఇచ్చారు.  

మరిన్ని వార్తలు