‘కోహ్లితో కంటే వారితో పోలికనే ఆస్వాదిస్తా’

3 Jul, 2020 10:23 IST|Sakshi

మాంచెస్టర్‌: ఇటీవల కాలంలో పాకిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ బాబర్‌ అజామ్‌ను టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో తరచు పోల్చుతున్న సంగతి తెలిసిందే. అయితే తాను కోహ్లితో పోల్చడాన్ని పెద్దగా ఆస్వాదించనని అజామ్‌ తాజాగా తెలిపాడు. పాకిస్తాన్‌ వన్డే, టీ20 జట్టు కెప్టెన్‌ అయిన అజామ్‌.. విలేకరులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. దీనిలో భాగంగా తనను కోహ్లితో పోల్చడాన్ని ఎప్పుడూ గొప్పగా ఫీల్‌ కాలేదన్నాడు. కాగా, పాకిస్తాన్‌ దిగ్గజ క్రికెటర్లైన జావెద్‌ మియాందాద్‌, యూనిస్‌ ఖాన్‌, ఇంజమాముల్‌ హక్‌లతో పోలికనే ఎక్కువగా ఆస్వాదిస్తానన్నాడు. వారితో పోల్చితే తప్పకుండా చాలా గొప్పగా అనుకుంటానని అజామ్‌ అన్నాడు. ‘ నన్ను ఎవరితోనైనా పోల్చినప్పుడు అది పాకిస్తాన్‌ ప్లేయర్స్‌ అయితేనే దాన్ని ఆస్వాదిస్తా. (యూనిస్‌ నా పీకపై కత్తి పెట్టాడు: ఫ్లవర్‌)

కోహ్లితో పోలిక కంటే పాక్‌ దిగ్గజాలతో పోల్చినప్పుడు గౌరవంగా భావిస్తా. మాకు మియాందాద్‌, యూనిస్‌ ఖాన్‌, ఇంజమాముల్‌ వంటి దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. వారితో పోల్చండి.. అప్పుడు నాకు గొప్పగా అనిపిస్తుంది’ అని అజామ్‌ తెలిపాడు. టీ20ల్లో అజామ్‌ నంబర్‌ వన్‌ ర్యాంకులో ఉండగా, వన్డేల్లో విరాట్‌ కోహ్లి టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే అజామ్‌ను కోహ్లితో పోల్చడం ఎక్కువైంది. అయితే అది తనకు నచ్చదనే విషయాన్ని అజామ్‌ తన మాటల ద్వారా వెల్లడించాడు. కోహ్లి సాధించిన ఘనతలు పరంగా చూస్తే అజామ్‌ చాలా దూరంలోనే ఉన్నాడు., అయినప్పటికీ కోహ్లితో పోలిక వద్దని చెప్పడం, పాక్‌ దిగ్గజాలతో పోల్చాలని చెప్పడం గమనార్హం. 

కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇంకా భయాందోళనలు ఉన్నప్పటికీ పాకిస్తాన్‌ జట్టు ఆశావహ దృక్పథంతో ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లింది. 20 మంది ఆటగాళ్లతో పాటు 11 మంది సహాయక సిబ్బందితో కూడిన పాక్‌ బృందం మాంచెస్టర్‌లో అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఆగస్టులో  3 టెస్టులు, 3 టి20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. పాక్‌ టెస్టు కెప్టెన్‌గా అజహర్‌ అలీ వ్యవహరించనున్నాడు. ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన పాక్‌ జట్టులో ఆ దేశ మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌కు ఎట్టకేలకు అవకాశం దక్కింది. శ్రీలంకతో స్వదేశంలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌ తర్వాత సర్ఫరాజ్‌ జట్టులో చోటు కోల్పోగా, ఇప్పుడు అతనికి చోటు కల్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లండ్‌ పర్యటన సర్ఫరాజ్‌కు కీలకం కానుంది. 

మరిన్ని వార్తలు