రియో ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తా!

22 Sep, 2015 15:22 IST|Sakshi
రియో ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తా!

కోల్ కతా: ఇటీవల జరిగిన జాతీయ ఓపెన్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన వివాదాస్పద అథ్లెట్ ద్యుతీ చంద్ తాను తప్పకుండా రియో ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తానని అంటోంది. అయితే రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించాలంటే తనకు విదేశాల్లో శిక్షణ అవసరమని స్పష్టం చేసింది.  తనను ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని.. ఈ క్రమంలోనే విదేశాల్లో శిక్షణ అవసరమని పేర్కొంది.  అథ్లెటిక్స్ కు సంబంధించి ఇక్కడే శిక్షణ తీసుకుంటే కష్టమని తెలిపింది. సాంకేతిక పరిజ్ఞానం మన దేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ శిక్షణ తనకు అవసరమని పేర్కొంది.  తాను ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకూ సాధన చేస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.

గత శనివారం జాతీయ ఓపెన్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో భాగంగా రైల్వేస్ తరఫున 100మీ. బరిలోకి దిగిన ద్యుతీ 11.68 సెకన్ల టైమింగ్‌తో సత్తా చాటుకుంది. అనంతరం జరిగిన 200 మీ, 4/100 విభాగాల్లో కూడా ద్యుతీ స్వర్ణాలు గెలిచి ఉత్తమ స్ప్రింటర్ గా నిలిచింది. గతంలో పురుష హార్మోన్లు ఎక్కువగా ఉన్నాయనే కారణంగా ఈ ఒడిషా స్ప్రింటర్‌ కొంతకాలం నిషేధం ఎదుర్కొంది. అయితే గత జూలైలో ఆమెపై నిషేధాన్ని స్పోర్ట్స్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఎత్తేసింది.

మరిన్ని వార్తలు