థర్డ్‌ అంపైర్ నిర్ణయంపై విమర్శల వర్షం

9 Feb, 2019 11:34 IST|Sakshi

ఆక్లాండ్‌: తాజాగా అంపైర్‌ నిర్ణయ పునః సమీక్ష పద్ధతి(డీఆర్‌ఎస్‌) వివాదాస్పదమైంది. భారత్‌తో జరిగిన రెండో టీ20లో డార్లీ మిచెల్‌ ఎల్బీగా మైదానం వీడిన తీరు అనేక ప్రశ్నలకు తావిచ్చింది. కృనాల్ పాండ్య బౌలింగ్‌లో ఆరో ఓవర్‌లో మిచెల్ (1) ఎల్బీగా వెనుదిరిగాడు. మొదట అంపైర్ క్రిస్‌ బ్రౌన్‌..  మిచెల్ ఔట్ అని ప్రకటించాడు. ఆపై అవతలి ఎండ్‌లో ఉన్న కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సంప్రదించిన తర్వాత మిచెల్ డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు.

కానీ హాట్ స్పాట్‌లో మాత్రం బ్యాట్ తగిలిందని చూపించడంతో న్యూజిలాండ్‌ శిబిరంలో ఆనందం వ్యక్తమైంది. కానీ స్నికో మీటర్‌లో దీనికి విరుద్ధంగా కనిపించింది. బ్యాట్‌ను బంతి దాటే సమయంలో ఎటువంటి స్పైక్‌ కనిపించలేదు. దాంతో బాల్‌ ట్రాకింగ్‌ ఆధారంగా థర్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించాడు. దీంతో విమర్శల వర్షం కురుస్తోంది. ‘ఇది హాస్యాస్పదం’ అని న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్ సైమన్‌ డౌల్ అసహనం వ్యక్తం చేయగా,  బంతి క్లియర్‌గా ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ అయినట్లు హాట్‌స‍్పాట్‌లో కనిపిస్తున్నా, స్నికో ఆధారంగా నిర్ణయాన్ని ప్రకటించడాన్ని పాకిస్తాన్‌కు చెందిన ఫరాజ్‌ హైదర్‌ ప్రశ్నించాడు. అసలు స్నికో గురించి కాస్త వివరణ ఇవ్వాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

ఇక ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. స్నికోను వదిలేసి హాట్‌స్పాట్‌ ఆధారంగా నిర్ణయాన్ని ప‍్రకటించడంతో మిచెల్‌ భారంగా పెవిలియన్‌ను వీడాల్సి వచ్చిందన్నాడు. ఒకసారి డీఆర్‌ఎస్‌లో బ్యాట్స్‌మన్‌కు వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిందంటే ఇక్కడ వేరే మార్గమే లేదన్నాడు. గతంలో ఈ తరహా ఒక బ్యాట్స్‌మన్‌ ఔట్‌ కావడాన్ని వినలేదంటూ సెటైర్‌ వేశాడు. ఇదొక చెత్త నిర్ణయంగా భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయం వల్ల న్యూజిలాండ్‌ వికెట్‌ను నష్టపోవడమే కాదు.. రివ్యూను కూడా కోల్పోయిందని విమర్శించాడు.

ఇక్కడ చదవండి: రోహిత్‌ వెనక్కి  పిలిచి ఉంటే...

మరిన్ని వార్తలు