శ్రీలంకపై బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలు!

17 Jun, 2018 09:35 IST|Sakshi
శ్రీలంక ఆటగాళ్లు

సెయింట్‌ లూసియా: ఆస్ట్రేలియా ఆటగాళ్ల బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం యావత్‌ క్రికెట్‌ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా వెస్టిండీస్‌-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో బాల్‌ ట్యాంపరింగ్‌ మరోసారి చర్చనీయాంశమైంది. శ్రీలంక జట్టుపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు రావడంతో ఆ జట్టు ఆగ్రహంతో మూడో రోజు మైదానంలోకి వచ్చేందుకు నిరాకరించింది. ఇలా లంక ఆటగాళ్లు నిరసన వ్యక్తం చేయడంతో ఆట రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది.  తమ ఆటగాళ్లు ఎలాంటి తప్పు చేయలేదని టీమ్ మేనేజ్‌మెంట్ తమకు వివరించిందని శ్రీలంక బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. వీడియో ఫుటేజిని పరిశీలించిన తరువాత ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన జరిగిందా లేదా అనేది తేల్చాల్సి ఉంది. 

అసలేం జరిగిందంటే.. రెండో రోజు ఆట ముగిసే దశలో బంతి ఆకారం మారిందని సందేహించిన ఫీల్డు అంపైర్లు అలీమ్‌ దార్, ఇయాన్‌ గౌల్డ్‌ మూడో రోజు బంతిని మార్చేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆటకు ముందే లంక కెప్టెన్‌ చండిమాల్‌కు చెప్పారు. దీంతో లంక జట్టు మైదానంలోకి దిగేందుకు ససేమిరా అనడంతో వివాదమైంది. ఈ దశలో మ్యాచ్‌ రిఫరీ జవగళ్‌ శ్రీనాథ్‌... లంక కోచ్‌ హతురుసింఘా, మేనేజర్‌ గురుసిన్హాలతో పలుమార్లు సంప్రదింపులు జరిపాక ఎట్టకేలకు లంకేయులు ఆడేందుకు సిద్ధమయ్యారు. లంక బౌలింగ్ సందర్భంగా బంతి ఆకారం దెబ్బతిన్నందుకు అంపైర్లు విండీస్‌కు ఐదు పెనాల్టీ పరుగులిచ్చారు. దీంతో లంకేయులు మరోసారి మ్యాచ్ ఆడేందుకు నిరాకరించారు. మళ్లీ శ్రీనాథ్ జోక్యం చేసుకొని మ్యాచ్ జరిగేలా చూశారు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 253 పరుగులు చేయగా.. వెస్టిండీస్ 300 పరుగులు సాధించింది. మూడో రోజు ఆట ముగిసేసమయానికి రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 34/1తో ఉంది.

మరిన్ని వార్తలు