సంచలనాల మోత

2 Jul, 2019 04:56 IST|Sakshi
కోరి గాఫ్‌

15 ఏళ్ల కోరి గాఫ్‌ చేతిలో ఐదుసార్లు చాంపియన్‌ వీనస్‌ ఓటమి

తొలి రౌండ్‌లోనే ఓడిన ఒసాకా, జ్వెరెవ్, సిట్సిపాస్‌

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ

లండన్‌: టెన్నిస్‌ సీజన్‌ మూడో గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ వింబుల్డన్‌లో తొలి రోజే సంచలనాల మోత మోగింది. మహిళల సింగిల్స్‌ విభాగంలో రెండో సీడ్‌ నయోమి ఒసాకా (జపాన్‌), పదో సీడ్‌ సబలెంకా (బెలారస్‌), 16వ సీడ్‌ వొండ్రుసోవా (చెక్‌ రిపబ్లిక్‌), ఐదుసార్లు చాంపియన్, నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచిన అమెరికా దిగ్గజం వీనస్‌ విలియమ్స్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. వింబుల్డన్‌లో మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించిన పిన్న వయస్కు రాలిగా చరిత్ర సృష్టించిన అమెరికా టీనేజర్, 15 ఏళ్ల కోరి గాఫ్‌ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ కెరీర్‌ను చిరస్మరణీయ విజయంతో మొదలుపెట్టింది.

39 ఏళ్ల వీనస్‌ విలియమ్స్‌తో జరిగిన తొలి రౌండ్‌లో కోరి గాఫ్‌ 6–4, 6–4తో గెలుపొంది అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో 1991 తర్వాత వింబుల్డన్‌లో తొలి రౌండ్‌ మ్యాచ్‌ నెగ్గిన పిన్న వయస్కురాలిగా కోరి గాఫ్‌ గుర్తింపు పొందింది.  2004 మార్చి 13న కోరి గాఫ్‌ జన్మించే సమయానికి వీనస్‌ అప్పటికే రెండుసార్లు వింబుల్డన్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ను, రెండుసార్లు యూఎస్‌ ఓపెన్‌ టైటిల్స్‌ను సాధించడం విశేషం. ఇతర మ్యాచ్‌ల్లో ప్రపంచ 39వ ర్యాంకర్‌ యులియా పుతింత్‌సెవా (కజకిస్తాన్‌) 7–6 (7/4), 6–2తో ఒసాకాపై, రిబరికోవా (స్లొవేకియా) 6–2, 6–4తో సబలెంకాపై, బ్రింగిల్‌ (అమెరికా) 6–4, 6–4తో ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌ వొండ్రుసోవాపై సంచలన విజయాలు సాధించారు.   


జొకోవిచ్‌ శుభారంభం
పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఆరో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), ఏడో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. జ్వెరెవ్‌ 6–4, 3–6, 2–6, 5–7తో జిరీ వెసిలీ (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో... సిట్సిపాస్‌ 4–6, 6–3, 4–6, 7–6 (10/8), 3–6తో ఫాబియానో (ఇటలీ) చేతిలో ఓడిపోయారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 6–3, 7–5, 6–3తో కోల్‌ష్రైబర్‌ (జర్మనీ)పై నెగ్గాడు. భారత ప్లేయర్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ 6–7 (1/7), 4–6, 2–6తో 15వ సీడ్‌ మిలోస్‌ రావ్‌నిచ్‌ (కెనడా) చేతిలో ఓడిపోయాడు.   

మరిన్ని వార్తలు