చేతల్లో... తన చేతులతో...

15 Apr, 2020 09:26 IST|Sakshi

ఊరినే శానిటైజ్‌ చేస్తున్న రోయర్‌ దత్తు భోకనల్‌

ముంబై: కోవిడ్‌–19 భారత్‌లోనూ విజృంభిస్తోంది. దాతల దాతృత్వం కూడా పెరుగుతోంది. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో పంథా. కొందరు అథ్లెట్లు నగదు రూపంలో, మరికొందరు క్రీడాకారులు వస్తు రూపంలో, ఇంకొందరేమో సంరక్షణ కిట్ల రూపంలో తమ వంతు సాయం చేస్తూనే ఉన్నారు. అయితే ఆసియా క్రీడల రోయింగ్‌ చాంపియన్‌ దత్తు బబన్‌ భోకనల్‌ విభిన్న పంథాతో దూసుకెళ్తున్నాడు. మహమ్మారి బారిన తన ఊరు పడకుండా ఏకంగా తన గ్రామాన్నంతా శానిటైజ్‌ చేస్తున్నాడు. స్వయం గా తన చేతులతో... చేతల్లో గ్రామసేవకు పూనుకున్నాడు. 

ఏదో మీడియాలో కనపడేందుకు ఒక పూట చేసి చేతులు ముడుచుకు కూర్చోలేదు. వారానికి రెండుసార్లు తన గ్రామాన్ని శానిటైజ్‌ చేయడం అందరినీ ఆకర్షిస్తోంది. మహారాష్ట్రలోని నాసిక్‌ సమీపంలోని తాలెగాన్‌ రూహి అనే గ్రామంలో సుమారు 12 వేల మంది జనాభా ఉంటుంది. ఈ గ్రామానికి చెందిన  29 ఏళ్ల దత్తు, సోదరుడు, మామయ్య, స్నేహితుడు ఈ నలుగురు కలిసి ఫర్టిలైజర్‌ స్ప్రేయర్‌తో డిస్‌ఇన్ఫెక్షన్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు తరచూ వెళ్లే చోట అంటే ఆసుపత్రి, గ్రామపంచాయతీ కార్యాలయం, అంగన్‌వాడీ కేంద్రం, పశువుల ఆసుపత్రి పరిసరాల్లో, మూలమూలన రసాయనంతో పూర్తిగా శానిటైజ్‌ చేస్తున్నారు. 

దీనిపై మీడియా ఫోన్‌లో సంప్రదించగా...  తన ఊరుకోసం ఈ మాత్రం సేవ చేయడం ఆనందంగా ఉందని, శానిటైజ్‌ పనికి తన కుటుంబసభ్యులు, మిత్రుడు చేతులు కలిపారని చెప్పాడు. వారంలో రెండు రోజులు శానిటైజ్‌ చేస్తున్నట్లు తెలిపారు. మనదేశంలోనూ కోవిడ్‌–19 చాపకింద నీరులా అంతకంతకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో బాధితులు పెరిగిపోతున్నారు. భారత్‌లో పదివేల మార్కును దాటగా.... మహారాష్ట్రలో రెండువేలకు పైగానే కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం లాక్‌డౌన్‌ను వచ్చే నెల 3 వరకు పొడిగించింది.  

చదవండి:
నాడు రియల్.. నేడు వైరల్‌
సీఎంతో భేటీ అయిన ఎమ్మెల్యేకు క‌రోనా

మరిన్ని వార్తలు