ఒలింపిక్స్‌ వాయిదా అసాధారణం

26 Mar, 2020 15:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జపాన్‌ రాజధాని టోక్యోలో జరగాల్సిన ‘2020 అంతర్జాతీయ ఒలింపిక్‌ గేమ్స్‌’ను వాయిదా వేయాలని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌, జపాన్‌ ప్రధాన మంత్రి షింజో అబే మంగళవారం నిర్ణయం తీసుకోవడం అసాధారణం. 1896లో ఎథెన్స్‌లో ప్రారంభమైన మొదటి ఆధునిక ఒలింపిక్‌ గేమ్స్‌ నుంచి నేటి వరకు రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో మినహా మరెప్పుడు వాయిదా పడడం లేదా రద్దవడం జరగలేదు. కాకపోతే ఒలింపిక్‌ గేమ్స్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. వాకౌట్లు చోటు చేసుకున్నాయి. టెర్రరిస్టు దాడులు కూడా జరిగాయి. అయినా ఒలింపిక్‌ గేమ్స్‌ వాయిదా పడలేదు. 

ప్రపంచ దేశాలను కలవరపరుస్తోన్న కోవిడ్‌ కారణంగా ఈ సారి టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్‌ గేమ్స్‌ను వాయిదా వేశారు. వీటిని ఎప్పుడు, ఎక్కడ నిర్వహించినా ‘టోక్యో 2020’గా వ్యవహరించాలని నిర్ణయించారు. 1896 నుంచి ప్రతి నాలుగేళ్లకు ఓసారి జరుగుతున్న ఆధునిక అంతర్జాతీయ ఒలింపిక్‌ గేమ్స్‌ మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా 1916లో బెర్లిన్‌లో జరగాల్సిన ఒలింపిక్స్, రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా 1940 టోక్యోలో, 1944లో లండన్‌లో జరగాల్సిన ఒలింపిక్‌ గేమ్స్‌ రద్దయ్యాయి. 

ఆ తర్వాత 1976లో మాంట్రిల్‌ జరిగిన ఒలింపిక్‌ గేమ్స్, 1980లో మాస్కో, 1984లో ఏంజెలిస్‌ ఒలింపిక్‌ గేమ్స్‌ సందర్భంగా పలు బాయ్‌కాట్‌లో చోటు చేసుకున్నాయి. అయినా వాటిని రద్దు చేయడంగానీ, వాయిదావేయడంగానీ జరగలేదు. 2002–03 సార్స్‌ విజంభించినప్పుడు ఎథెన్స్‌ 2004 ఒలింపిక్‌ గేమ్స్, జికా వైరస్‌ భయాందోళనలకు గురిచేసినప్పుడు 2016 నాటి రియో ఒలింపిక్‌ గేమ్స్‌ రద్దు కాలేదు. 

చదవండి:
‘ఊపిరి తిత్తులు ఇలాగే ఉక్కిరిబిక్కిరి అవుతాయి’
ఒకే ఇంట్లో స్టార్‌ హీరో, మాజీ భార్య

మరిన్ని వార్తలు