కార్పొరేట్‌ స్పోర్ట్స్‌ మీట్‌ షురూ

21 Mar, 2019 10:13 IST|Sakshi

పోటీలను ప్రారంభించిన హెచ్‌వైఎస్‌ఈఏ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ రావు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంఘం (హెచ్‌వైఎస్‌ఈఏ) కార్పొరేట్‌ స్పోర్ట్స్‌ టోర్నమెంట్‌ బుధవారం ప్రారంభమైంది. బంజారాహిల్స్‌లోని హ్యాట్‌ ప్లేస్‌ వేదికగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న హెచ్‌వైఎస్‌ఈఏ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ రావు టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్‌ డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ సి. అనసూయ, హెచ్‌వైఎస్‌ఈఏ ఉపాధ్యక్షులు భరణి అరోల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ కార్పొరేట్‌ స్పోర్ట్స్‌ మీట్‌ను నిర్వహిస్తోన్న హెచ్‌వైఎస్‌ఈఏ యాజమాన్యాన్ని అభినందించారు.

తమ డిపార్ట్‌మెంట్‌కు చెందిన  ‘షీ టీమ్‌’ జట్లు కూడా ఇందులో పాల్గొని కార్పొరేట్‌కు దీటుగా రాణిస్తాయని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ ఉద్యోగుల పరంగా నిర్వహిస్తోన్న అన్ని టోర్నీలలో హెచ్‌వైఎస్‌ఈఏ ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ టోర్నీ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది. ఇందులో 14 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి.

ఫీల్డ్‌ క్రికెట్, బాక్స్‌ క్రికెట్, వాలీబాల్, టెన్నిస్, టేబుల్‌ టెన్నిస్, ఫుట్‌బాల్, పూల్, కబడ్డీ, క్యారమ్, బాస్కెట్‌బాల్‌ ఈవెంట్‌లలో పోటీలను నిర్వహిస్తారు. ఈసారి సైక్లింగ్‌ ఈవెంట్‌ను కూడా ఇందులో ప్రవేశపెట్టినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇందులో 160 జట్లు తలపడనున్నారు. పలు క్రీడాంశాల్లో నిర్వహిస్తోన్న ఈ టోర్నీలో పాల్గొనేందుకు హెచ్‌వైఎస్‌ఈఏ సభ్య కంపెనీలకు చెందిన ఔత్సాహిక క్రీడాకారులు సిద్ధమయ్యారని శ్రీనివాస్‌ రావు తెలిపారు.

మరిన్ని వార్తలు