గురి తప్పకుండా.. బ్యాట్స్‌మన్‌కు తగలకుండా

18 Jun, 2019 14:58 IST|Sakshi

టాంటాన్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షెల్డన్ కాట్రెల్ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్‌ అందుకొని ఔరా అనిపించిన సంగతి తెలిసిందే. స్టీవ్‌ స్మిత​ కొట్టిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కాట్రెల్‌ సిక్సర్ వెళ్లే బంతిని గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. అయితే బ్యాలెన్స్ కోల్పోయిన కాట్రెల్‌ బౌండరీ హద్దును తాకబోతున్నట్లు గమనించి బంతిని లోపలికి విసిరేశాడు. అనంతరం మళ్లీ లైన్ లోపలికి వచ్చి బంతిని అందుకొని ఆశ్చర్యపరిచాడు. ఈ వరల్డ్‌కప్‌లో కాట్రెల్‌ పట్టిన స్టన్నింగ్‌ క్యాచ్‌ ఇది.

కాగా, సోమవారం బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో ఒక అద్భుతమైన రనౌట్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌ లక్ష్య ఛేదనలో భాగంగా 18 ఓవర్‌ను కాట్రెల్‌ వేశాడు. ఆ ఓవర్‌ తొలి బంతికి తమీమ్‌ పరుగు తీయగా, రెండో బంతికి షకీబుల్‌ హసన్‌ పరుగు సాధించాడు. ఇక మూడో బంతిని తమీమ్‌ నేరుగా బౌలర్‌ ఎండ్‌వైపు ఆడాడు. అదే సమయంలో కాస్త ముందుకొచ్చి వెనక్కు వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే ఆ బంతిని అందుకున్న బౌలర్‌ కాట్రెల్‌..స్ట్రైకింగ్‌ ఎండ్‌లోకి వేగంగా విసిరాడు. ఎంత వేగంగా అంటే, బంతిని అందుకోవడం అంతే కచ్చితత్వంతో వికెట్లను నేలకూల్చడం చేశాడు. బ్యాట్స్‌మన్‌ తమీమ్‌ తేరుకునే లోపే అద్భుతమైన త్రోను విసిరి రనౌట్‌ చేయడం అభిమానుల్ని ఫుల్‌ జోష్‌లో ముంచెత్తింది. ఇక్కడ బంతి గురి తప్పకుండా, బ్యాట్స్‌మన్‌కు తగలకుండా విసరడం వీక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. ఇది ఈ వరల్డ్‌కప్‌ బెస్ట్‌ మూమెంట్స్‌లో ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ సంచలన విజయం సాధించింది.(ఇ‍క్కడ చదవండి: భళారే బంగ్లా!)


 

మరిన్ని వార్తలు