ఐపీఎల్‌  వచ్చేసింది

12 Mar, 2019 00:16 IST|Sakshi

మరో 11 రోజుల్లో మెగా టోర్నీ

వరల్డ్‌ బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ స్టంప్స్‌ను గాల్లో గిరాటేస్తే గానీ తాను వరల్డ్‌ బెస్ట్‌ బౌలర్‌ను కాలేనంటున్నాడు బుమ్రా... కెప్టెన్‌నే స్లెడ్జ్‌ చేస్తావా, ఎలాగైతేనేం అదీ నేర్చుకున్నావు అంటూ కోహ్లి జవాబు... మీ జట్టుపైనే విరుచుకు పడతానంటూ గురువుకే సవాల్‌విసురుతున్న పంత్‌... అప్పట్లో నేనూ నీలాగే ఉండేవాడిని, చూసుకుందాం రమ్మంటూ ధోని పిలుపు... ప్రకటనలు, థీమ్‌ సాంగ్‌లు, ప్రమోషన్‌లు... ఒకవైపు భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ నడుస్తుండగానే మరో వైపు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సందడి మొదలైంది. రేపు ఆఖరి మ్యాచ్‌ ముగిస్తే చాలు... టీమిండియా సభ్యులు తమ సహచరులపైనే కత్తులు దూసేందుకు ప్రతీ ఏడాదిలాగే సిద్ధమైపోతారు. జయహో అంటూ భారత్‌ విశ్వ సమరానికి వెళ్లే ముందే ఈనెల 23 నుంచి వేసవి వినోదం అందించేందుకు మరోసారి క్రికెట్‌ అభిమానుల పండగ ఐపీఎల్‌ వచ్చేసింది. అన్ని జట్లు అందుబాటులో ఉన్న క్రికెటర్లతో ఇప్పటికే జోరుగా సన్నాహాలు సాగిస్తుండగా, స్టార్‌ ఆటగాళ్లు కూడా వారితో చేరితే అందరి కళ్లూ లీగ్‌ వైపే నిలుస్తాయి. మరో 11 రోజుల్లో ‘ఆట తప్ప మాటలొద్దు’ అంటూ లీగ్‌ సంబరాలు షురూ కానున్న నేపథ్యంలో గత 11 ఐపీఎల్‌ టోర్నీల ఫలితాల విశేషాలు.... 

బిగ్‌ బ్యాంగ్‌... 
ఏప్రిల్‌ 18, 2008... ఐపీఎల్‌ చరిత్రలో మరచిపోలేని తేదీ. ఒక కొత్త టోర్నీకి ఎలాంటి ఆరంభం లభిస్తే అది సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతుందో ఆ రోజు అలాంటి మ్యాచ్‌తోనే లీగ్‌ మొదలైంది. బెంగళూరుతో మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మన్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ 73 బంతుల్లోనే 10 ఫోర్లు, 13 సిక్సర్లతో అజేయంగా 158 పరుగులు చేసి ప్రేక్షకులకు మజా అందించాడు. ఈ ఇన్నింగ్స్‌తో టి20 రుచిమరిగిన అభిమానులను ఇప్పటికీ ఐపీఎల్‌ మత్తులోనే ముంచెత్తుతోంది.  

మరచిపోలేని చెంపదెబ్బ! 
తొలి ఐపీఎల్‌లో ఆటతో పాటు అత్యంత వివాదంగా నిలిచిన అంశం శ్రీశాంత్‌ను హర్భజన్‌ సింగ్‌ చెంపదెబ్బ కొట్టడం... అతను చిన్న పిల్లాడిలా భోరున ఏడ్వడం! లీగ్‌లో పంజాబ్, ముంబై మధ్య మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటగాళ్లు ఒకరికి మరొకరు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చే సమయంలో శ్రీశాంత్‌ నుంచి ఎలాంటి కవ్వింపు లేకుండా భజ్జీ కొట్టాడని విచారణలో రిఫరీ నిర్ధారించారు. దాంతో మిగిలిన 11 లీగ్‌ మ్యాచ్‌లు ఆడకుండా భజ్జీపై నిషేధం విధించారు. ఘట న జరిగిన మ్యాచ్‌ ఫీజు లో కూడా 100 శాతం కోత విధించారు. కేవలం తొలి రెండు మ్యాచ్‌లకే ఫీజు అందుకున్న భజ్జీఈ ఘటనతో భారీగా నష్టపోయాడు కూడా.  

ఫైనల్‌  ఫలితం...
సెమీస్‌లో పంజాబ్‌ను ఓడించి చెన్నై, ఢిల్లీని ఓడించి రాజస్తాన్‌ ఫైనల్‌ చేరాయి. ముందుగా చెన్నై 5 వికెట్లకు 163 పరుగులు చేయగా, రాజస్తా న్‌ 7 వికెట్లకు 164 పరుగులు చేసి గెలిచింది. చివరి ఓవర్లో విజయానికి 8 పరుగులు చేయాల్సి ఉండగా ఆఖరి బంతికి రాయల్స్‌కు గెలుపు దక్కింది. బ్యాటింగ్‌లో 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు తీసిన యూసుఫ్‌ పఠాన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద ఫైనల్‌ మ్యాచ్‌’గా నిలిచాడు. 

చార్జర్స్‌  అట్టడుగున... 
టోర్నీలో హైదరాబాద్‌ జట్టు దక్కన్‌ చార్జర్స్‌ ఘోరంగా విఫలమైంది. ఆడిన 14 లీగ్‌ మ్యాచ్‌లలో కేవలం 2 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చిట్ట చివరన నిలిచింది. జట్టు తరఫున గిల్‌క్రిస్ట్‌ (436), రోహిత్‌ శర్మ (404) పరుగుల పరంగా టాపర్లుగా నిలవగా... ఆర్పీ సింగ్‌ 15, ప్రజ్ఞాన్‌ ఓజా 11 వికెట్లు తీశారు. 

రాజస్తాన్‌ రాయల్స్‌ రాజసం 

2008 నుంచి 2018 వరకు 11 ఐపీఎల్‌ టోర్నీలు జరిగాయి. ఇందులో చెన్నై సూపర్‌ కింగ్స్, ముంబై ఇండియన్స్‌ చెరో 3 సార్లు టైటిల్‌ సొంతం చేసుకొని తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రెండు సార్లు విజేతగా నిలవగా... రెండు వేర్వేరు పేర్లతో హైదరాబాద్‌ జట్లు దక్కన్‌ చార్జర్స్, సన్‌రైజర్స్‌ జట్లు ఒక్కోసారి టోర్నీని గెలుచుకున్నాయి. అయితే అనూహ్యంగా, అంచనాలు లేకుండా, స్టార్‌ ఆటగాళ్ల బలగం లేకుండా రాజస్తాన్‌ 2008 టైటిల్‌ సాధించడం విశేషం. పొట్టి క్రికెట్‌కు కొత్త ఊపు తెచ్చిన టోర్నమెంట్‌ తొలి టైటిల్‌ని సొంతం చేసుకున్న టీమ్‌గా షేన్‌ వార్న్‌ నాయకత్వంలోని రాయల్స్‌ ఘనత వహించింది. ఈ టోర్నీ విశేషాలను గుర్తు చేసుకుంటే... 

టీమ్‌ గుర్తుందా! 
రాజస్తాన్‌ టైటిల్‌ గెలిచిన జట్టు సభ్యులలో 19 మంది లీగ్‌లో కనీసం ఒక్క మ్యాచ్‌ అయినా ఆడారు. వీరిలో అంతర్జాతీయ క్రికెటర్లు షేన్‌ వార్న్,  గ్రేమ్‌ స్మిత్, షేన్‌ వాట్సన్, కమ్రాన్‌ అక్మల్, సొహైల్‌ తన్వీర్, డారెన్‌ లీమన్, మస్కరెన్హాస్, యూనిస్‌ ఖాన్‌లను వదిలిస్తే... యూసుఫ్‌ పఠాన్, రవీంద్ర జడేజా, మొహమ్మద్‌ కైఫ్, మునాఫ్‌ పటేల్‌ భారత్‌ తరఫున తమ ముద్ర చూపించిన ఆటగాళ్లు. పంకజ్‌ సింగ్‌ 2 టెస్టులు, 1 వన్డే ఆడగా... నీరజ్‌ పటేల్, స్వప్నిల్‌ అస్నోడ్కర్, దినేశ్‌ సాలుంఖే, మహేశ్‌ రావత్, తరువర్‌ కోహ్లి, సిద్ధార్థ్‌ త్రివేది ఎప్పుడూ జాతీయ జట్టులోకి ఎంపిక కాలేకపోయారు.   

శతకవీరులు 
లీగ్‌లో మొత్తం ఆరు సెంచరీలు నమోదైతే నాలుగు ఆస్ట్రేలియన్లే చేశారు. మెకల్లమ్, సైమండ్స్, హస్సీ, షాన్‌ మార్‌‡్ష, గిల్‌క్రిస్ట్‌లతో పాటు సనత్‌ జయసూర్య సెంచరీ సాధించాడు. టోర్నీలో జయసూర్య మొత్తం 31 సిక్సర్లతో టాపర్‌గా నిలవడం విశేషం.  

పాకిస్తాన్‌  ఒకే ఒక్కసారి...  

తొలి ఐపీఎల్‌లో పాకిస్తాన్‌ ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు. అయితే అదే ఏడాది 9/11 ముంబై దాడి తర్వాత వారు లీగ్‌లో పాల్గొనకుండా నిషేధం విధించారు. దాంతో 2008లో ఆడిన షాహిద్‌ అఫ్రిది, షోయబ్‌ మాలిక్, మొహమ్మద్‌ ఆసిఫ్, సల్మాన్‌ బట్, ఉమర్‌ గుల్, మొహమ్మద్‌ హఫీజ్, షోయబ్‌ అక్తర్, కమ్రాన్‌ అక్మల్, సొహైల్‌ తన్వీర్, యూనిస్‌ ఖాన్, మిస్బావుల్‌ హక్‌ మళ్లీ ఐపీఎల్‌లో కనిపించలేదు.   

మరిన్ని వార్తలు