కరోనా ఎఫెక్ట్‌: ‘సారీ నో సెల్ఫీ’

20 Mar, 2020 20:14 IST|Sakshi

కరోనా వైరస్‌ విజృంభణ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అన్ని వ్యవస్థలు ఘోరంగా దెబ్బతినగా.. వినోద రంగం కూడా కుదేలైంది. ఇప్పటికే అన్ని సినిమా రిలీజ్‌లు, షూటింగ్‌లు, ఫంక్షన్స్‌ రద్దయ్యాయి. మరోవైపు క్రీడా రంగంపై కరోనా ఎఫెక్ట్‌ భారీగానే ఉంది. ఇప్పటికే అన్ని టోర్నీలు, సిరీస్‌లు, పర్యటనలు రద్దైన విషయం తెలిసిందే. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ సైతం కరోనా బారి నుంచి తప్పించుకోలేకపోయింది. ఇక టీమిండియా-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు కూడా మధ్యలోనే ఎండ్‌ కార్డ్‌ పడింది. సిరీస్‌లు, పర్యటనలు లేకపోవడంతో టీమిండియా క్రికెటర్లు ఇంటిపట్టునే ఉంటున్నారు. వీరికి బీసీసీఐ గట్టిగా వార్నింగ్‌ ఇస్తూ కొన్ని మార్గనిర్దేశకాలు చేసింది.  

బీసీసీఐ మార్గ నిర్దేశకాల ప్రకారం ఆటగాళ్లు అభిమానులకు ఆటోగ్రాఫ్స్‌, సెల్పీలు ఇవ్వకూడదని గట్టిగా హెచ్చరించింది. అంతేకాకుండా ఫ్యాన్స్‌ను ఎట్టిపరిస్థితుల్లో కలవకూడదనే నిబంధనను కూడా చేర్చింది. తమ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ల కూడదని సూచించింది.  అదేవిధంగా ఆటగాళ్ల ప్రాక్టీస్‌ సెషన్స్‌, ట్రైనింగ్‌ క్యాంప్‌లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో బీసీసీఐ నిబంధనలను భారత క్రికెటర్లు ఫాలో అవుతున్నారనే దానికి ఈ ఒక్క చిన్న వీడియో ఉదాహరణగా నిలిచింది. 

సఫారీతో సిరీస్‌ రద్దవ్వగానే భారత క్రికెటర్లు ఇంటిదారి పట్టారు. అయితే సారథి విరాట్‌ కోహ్లిని విమానాశ్రయంలో ఓ యువతి సెల్ఫీ అడగ్గా ఆమెను చూసిచూడనట్టు వెళ్లి పోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  కాగా, ఆటగాళ్లు సైతం కరోనా వ్యాప్తి నివారణ కోసం తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేలా పలు వీడియోలు రూపొందిస్తూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. 
 

చదవండి: 
2 లక్షలు దాటిన కరోనా కేసులు..
కనికా నిర్లక్ష్యంతో పార్లమెంటులో కలకలం

మరిన్ని వార్తలు