నన్ను ఒసామా అని పిలిచాడు

16 Sep, 2018 04:31 IST|Sakshi

ఆసీస్‌ క్రికెటర్‌పై మొయిన్‌ అలీ ఆరోపణ

2015 నాటి యాషెస్‌ సిరీస్‌ సందర్భంగా ఘటన

మెల్‌బోర్న్‌: తనపై ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఒకరు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ ఆరోపించాడు. 2015 యాషెస్‌ సిరీస్‌ సందర్భంగా కార్డిఫ్‌లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్‌ ఆటగాడు తనను ఉద్దేశించి ‘ఒసామా’ అని సంబోధించాడని పేర్కొన్నాడు. త్వరలో విడుదల కానున్న తన ఆత్మకథలో అలీ ఈ విషయాన్ని రాసుకొచ్చాడు. ‘యాషెస్‌లో నాకు అదే తొలి టెస్టు. నా ప్రదర్శన (77 పరుగులు, ఐదు వికెట్లు)ను గొప్పగా భావిస్తున్నా. అదే సమయంలో మైదానంలో ఓ ఘటన కలచి వేసింది. ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఒకరు నావైపు తిరిగి ‘టేక్‌ దట్, ఒసామా’ అని వ్యాఖ్యానించాడు. ఆ క్షణంలో నిజమేనా? అని ఆశ్చర్యపోయా. తర్వాత అర్థమైంది. నేనైతే గ్రౌండ్‌లో ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు’ అని అలీ అన్నాడు.

‘ఇంగ్లండ్‌ జట్టులోని ఇద్దరు ఆటగాళ్లకు విషయం చెప్పా. వారు మా కోచ్‌ ట్రెవర్‌ బేలిస్‌కు చేరవేశారు. ఆయన ఆసీస్‌ కోచ్‌ డారెన్‌ లీమన్‌తో మాట్లాడాడు. లీమన్‌ ఆ ఆటగాడిని పిలిచి ప్రశ్నించగా... అతడు ఖండించాడు. ‘టేక్‌ దట్‌ యు పార్ట్‌ టైమర్‌’ అని మాత్రమే అన్నట్లు చెప్పాడు. సిరీస్‌ ముగిశాక కూడా ఆ ఆటగాడు తప్పును ఒప్పుకోలేదు’ అని అలీ వివరించాడు. ఈ వ్యాఖ్యల కారణంగా మిగతా మ్యాచ్‌ మొత్తం తాను ఆగ్రహంగా ఆడానని పేర్కొన్నాడు. మరోవైపు ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) అధికార ప్రతినిధి  తెలిపారు. ఇలాంటి ప్రవర్తనను సహించమని, ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు నుంచి పూర్తి వివరాలు తెప్పించుకుని విచారణ చేపడతామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు