హర్భజన్‌ ఇంత దురహంకారమా?

6 Oct, 2018 08:46 IST|Sakshi
హర్భజన్‌ సింగ్‌ (ఫైల్‌ ఫోటో)

నువ్వో క్రికెటర్‌వని మరిచిపోయవా?

సోషల్‌ మీడియా వేదికగా అభిమానుల ఫైర్‌

రాజ్‌కోట్‌ : టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న భారత్‌-వెస్టిండీస్‌ తొలి టెస్ట్‌ నేపథ్యంలో భజ్జీ చేసిన ట్వీట్‌ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. విరాట్‌ కోహ్లి, పృథ్వీషా, జడేజాల సెంచరీలు.. పుజారా, రిషబ్‌ పంత్‌ల హాఫ్‌ సెంచరీలతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను 649/9 స్కోర్‌ వద్ద  డిక్లేర్డ్‌ చేసిన విషయం తెలిసిందే. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఏ మాత్రం పోరాట పటిమను కనబర్చలేకపోయారు. దీంతో ఆ జట్టు 74 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ సందర్భంగా భజ్జీ ‘వెస్టిండీస్‌ క్రికెట్‌పై గౌరవం ఉంది. కానీ మీ అందరికి సంబంధించి నా దగ్గర ఓ ప్రశ్న ఉంది. ప్రస్తుత వెస్టిండీస్‌ జట్టు కనీసం రంజీ క్వార్టర్స్‌లోనైనా అర్హత సాధించగలదా?’ అని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశాడు.

ఈ ట్వీట్‌పై యావత్‌ క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. ‘2011,2014 ఇంగ్లండ్‌ పర్యటనల్లో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్స్‌ ఇలానే ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పేవాడివి? ఇంత దురహంకారమా?’ అని ఒకరు.. ‘ఇంగ్లండ్‌ గడ్డపై మనం ఆడుతున్నప్పుడు వారికి ఇలానే అనిపిస్తే! దురహంకారంగా మాట్లాడకు.. నువ్వో క్రికెటర్‌వని మరిచిపోయవా?’ అని  మరొకరు ఘాటుగా ప్రశ్నించారు. ‘వెస్టిండీస్‌ జట్టుపై కొంచెం గౌరవం ఉందని ఎలా చెపుతావ్‌? విండీస్‌, ఇంగ్లండ్‌ గడ్డపై పాకిస్తాన్‌తో టెస్ట్‌ మ్యాచ్‌ గెలిచింది. వాళ్ల కీలక ఆటగాళ్లు ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు.’ అని, ‘నీ నుంచి ఇలాంటి ట్వీట్‌ ఊహించలేదని’  కొందరు కామెంట్‌ చేస్తున్నారు. 

ఇక ఈ టెస్ట్‌లో భారత్‌ పట్టుబిగించింది. అద్భుత శతకంతో తొలి రోజు యువ ఓపెనర్‌ పృథ్వీ షా వేసిన బలమైన పునాదిని శుక్రవారం రెండో రోజు విరాట్‌ కోహ్లి (230 బంతుల్లో 139; 10 ఫోర్లు), రవీంద్ర జడేజా (132 బంతుల్లో 100 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) మరింత బలపరిచారు. వీరికి వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (84 బంతుల్లో 92; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడు తోడవడంతో తొలి ఇన్నింగ్స్‌ను భారత్‌ 649/9 వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ను మహ్మద్‌ షమీ (2/11) దెబ్బతీశాడు.

మరిన్ని వార్తలు