భారత్ బల్లే బల్లే...

24 Oct, 2016 06:42 IST|Sakshi
భారత్ బల్లే బల్లే...

మూడో వన్డేలో ఘన విజయం
  7 వికెట్లతో న్యూజిలాండ్ చిత్తు
కోహ్లి భారీ సెంచరీ, రాణించిన ధోని
  నాలుగో మ్యాచ్ బుధవారం   

 
 ఛేదనలో తనకు అలవాటైన రీతిలో కోహ్లి మరో అలవోక సెంచరీ... ఈ రోజు చెలరేగాల్సిందే అన్నట్లుగా బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చి పట్టుదలగా చక్కటి ఇన్నింగ్స్ ఆడిన ధోని... ఇద్దరు అగ్రశ్రేణి ఆటగాళ్ల క్లాసిక్ బ్యాటింగ్ భారత్‌కు న్యూజిలాండ్‌పై కీలక విజయాన్ని అందించింది. గత మ్యాచ్‌లో ఎదురైన ఓటమి నుంచి వెంటనే కోలుకుంటూ సిరీస్‌లో మన జట్టు మళ్లీ ఆధిక్యంలో నిలిచింది. రికార్డుల విరాట్ చివరి వరకూ నిలిచి తనకే సాధ్యమైన రీతిలో మరో ఘన విజయాన్ని జట్టు ఖాతాలో చేర్చాడు. అంతకుముందు ఒక దశలో 46 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయినా... నీషమ్, హెన్రీ ఆదుకోవడంతో మెరుగైన స్కోరు సాధించగలిగిన న్యూజిలాండ్ చివరకు దానిని కాపాడుకోవడంలో మాత్రం విఫలం అయింది.  
 
 మొహాలి (పంజాబ్): స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి (134 బంతుల్లో 154 నాటౌట్; 16 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీకి తోడు కెప్టెన్ ధోని (91 బంతుల్లో 80; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత బ్యాటింగ్‌తో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డే భారత్ వశమైంది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ధోని సేన 7 వికెట్లతో కివీస్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 49.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది. లాథమ్ (72 బంతుల్లో 61; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా... నీషమ్ (47 బంతుల్లో 57; 7 ఫోర్లు), హెన్రీ (37 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) తొమ్మిదో వికెట్‌కు 67 బంతుల్లోనే 84 పరుగులు జోడించారు. అనంతరం భారత్ 48.2 ఓవర్లలో 3 వికెట్లకు 289 పరుగులు చేసింది. కోహ్లి, ధోని మూడో వికెట్‌కు 151 పరుగులు జత చేశారు. ఈ ఫలితంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. నాలుగో వన్డే బుధవారం రాంచీలో జరుగుతుంది.
 
 రాణించిన లాథమ్...

 టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ మార్పులు లేకుండా బరిలోకి దిగింది. కివీస్ జట్టులో డెవ్‌సిక్ స్థానంలో నీషమ్ వచ్చాడు. కివీస్ ఓపెనర్లు గప్టిల్ (27), లాథమ్ జాగ్రత్తగా ఆడటంతో తొలి మూడు ఓవర్లలో 12 పరుగులే వచ్చాయి. కానీ పాండ్యా వేసిన తర్వాతి ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్ కొట్టిన గప్టిల్, అతని తర్వాతి ఓవర్లోనూ మరో ఫోర్, సిక్స్ బాదాడు. అయితే అతడిని ఎల్బీగా అవుట్ చేసి ఉమేశ్ భారత్‌కు తొలి వికెట్ అందించాడు. గత మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన విలియమ్సన్ (22) ఈసారి భారీ ఇన్నింగ్‌‌స ఆడలేకపోయాడు.
 
  అరుుతే వరుసగా మూడో మ్యాచ్‌లోనూ పార్ట్‌టైమర్ కేదార్ జాదవ్ భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. తన రెండో ఓవర్లోనే అతను కివీస్ కెప్టెన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఘోరమైన ఫామ్‌తో ఇబ్బందుల్లో ఉన్న రాస్ టేలర్ (57 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్) ఈ మ్యాచ్‌లోనూ ఆరంభంలో తడబడ్డాడు. పటేల్, మిశ్రా బౌలింగ్‌ను ఎదుర్కోలేక తొలి 28 బంతుల్లో 14 పరుగులే చేసిన అతను ఆ తర్వాత వేగంగా పరుగులు సాధించగలిగాడు. మరోవైపు చక్కటి షాట్లతో దూసుకుపోయిన లాథమ్ అర్ధ సెంచరీ 59 బంతుల్లో పూర్తయింది.
 
 అరుుతే ఈ దశలో వరుసగా నాలుగు ఓవర్లలో కివీస్ నాలుగు వికెట్లు కోల్పోయింది. మిశ్రా, జాదవ్ చెరో 2 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశారు. అండర్సన్ (6)తో పాటు క్రీజ్‌లో పాతుకుపోయిన లాథమ్‌ను జాదవ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే సాన్‌ట్నర్ (7), సౌతీ (13) కూడా వెనుదిరిగారు. ఒక దశలో 153/3తో మెరుగ్గా కనిపించిన న్యూజిలాండ్ 9.2 ఓవర్ల వ్యవధిలో 46 పరుగులు మాత్రమే జోడించి 6 వికెట్లు కోల్పోయింది.
 
 ఆదుకున్న జోడి...
 ఈదశలో నీషమ్, హెన్రీ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చకచకా పరుగులు సాధించారు. ముఖ్యంగా ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఇద్దరూ చెలరేగారు.ముందుగా నీషమ్ రెండు ఫోర్లు కొట్టగా, తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో హెన్రీ 6,4,4 బాదాడు. 44 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న నీషమ్ చివరకు ఉమేశ్ బౌలింగ్‌లోనే వెనుదిరగ్గా, మరో నాలుగు బంతుల తర్వాత కివీస్ ఇన్నింగ్‌‌స ముగిసింది.
 
 భారీ భాగస్వామ్యం...
 లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలోనే రహానే (5) వికెట్ కోల్పోగా,  రోహిత్ (13) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఈ దశలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని, కోహ్లి కలిసి ఇన్నింగ్‌‌సను నడిపించారు. తనకు లభించిన లైఫ్‌ను కోహ్లి చక్కగా ఉపయోగించుకున్నాడు. చూడచక్కటి షాట్లతో కనువిందు చేశాడు. ధోని కూడా చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్‌‌స ఆడాడు. వీరిద్దరు పోటీ పడి పరుగులు సాధించడంతో భారత్ స్కోరు చకచకా ముందుకు సాగింది.
 
  కివీస్ జట్టు వీరిద్దరిని నిరోధించడంలో విఫలమైంది. తీవ్రమైన మంచు కారణంగా కూడా ఆ జట్టు బౌలర్లకు బంతిపై పట్టు చిక్కలేదు. 49 బంతుల్లో కోహ్లి, 59 బంతుల్లో ధోని అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. చూస్తుండగానే వీరి భాగస్వామ్యం సెంచరీ దాటి 150 పరుగులకు చేరుకుంది. ఎట్టకేలకు 27 ఓవర్లు శ్రమించిన తర్వాత ఈ జోడీని విడదీయడంలో కివీస్ సఫలమైంది. హెన్రీ బౌలింగ్‌లో షార్ట్ కవర్స్‌లో టేలర్‌కు క్యాచ్ ఇచ్చి ధోని వెనుదిరిగాడు. అయితే మరోవైపు కోహ్లి జోరు మాత్రం ఆగలేదు.
 
  నీషమ్ బౌలింగ్‌లో థర్డ్‌మ్యాన్ దిశగా సింగిల్ తీసి 104 బంతుల్లో అతను సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మనీశ్ పాండే (34 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు) చక్కటి సహకారం అందించడంతో భారత్‌కు  లక్ష్యం దిశగా ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాలేదు.  బౌల్ట్ వేసిన 48వ ఓవర్లో కోహ్లి ఏకంగా మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సహా 22 పరుగులు రాబట్టడంతో స్కోర్లు సమం కాగా, తర్వాతి ఓవర్ రెండో బంతికి బౌండరీ కొట్టి పాండే మ్యాచ్‌ను ముగించాడు.
 
 స్కోరు వివరాలు
 న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : గప్టిల్ (ఎల్బీ) (బి) ఉమేశ్ 27; లాథమ్ (సి) పాండ్యా (బి) జాదవ్ 61; విలియమ్సన్ (ఎల్బీ) (బి) జాదవ్ 22; టేలర్ (స్టంప్డ్) ధోని (బి) మిశ్రా 44; అండర్సన్ (సి) రహానే (బి) జాదవ్ 6; రోంచీ (స్టంప్డ్) ధోని (బి) మిశ్రా 1; నీషమ్ (సి) జాదవ్ (బి) ఉమేశ్ 57; సాన్‌ట్నర్ (సి) కోహ్లి (బి) బుమ్రా 7; సౌతీ (బి) ఉమేశ్ 13; హెన్రీ (నాటౌట్) 39; బౌల్ట్ (బి) బుమ్రా 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 285.
 
 వికెట్ల పతనం: 1-46; 2-80; 3-153; 4-160; 5-161; 6-169; 7-180; 8-199; 9-283; 10-285
 
 బౌలింగ్: ఉమేశ్ 10-0-75-3; పాండ్యా 5-0-34-0; బుమ్రా 9.4-0-52-2; జాదవ్ 5-0-29-3; పటేల్ 10-0-49-0; మిశ్రా 10-0-46-2.
 
 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) సౌతీ 13; రహానే (సి) సాన్‌ట్నర్ (బి) హెన్రీ 5; కోహ్లి (నాటౌట్) 154; ధోని (సి) టేలర్ (బి) హెన్రీ 80; పాండే (నాటౌట్) 28; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (48.2 ఓవర్లలో 3 వికెట్లకు) 289.
 
 వికెట్ల పతనం: 1-13; 2-41, 3-192.
 
 బౌలింగ్: హెన్రీ 9.2-0-56-2; బౌల్ట్ 10-0-73-0; సౌతీ 10-0-55-1; సాన్‌ట్నర్ 10-0-43-0; నీషమ్ 9-0-60-0.
 
 కోహ్లి క్యాచ్ వదిలేస్తే...
 ప్రపంచ క్రికెట్‌లో టాప్ బ్యాట్స్‌మన్, ఒక్కసారిగా నిలదొక్కుకుంటే ఎదురులేని ఆటతో మ్యాచ్ లాగేసుకోగలడు. గత మ్యాచ్‌లో కోహ్లి వైఫల్యంతోనే కివీస్‌కు పట్టు చిక్కింది. అలాంటి విరాట్ కోహ్లిని అవుట్ చేసే అవకాశాన్ని కివీస్ చేజేతులా కోల్పయింది. అతను 6 పరుగుల వద్ద ఉన్నప్పుడు హెన్రీ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను వైడ్ స్లిప్‌లో టేలర్ నేలపాలు చేశాడు. నేరుగా చేతుల్లో పడిన బంతిని అతను అందుకోవడంలో విఫలమయ్యాడు. అంతే... ఆ తర్వాత దూసుకుపోయిన విరాట్, భారీ సెంచరీతో జట్టును విజయతీరం చేర్చాడు. కోహ్లి పరుగులు పెరుగుతున్న కొద్దీ టీవీ కెమెరాలు తననే చూపిస్తుండటంతో పాపం టేలర్ మొహం చిన్నబోయింది!
 
 ధోని @ :  9000
 భారత్ కెప్టెన్ ఎమ్మెస్ ధోని వన్డేల్లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. సాన్‌ట్నర్ బౌలింగ్‌లో తనదైన శైలిలో భారీ సిక్సర్ కొట్టి అతను ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 17వ ఆటగాడు కాగా, భారత్ తరఫున సచిన్, గంగూలీ, ద్రవిడ్, అజహర్ తర్వాత ధోని ఐదో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ జాబితాలో 50కి పైగా సగటు ఉన్న ఏకై క క్రికెటర్ అతనే. మరోవైపు వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా కూడా సచిన్ (195) రికార్డును ధోని దాటాడు. మొత్తం కెరీర్‌లో ధోని 196 సిక్సర్లు బాదాడు.
 
 26
 కోహ్లి కెరీర్‌లో ఇది 26వ సెంచరీ. ఓవరాల్ జాబితాలో అతను సంగక్కర (25)ను దాటి నాలుగో స్థానంలో నిలిచాడు. అతనికంటే సచిన్ (49), పాంటింగ్ (30), జయసూర్య (28) మాత్రమే ముందున్నారు.
 
 నాకు కాస్త అదృష్టం కూడా కలిసొచ్చింది. టేలర్‌ను చూస్తే బాధేసింది. మనం క్యాచ్ వదిలేశాక ఆ బ్యాట్స్‌మన్ భారీ స్కోరు చేస్తే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నేను క్యాచ్ వదిలేస్తే మెకల్లమ్ 300 చేశాడు. కివీస్‌ను ఎక్కువ పరుగులు చేయనిచ్చాం. ఛేదనలో మాది మంచి జట్టు కాబట్టి దీనిని ఒక అవకాశంగా భావించాం. ధోని ముందుగా బ్యాటింగ్‌కు దిగడం మేలు చేసింది. - విరాట్  కోహ్లి  
 

మరిన్ని వార్తలు